నర్సాపురం బరిలో నాగబాబు....పవన్ మార్క్ షాక్..?

Update: 2022-02-24 05:51 GMT
ఈ ఏడాదిలో ఏదో నెలలో నర్సాపురం లోక్ సభకు ఉప ఎన్నిక అనివార్యం అని గట్టిగా వినిపిస్తోంది. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వైసీపీ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు తనంతట తాను రాజీనామా చేయడం ద్వారా ఉప ఎన్నికను తీసుకురావడం. రెండవది ఆయన మీద వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనర్హత వేటు పడడం. అలా చూసుకున్నా  ఉప ఎన్నిక జరగనుంది. నిజానికి మొదటిది సులువు, రెండవది కష్టం అనుకోవచ్చు.

కానీ రెండవది కూడా ఇపుడు జోరుగా ముందుకు కదులుతోంది. ఉత్తరాది ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీకి రాజకీయ అనివార్యతలు చాలా ఎక్కువ అవుతాయి. ఆ టైమ్ లోనే రాజు గారి మీద వైసీపీ ఇచ్చిన అనర్హ‌త వేటు పిటిషన్ కూడా చురుకుగా ముందుకు కదులుతుంది అంటున్నారు. అదే కనుక జరిగితే రాజు ఆరేళ్ళ పాటు పోటీ చేయకుండా అనర్హతకు గురి అవుతారు, కాబట్టి ఆయన ముందే రాజీనామా చేస్తారు అంటున్నారు.

సో ఎలా చూసుకున్నా ఈ ఏడాది నర్సాపురం లోక్ సభకు ఉప ఎన్నిక ఖాయం. మరి ఈ ఎన్నిక చాలా ఇంటెరెస్టింగ్ గా ఉంటుంది అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. నర్సాపురం ఉప ఎన్నిక అంటూ జరిగితే రాజు బీజేపీ తరఫున బరిలోకి దిగుతారు అని అంటున్నారు. ఆయనకు టీడీపీతో మంచి రిలేషన్స్ ఉన్నా కూడా ఆయన్ని నేరుగా తమ పార్టీలో చేర్చుకుని క్యాండిడేట్ గా ప్రకటించేందుకు టీడీపీ రాజకీయ వ్యూహాలు అంగీకరించవు.

రాజును వెనకనుంచి టీడీపీయే నడిపిస్తోంది అని ఇంతకాలం వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజాలు చేయాలని టీడీపీ హైకమాండ్ అసలు భావించడంలేదు. సో రాజుకు ఉన్న ఆప్షన్ ఒక్క  బీజేపీ మాత్రమే. అలా అయితే కచ్చితంగా జనసేన మద్దతు దక్కుతుందని రాజు అంచనాలు వేసుకున్నారు. అయితే సీన్ చూస్తే అలాంటి ఆశలు ఏవీ పెట్టుకోరాదని జనసేనాని సంకేతాలు గట్టిగానే ఇస్తున్నారు.

తాజాగా నర్సాపురంలో ఆయన భారీ ఎత్తున నిర్వహించిన మత్స్యకారుల సభ అందుకు ఉదాహరణ అంటున్నారు. నర్సాపురం పరిధిలో మత్స్యకారుల జనాభా పెద్ద ఎత్తున ఉంది. జనసేనకు ఎటూ బలమైన కాపులు దన్నుగా ఉన్నారు. ఇపుడు మత్స్యకారులను కూడా అక్కున చేర్చుకుంటే ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడు అయి మిగిలిన సామాజిక వర్గాల మద్దతుతో విజయం సాధించడం తధ్యమని లెక్కలేవో ఉన్నాయని అంటున్నారు.

మొత్తానికి పవన్ మాస్టర్ ప్లాన్ లో భాగంగానే నర్సాపురాన్ని టార్గెట్ చేశారని అంటున్నారు. మరో వైపు బీజేపీతో తెగదెంపులకు నర్సాపురం ఉప ఎన్నికను వాడుకోవాలని ఆయన అనుకుంటున్నారని తెలుస్తోంది. సరైన సమయం చూసి బీజేపీకి గుడ్ బై కొట్టే యోచనలో ఉన్న పవన్ నర్సాపురంలో ఒంటరిగా పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఇక తెలుగుదేశం పార్టీ జనసేనకు మద్దతు ఇస్తుందా లేదా అన్నది ఉప ఎన్నికల వేళ తేలే విషయం. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే నాగబాబునే మళ్ళీ బరిలోకి దింపాలనుకోవడం. 2019 ఎన్నికల్లో నాగబాబుకు ఏకంగా రెండున్నర లక్షల దాకా ఓట్లు వచ్చాయి. అంతటి జగన్ వేవ్ లో కూడా కేవలం 36 వేల ఓట్ల  మెజారిటీతోనే వైసీపీ ఇక్కడ గెలిచింది.

దాంతో పాటు టీడీపీ కూడా అక్కడ  బలంగా ఉంది. మొత్తానికి చూసుకుంటే పవన్ నర్సాపురం లోక్ సభ సీటు మీదనే గురి పెట్టారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు వైసీపీకి ఇటు బీజేపీకి షాక్ ఇచ్చేలా యాక్షన్ ప్లాన్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News