రాహుల్ కు బ్యాడ్ టైం!..మోదీలంతా ఒక్క‌ట‌య్యారు!

Update: 2019-04-19 16:21 GMT
కాంగ్రెస్ పార్టీ అధినేత‌ - యూపీఏ త‌ర‌ఫున ఎప్పుడెప్పుడు ప్ర‌ధానమంత్రి ప‌ద‌విని ఎక్కేద్దామా? అంటూ ఎదురుచూస్తున్న రాహుల్ గాంధీకి నిజంగానే టైమేమీ బాగా లేనట్టుగా ఉంది. ఏ అంశాన్ని తీసుకున్నా... అది ఆయ‌న‌కు క‌లిసిరాక‌పోగా... తిరిగి ఎదురు త‌న్నుతోంది. పార్టీపై ఓ మోస్త‌రు ప‌ట్టు సాధించిన రాహుల్‌... వైరి వ‌ర్గాల‌ను టార్గెట్ చేయ‌డంలో ఇప్ప‌టికీ పెద్ద‌గా ప‌రిణ‌తి సాధించ‌లేద‌న్న వాద‌న మ‌రోమారు రుజువైపోయింది. ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేయ‌డంలో భాగంగా రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు... ఏకంగా మోదీ అనే పేరు ఉన్న వారంద‌రినీ ఏకం చేయ‌డ‌మే కాకుండా... వ‌రుస‌గా ఆయ‌న‌కు పంచ్ ల మీద పంచ్ లు ప‌డుతున్నాయి. ఈ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టికే ప్ర‌ధాని మోదీ బీసీ కార్డును బ‌య‌ట‌కు తీసేశారు. రెండో మోదీగా తెర‌మీద‌కు వ‌చ్చిన బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ ద్కారా రాహుల్ కు ఇప్ప‌టికే ఓ కోర్టు నోటీసు రాగా... ఇంకో కోర్టు నోటీసుకు కూడా రెడీ కావాలంటూ మూడో మోదీ వార్నింగిచ్చేశారు. ఈ మూడో మోదీ మ‌రెవ‌రో కాదు ఐపీఎల్ కు రూప‌క‌ల్ప‌న చేసిన ల‌లిత్ మోదీ.

అవినీతి ఆరోప‌ణ‌ల‌పై కేసులు న‌మోదైన త‌ర్వాత ఎంచ‌క్కా దేశం విడిచి పారిపోయిన ల‌లిత్‌... ప్ర‌స్తుతం లండ‌న్ లో ఉంటున్నారు. రాహుల్ వ్యాఖ్య‌ల‌పై త‌న‌దైన శైలిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ల‌లిత్... రాహుల్ ను ఏకంగా బ్రిట‌న్ కోర్టుకు ఈడుస్తానంటూ భారీ హెచ్చరికే చేశారు. మొత్తంగా మోదీని టార్గెట్ చేస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు... ప్ర‌ధాని మోదీకి బాస‌ట‌గా మోదీలంతా క్యూ క‌ట్టినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా ఈ మోదీలంద‌రికీ కాలేలా రాహుల్ ఏం వ్యాఖ్య‌లు చేశార‌న్న విష‌యానికి వ‌స్తే... మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా... దొంగలందరి పేరులో మోదీ ఎందుకు ఉందని వ్యాఖ్యానించారు. వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో నీరవ్ మోదీ - ఐపీఎల్ వ్యవహారంలో లలిత్ మోదీ - రాఫెల్ డీల్ విషయంలో ప్రధాని మోదీ నిందితుడంటూ సంచ‌న‌ల కామెంట్ చేశారు. ఈ కామెంట్ కొత్త‌దేమీ కాక‌పోయిన‌ప్ప‌టికీ... ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో మోదీ అనే పేరున్న వారంతా ఒక్క‌సారిగా రాహుల్ పై అటాక్ ప్రారంభించారు.

ఇప్ప‌టికే రాహుల్ పై సుశీల్ మోదీ ఫిర్యాదు చేయగా... కోర్టు ఆయ‌న‌కు నోటీసు జారీ చేసింది. తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎంట్రీ ఇచ్చిన ల‌లిత్ మోదీ....  రాహుల్ ను ఏకంగా బ్రిట‌న్ కోర్టుకు లాగుతానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాకుండా త‌న ట్వీట్ ను ఆయ‌న ప్ర‌ధాని మోదీ ట్విట్ట‌ర్ హ్యాండిల్ లో పోస్టు చేయ‌డం గ‌మ‌నార్హం. మోదీలను అవమానించేలా మాట్లాడిన రాహుల్‌ ను బ్రిటన్ కోర్డుకీడ్చుతానని అందులో ల‌లిత్‌ వార్నింగ్ ఇచ్చారు. ఐదు దశాబ్దాల పాలనలో దేశాన్ని దోచుకున్నది గాంధీ - నెహ్రూ కుటుంబమేనన్నది జగమెరిగిన సత్యమని లలిత్ మోదీ ఆ ట్వీట్ లో మ‌రో సంచ‌ల‌న కామెంట్ కూడా చేశారు. మొత్తంగా సింగిల్ కామెంట్ తో మోదీలంతా ఏక‌మ‌య్యేలా చేసిన రాహుల్‌..  త‌నకు తానే ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయార‌న్న మాట‌.


Tags:    

Similar News