మీడియా ముందుకు లగడపాటి..ఏం చెప్పారంటే?

Update: 2019-05-18 13:41 GMT
సార్వత్రిక ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ రేపు ముగుస్తుందనగా... ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన బెజవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలుగు రాష్ట్రాల్లో హీట్ పెంచేశారనే చెప్పాలి. ఆర్జీ ఫ్లాష్ టీం ద్వారా సర్వేలు చేయిస్తున్న లగడపాటి... ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి కూడా సర్వే చేయించారట. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రేపు తుది విడత పోలింగ్ ముగిసిన మరుక్షణమే తన ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడిస్తానని ఆయన గతంలోనే చెప్పారు. ఫలితం ఏమిటనే విషయాన్ని సూటిగా చెప్పకున్నా... ఈ ఎన్నికల్లోనూ ఏపీలో టీడీపీనే అధికారం చేపట్టబోతోందని ఆయన ఇప్పటికే చెప్పేశారు. తొలుత తిరుపతిలో - ఆ తర్వాత అమెరికా పర్యటనలోనూ ఆయన ఇదే మాట చెప్పారు. తాజాగా ఏపీ నూతన రాజధాని అమరావతి పరిధిలోని మల్కాపురంలో కాసేపటి క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ ఆయన ఇదే మాటను చెప్పుకొచ్చారు. అందరినీ టీవీ తెరలకు కట్టిపడేసిన లగడపాటి ఈ మీడియా సమావేశంలో ఏం చెప్పారన్న విషయానికి వస్తే...

=  రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే కాకుండా - కేంద్రంలో ఎవరు వస్తారన్న దానిపైన కూడా రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంది. ఎగ్జిట్ పోల్స్ - సర్వేలు రేపు సాయంత్రం కొద్దిగా స్పష్టతనిస్తాయని - ఈ నెల 23తో పూర్తి స్పష్టత వస్తుంది.

= ఇటీవల నేను ఫారెన్ ట్రిప్ వెళ్లాను. అక్కడి ఎన్నారైలు రాష్ట్ర పరిస్థితిపై ఎంతో ఆసక్తి చూపించారు. మనం కోరుకోకుండానే రాష్ట్రం వచ్చిందని - ఇది ఎలా అభివృద్ధి అవుతుందోనని వారు ఆరాటం ప్రదర్శించారు.

=పురాణాల్లో మనం చదువుకున్నాం. ఆనాడు పాండవులకు వేరుగా రాజ్యం ఇచ్చినప్పుడు ఖాండవ వనాన్ని ఇచ్చారు. దాన్ని వాళ్లు ఇంద్రప్రస్థం పేరుతో అద్భుతమైన రాజధానిగా మలుచుకున్నారు. అమరావతిలో కూడా 29 గ్రామాలు రాజధానిలో ఉన్నాయి. ఆ గ్రామాల ప్రజల్లో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. తాము ఇచ్చిన భూములతో రాజధాని గొప్పగా ఉంటుందా అన్నది వాళ్ల సందేహం. అందుకే రాబోయే పాలకులు ఎవరన్న దానిపై మాట్లాడుకుంటున్నారు. వాళ్లు బాధపడాల్సిన పనేమీ లేదని చెప్పాను.

=వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం అద్భుతంగా ఉండబోతోందని - ఇంద్రప్రస్థం స్థాయిలో అమరావతి ఎవరూ ఊహించనంత దివ్యంగా ఉంటుందని చెప్పాను. రాబోయే రోజుల్లో మన శాసనసభను కూడా మయసభతో పోల్చి చెప్పుకుంటారు. గిట్టనివాళ్లు అసూయపడేలా రాజధాని తయారవుతుంది. ఒకవేళ ప్రభుత్వాలు మారినా ఎలాంటి తేడారాదు.

= దేశంలో ఇలాంటి పరిస్థితి కొన్నిసార్లు వచ్చింది కానీ - ఎక్కడా అభివృద్ధి రివర్స్ అయిన దాఖలాలు లేవు. అడుగు ముందుకే పడింది తప్ప వెనక్కి వెళ్లింది ఎక్కడా లేదు కాబట్టి ఎవరొచ్చినా అభివృద్ధి ఆగదు. కాకపోతే కొత్త ప్రభుత్వాలు వస్తే కాస్త అటూఇటూగా ఉంటుంది తప్ప పెద్దగా మార్పేమీ ఉండదు" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.

=తెలంగాణలో నా సర్వేకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. తెలంగాణలో ఎందుకు తేడా వచ్చిందో తర్వాత వెల్లడిస్తాను. సర్వే రిపోర్టు ముందే చెప్పాలని చాలా మంది అడిగారు. రాజధాని ప్రాంత రైతులకు మాత్రం చెవిలో చెప్పాను. ఆదివారం సాయంత్రం తిరుపతిలో సర్వే ఫలితాలు వెల్లడిస్తాను. రేపు తెలంగాణ - ఏపీ ఫలితాలు వెల్లడిస్తాను. నాకు ఏ పార్టీతోనూ అనుబంధం లేదు. శాస్త్రీయంగా ప్రజాభిప్రాయాన్ని విశ్లేషించేందుకే సర్వేలు చేస్తా.

= ఏపీ లోటు బడ్జెట్‌ లో ఉంది కాబట్టి ప్రజలకు సైకిలే దిక్కయింది. తెలంగాణ అధిక బడ్జెట్‌ లో ఉంది కాబట్టి.. ప్రజలు కారు ప్రయాణాన్నే కోరుకుంటున్నారు. నా అంచనా తప్పైతే తెలంగాణలో నేను చెప్పిన చోట.. ఇండిపెండెంట్లు రెండో స్థానంలో వచ్చే వాళ్లు కాదు. అక్కడ ఏం జరిగిందో 23 తర్వాత వెల్లడిస్తాను. ఇప్పుడు చెబుతున్నది నా అంచనా మాత్రమే. మా టీమ్‌ శాస్త్రీయంగా పరిశీలించి అభిప్రాయాలు సేకరించి ఏం తేల్చిందో రేపు చెబుతాను.

= జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మెగాస్టార్‌ తమ్ముడు కాబట్టి.. మెగాస్టార్‌ కంటే కొంచెం తక్కువగానే ఉంటాడు. పవన్‌ కల్యాణ్‌ శాసనసభలోకి అడుగుపెడతాడు. కచ్చితమైన మెజార్టీతోనే ప్రభుత్వం వస్తుంది. ఏపీలో హంగ్‌ వచ్చే అవకాశమే లేదు. తెలుగు ప్రజలు ఎప్పుడూ గజిబిజి తీర్పు ఇవ్వలేదు. ఏపీ ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఒక పార్టీకే ఇవ్వబోతున్నారు. టీడీపీలో కంటే వైసీపీ నేతలతోనే తనకు ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. జగన్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

  


Tags:    

Similar News