పెట్రో ధరల తగ్గింపు గుట్టు చెప్పిన లాలూప్రసాద్

Update: 2021-11-05 04:01 GMT
పెరగటమే కానీ తగ్గటం అన్నది లేకుండా పోయిన పెట్రోల్.. డీజిల్ ధరల రెక్కల్ని కాస్తంత కత్తిరిస్తూ కేంద్రంలోని మోడీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటం.. అందులో బీజేపీకి ఎదురుదెబ్బలు తగలటం ఒక ఎత్తు అయితే.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో ఉప ఎన్నిక ప్రచారంలో పెట్రోల్.. డీజిల్ ధరలు పెరగటంపై బీజేపీ రాజకీయ ప్రత్యర్థులు పెద్ద ఎత్తున విమర్శలు చేయటం తెలిసిందే. తాజా ఓటమిలో పెరిగిన పెట్రో ధరలు కూడా కారణమన్న మాట వినిపిస్తోంది.

ఇలాంటివేళ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడైన 24 గంటల వ్యవధిలోనే భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రంలోని మోడీ సర్కారు. లీటరు పెట్రోల్ మీద రూ.5.. లీటరు డీజిల్ మీద రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించటం ఒక ఎత్తు అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరింత తగ్గిస్తూ అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవటంతో పెద్ద ఎత్తున ప్రయోజనాన్ని ప్రజలు పొందుతున్నారన్న మాట వినిపిస్తోంది.

ఇలాంటివేళ.. పెట్రో ధరల్ని తగ్గిస్తూ మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన రీతిలో పంచ్ లు వేశారు. అసలు పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గించటం వెనకున్న అసలు కారణాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కొద్ది నెలల్లోజరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసమే తాజా తగ్గింపుగా లాలూ చెప్పారు. ఒక్కసారి యూపీ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే.. మళ్లీ ధరలు పెంచేస్తారని ఆయన అభిప్రాయ పడ్డారు.

దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిందని.. వచ్చే ఏడాది జరగనున్న యూపీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితమే వస్తుందన్న ఆలోచనతో.. తాజాగా పెట్రోల్.. డీజిల్ ధరలకు సంబంధించిన వ్యాట్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. తగ్గించిన ధరలు ఎంతోకాలం ఉండవని.. 2022లో యూపీలో ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇంధన ధరలకు రెక్కలు వస్తాయని.. నిజంగా తగ్గించటం అంటే.. లీటరు పెట్రోల్.. డీజిల్ రూ.50లకు రావటమేనని లాలూ పేర్కొంటున్నారు. మరి.. ఆయన మాటలో నిజం ఎంతో కాలమే డిసైడ్ చేయాలి.




Tags:    

Similar News