మోడీ తోలు తీస్తామంటున్న మాజీ మంత్రి

Update: 2017-11-27 12:08 GMT
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ త‌న‌యుడు, మాజీ మంత్రి తేజ్‌ప్ర‌తాప్ యాద‌వ్‌  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల లాలూ సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 23న కొందరు రాజకీయ నాయకుల సెక్యూరిటీని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో బీహార్ నుంచి లాలూతోపాటు బీహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ, శరద్‌యాదవ్‌లకు భద్రతను కూడా తగ్గించేశారు. దీనిపై ఆర్జేడీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. లాలూ కుమారుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ అయితే ఏకంగా..త‌న తండ్రికి ఏమైనా జరిగితే ప్రధాని మోడీ తోలు తీస్తామంటూ హెచ్చరించారు.

సెక్యురిటీ నిర్ణ‌యంపై తీవ్రంగా మండిపడిన తేజ్ ప్ర‌తాప్ `లాలూని చంపడానికి కుట్ర జరుగుతున్నది. మేము చూస్తూ ఊరుకోం...మోడీ తోలు వలుస్తాం` అని వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ పరిసరాల్లోనే ఆయన ఈ కామెంట్స్ చేయడంతో అధికార పక్షం సభ్యులు నిరసన తెలిపారు.  ఏకంగా ప్రధానమంత్రికే హెచ్చరికలు జారీ చేయడంతో తేజ్ ప్రతాప్‌పై చర్యలు తీసుకోవాలని అధికార జేడీయూ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లాలూకి గతంలో జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉండగా.. ఇప్పుడు జడ్‌కు తగ్గించారు. అంతేకాదు నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌లను కూడా ఉపసంహరించుకుంది.

కాగా, ఇటీవ‌ల బీహార్‌లో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకునే కామెంట్ల జోరు పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. రెండ్రోజుల‌ క్రితం ఆర్జేడీ నేత, లాలూ కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ను కొట్టిన వారికి కోటి రూపాయల నజరానా ఇస్తామని బీజేపీ నేత ఒకరు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోడీపై తేజ్‌ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ విధమైన నజరానాను పాట్నాకు చెందిన బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ అనిల్‌ సాహ్ని ప్రకటించారు. సుశీల్‌ మోడీని డిసెంబర్‌ 3న జరిగే ఆయన కుమారుని పెళ్ళిలో కొడతానని తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దానికి ప్రతిగా బిజెపి నేత మరింత రెచ్చిపోయి ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. సుశీల్ మోడీకి తేజ్‌ క్షమాపణలు చెప్పేంత వరకు ఆయన ఇంటి ముందు నిరసన తెలుపుతామని బెదిరింపులకు దిగారు. కాగా, తేజ్‌ చేసిన వ్యాఖ్యలపై సుశీల్‌ మోడీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడిని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకుండా ఆపాలని లాలూ యాదవ్‌కు సూచించారు.. సాహ్ని చేసిన వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర యూనిట్‌ ప్రతినిథి సురేష్‌ రుంగ్టా మాట్లాడుతూ అతను వ్యక్తిగతంగా మాట్లాడారని, దీనికి పార్టీకి సంబంధంలేదన్నారు.
Tags:    

Similar News