ఆయ‌న ల‌వ‌ర్ ముఖ్య‌మంత్రి

Update: 2015-07-20 08:36 GMT
ప్ర‌త్యర్థులు అంటే....నిరంతరం నిప్పులు క‌క్కే తీరులోనే ఉంటార‌ని మ‌నం అనుకుంటాం. కానీ కొంద‌రు ఇందుకు భిన్నంగా ఉంటారు. ప్రేమించుకునే శ‌త్రువులు ఈ కోవ‌లోకే వ‌స్తారు. ఈ కేటగిరీలోకి వ‌చ్చేవారిలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, ఒక‌నాటి వీర స‌మైక్య‌వాది ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేర్చ‌వ‌చ్చేమో.

తెలంగాణ రాష్ర్టం కోసం ఉద్య‌మం పీక్ స్టేజీలో ఉన్న‌పుడు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ కేసీఆర్‌కు బ‌హిరంగంగా ఐల‌వ్ యూ కేసీఆర్ అని చెప్పారు. అనంత‌రం త‌నదైన పంథాలో స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్ ఉద్య‌మం న‌డిపించారు. ఆ క్ర‌మంలోనే రాష్ట్ర విభజన అంటూ జరిగితే...జీవితంలో ఇంకెప్పుడూ తెలంగాణలో అడుగుపెట్టనని శపథం చేశారు. అయితే ఈ మాజీ ఎంపీగారు ఇపుడు ఆ పంతం వీడారు. సడెన్ గా ఆయన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ లో ప్రత్యక్షమయ్యారు. అది కూడా సకుటుంబ సపరివార సమేతంగా!

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే...పుష్కర స్నానం ఆచరించేందుకు లగడపాటి కరీంనగర్ వచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌ను క‌లిసి మీడియ‌తో మాట్లాడుతూ...కరీంనగర్ జిల్లాతో తనకు ఎనలేని అనుబంధం ఉందని, బాల్యంలో తరచూ రామగుండం వచ్చేవాడినని చెప్పారు. గత మూడేళ్లుగా కాళేశ్వరం త్రివేణి సంగమంలో స్నానం చేసి ముక్తీశ్వరుని ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటున్నట్టు లగడపాటి వెల్లడించారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో అది సాధ్యం కాలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో త్రివేణి సంగమంలో కుటుంబసమేతంగా పుష్కర స్నానం ఆచరించి ముక్తీశ్వరుని ఆశీర్వాదం తీసుకుంటున్న‌ట్లు లగడపాటి తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో చేసిన శపథం గురించి మీడియా ప్రశ్నించగా, లగడపాటి నవ్వుతూ సమాధానం దాటవేసారు. నదులకు ప్రాంతాలు పట్టింపులతో సంబంధం లేదన్న ఆయన పుష్కర స్నానానికి వచ్చి రాజకీయాలు మాట్లాడబోనని తేల్చి చెప్పారు.

ఇంత ప్రేమ ల‌గ‌డ‌పాటికి ఎందుకు పుట్టిందంటే...ఇక్క‌డ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ది ఆయ‌న ప్రేమికుడు క‌దా అని ప‌లువురు సెటైరిక్‌గా అంటున్నారు.
Tags:    

Similar News