దేశంలో మరే అధినేతలోనూ కనిపించని ‘కసి’ చంద్రబాబులోనే

Update: 2022-07-22 03:29 GMT
ఆయనేం కుర్రాడు కాదు. మధ్య వయస్కుడు అంతకన్నా కాదు. ఆ మాటకు వస్తే పెద్ద వయస్కుడు. మనలోని చాలామంది డెబ్భైఏళ్ల వయసులో ఎలా ఉంటాం? ఎంత చురుగ్గా ఉంటామో తెలియంది కాదు. అలాంటి వయసులో మధ్య వయస్కుడి మాదిరి కష్టపడటం తెలుగుదేశం పార్టీఅధినేత చంద్రబాబుకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇంత వయసు మీదకు వచ్చిన వేళలో.. తనకున్న అపారమైన అనుభవంతో.. పరామర్శలు అంటే పైపైన పూర్తి చేసేస్తారు. కానీ.. అలా చేస్తే ఆయన చంద్రబాబు ఎందుకు అవుతారు చెప్పండి?

తాజాగా కురిసిన భారీ వర్షాలతో చోటు చేసుకున్న వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బాధితుల్ని పరామర్శించేందుకు గోదావరి జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా చంద్రబాబు స్టామినా హాట్ టాపిక్ గా మారింది. ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు నిమిషం ఖాళీ షెడ్యూల్ తో నిరంతరాయంగా పని చేస్తున్న వైనం చూస్తే.. ఇంత పని రాక్షసుడు చంద్రబాబులోనే కనిపిస్తారని చెప్పాలి.

తన పరామర్శలో భాగంగా అదే పనిగా మాట్లాడాల్సి రావటం.. ఓపిగ్గా బాధితులు చెప్పే మాటల్ని వినటంతో పాటు.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని.. అలక్ష్యాన్ని కడిగిపారేసేలా మాట్లాడటం.. బాధితులకు తాము ఉన్నామన్న భరోసాను ఇచ్చేందుకు చంద్రబాబు పడిన తపన చూసినప్పుడు.. ఇంతటి కమిట్ మెంట్..కసి మరే అధినేతలోనూ కనిపించదనే చెప్పాలి.

72 ఏళ్ల వయసులో బాధితుల పరామర్శ అంటే.. కొంతమంది బాధితుల్ని తనకు సౌకర్యంగా ఉండే ప్రాంతాలకు తీసుకొచ్చి.. వారితో నాలుగు మాటలు మాట్లాడించి పంపించేయొచ్చు. కానీ.. అందుకు భిన్నంగా తానే క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా చూసేందుకు పడిన కష్టాన్ని చూస్తే.. చంద్రబాబును మెచ్చుకోకుండా ఉండలేం. పశ్చిమగోదావరి.. కోనసీమ జిల్లాల్లో స్వయంగా పర్యటించటమే కాదు.. బాధితుల్ని పలుకరించేందుకు.. వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని రియల్ టైంలో చూడాలన్న తపన చంద్రబాబులో కనిపించింది.

అంతేకాదు.. గోదావరి నదిలో ప్రయాణించేందుకు సైతం వెనుకాడకపోవటం చూస్తే.. ఇంత రిస్కు.. ఈ వయసులో చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు. బాధితుల పరామర్శ ప్రోగ్రాంను ఉదయం నుంచి చేస్తున్న ఆయన.. రాత్రి పది గంటల సమయంలోనూ అదే పనిలో ఉండటం విశేషం.

రాత్రి పది గంటల సమయానికి మానేపల్లి పల్లెపాలెం చేరుకొని.. వరదల్లో మరణించిన రామక్రిష్ణ.. శ్రీను కుటుంబాలను పరామర్శించటమే కాదు.. పార్టీ తరఫున రూ.లక్షచొప్పున సాయం అందించటం గమనార్హం. వయసు మీద పడుతున్నా.. తనలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదన్న విషయాన్ని తాజా పరామర్శ పర్యటనతో చంద్రబాబు మరోసారి నిరూపించారని చెప్పాలి. కసికి కమిట్ మెంట్ తోడైతే.. చంద్రబాబు అవుతారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News