ముంబై ఇండియన్స్.. 'ఆరే' స్తుందా?

Update: 2022-03-23 23:30 GMT
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ముంబై ఇండియన్స్ ప్రత్యేకం. అత్యంత ధనికుడైన ముకేశ్ అంబానీ జట్టు. అయితే.. ఆయన వ్యాపార సామ్రాజ్యం ఎంత పక్కాగా ఉంటుందో ముంబై ఇండియన్స్ పయనం కూడా అంతే పక్కాగా ఉంటుంది. ఆటగాళ్ల ఎంపికలోనూ ముంబై ప్రత్యేకత కనిపిస్తుంది. సాధారణ ఆటగాళ్లకు
స్వేచ్ఛ ఇచ్చి విశేషంగా రాణించేలా చేయడం చెన్సై సూపర్ కింగ్స్ స్టయిలైతే..

ప్రతిభావంతులను పట్టుకొచ్చి వారిని తీర్చిదిద్దడం ముంబై ఇండియన్స్ స్టయిల్. హార్దిక్ పాండ్యా, జస్ ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ ఇలా ఒకరేమిటి? చాలామంది ఉన్నారు. మరోవైపు నిదానంగా టైటిల్ వేటను మొదలుపెట్టి దూసుకుపోవడం ముంబై పద్ధతి. ఇదే తీరున ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ ను కొల్లగొట్టింది. అన్నిసార్లూ కెప్టెన్ రోహిత్ శర్మనే కావడం విశేషం. ఇప్పుడు రోహిత్ టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్ అయ్యాడు. ఈ నేపథ్యంలో లీగ్ లో ముంబై ఇండియన్స్ ను ఎలా నడిపిస్తున్నాడో మరింత నిశితంగా పరిశీలిస్తారు.

ముంబై కొంత మారింది..

రోహిత్, సూర్య, పొలార్డ్, బుమ్రాలను రిటైన్ చేసుకున్న ముంబై.. ఇషాన్ కిషన్ ను భారీ ధర పెట్టి కొనుక్కుంది. దక్షిణాఫ్రికా అండర్ 19 సంచనలనం, మరో డివిలియర్స్గ్ గా పేరుతెచ్చుకున్న డెవోల్డ్ బ్రెవిస్ ను దక్కించుకుంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మనూ రూ.1.75 కోట్లకు కొనుక్కున్నది. వాస్తవానికి ముంబై.. పాండ్యా సోదరులను వదులుకుంటుందని ఎవరూ అనుకోలేదు. జట్టు విజయాల్లో గతంలో వీరిద్దరూ కీలకంగా నిలిచారు. అలాంటిదిప్పుడు వారిని పక్కనపెట్టి కొత్తవారికి పెద్దపీట వేసింది. లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన ముంబై.. ఆరోసారి కప్ కొట్టాలన్న ఊపులో ఉంది. ఐపీఎల్ 2022 లో కూడా ఈ జట్టు టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.

బలాలివీ..

ముంబై అతిపెద్ద బలం దాని బ్యాటింగే. దూకుడున్న కుర్రాడు కిషన్ తో కలిసి ‘హిట్‌మ్యాన్’,కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ వంటి కీలక ప్లేయర్లు ఉన్నారు. వీరి మధ్యలో డెవోల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు దిగి వీలుంది. తిలక్ వర్మను ఎక్కడ ఆడిస్తారో చూడాలి. డానియల్ సామ్స్, సంజయ్ యాదవ్, టిమ్ డేవిడ్, ఫాబియన్
అలెన్, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్ వీరిలో ఎవరికి చోటుదక్కుతుందన్నది ఆసక్తికరం. ఇక ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్‌లోనూ బలంగానే కనిపిస్తోంది. ట్రెంట్ బౌల్ట్ లేకపోయినా, గాయం కారణంగా ఆర్చర్ ఈ సీజన్‌కు దూరమైనా.. జట్టులో జస్ప్రీత్ బుమ్రా, మిల్స్, రిలే మెరెడిత్, జయదేవ్ ఉనద్కత్ దమ్మున్న బౌలర్లే

బలహీనతలివి..

హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి ఆల్ రౌండర్లు లేకపోవడం పెద్ద లోటు. గతంలో ఎన్నోమ్యాచ్ ల్లో వీరు ఒంటిచేత్తో జట్టును గెలిపించారు. వీరి లోటును డానియల్ సామ్స్, ఫాబియాన్ అలెన్, సంజయ్ యాదవ్ ఎలా భర్తీ చేస్తారో చూడాలి. స్పిన్ విభాగం కూడా బలహీనపడింది. కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్ వంటి పెద్ద పేర్లు ఉన్నాయి. అయితే ఈసారి మయాంక్ మార్కండేయ, మురుగన్ అశ్విన్‌తో బరిలో దిగనుంది. ఆటగాళ్లకు గాయం అయితే, బ్యాకప్‌లోనూ ఎలాంటి ఎంపికలు లేకపోవడం కూడా ముంబై ఇండియన్స్ బలహీనతలుగా మారాయి.

చాంపియన్ రేసులో ఇలా..

బ్యాటింగ్ లో, కెప్టెన్సీలో రోహిత్ శర్మ అనుభవం, విండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ శక్తి, పేసర్ జస్ప్రీత్ బుమ్రా  ముంబై ఇండియన్స్‌కు అతిపెద్ద బలాలు. కిషన్, సూర్య బ్యాటింగ్ దూకుడు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరూ గాయాలతో ఇబ్బంది పడుతున్నట్లుంది. వీరి ఫిట్ నెస్ ఎలా ఉంటుందో చూడాలి. టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్‌లో ఓ చేయేస్తే తిరుగుండదు.

ఇదీ పూర్తి స్థాయి జట్టు

బ్యాట్స్‌మెన్స్- రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, రమణదీప్ సింగ్, రాహుల్ బుద్ధి, అన్మోల్‌ప్రీత్ సింగ్
ఆల్ రౌండర్లు – కీరన్ పొలార్డ్, డానియన్ సామ్స్, సంజయ్ యాదవ్, టిమ్ డేవిడ్, ఫాబియన్ అలెన్, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్
బౌలర్లు- జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, టైమల్ మిల్స్, అర్షద్ ఖాన్, జయదేవ్ ఉనద్కత్, రిలే మెరెడిత్, బాసిల్ థంపి

వికెట్ కీపర్- ఇషాన్ కిషన్, ఆర్యన్ జుయల్

స్పిన్నర్లు- మయాంక్ మార్కండేయ, మురుగన్ అశ్విన్

కోచింగ్ సిబ్బంది

మహేల జయవర్ధనే (ప్రధాన కోచ్), రాబిన్ సింగ్ (బ్యాటింగ్ కోచ్), షేన్ బాండ్ (ఫాస్ట్ బౌలింగ్ కోచ్), జేమ్స్ పేమెంట్ (ఫీల్డింగ్ కోచ్)

ఏ సీజన్ లో ఏ స్థానంలో ఉందంటే..

2008 5వ, 2009 7వ, 2010 రెండవ, 2011 మూడవ, 2012 నాల్గవ, 2013 విజేత
2014 నాల్గవ, 2015 విజేత, 2016 5వ, 2017 విజేత, 2018 5వ, 2019 విజేత,  2020 విజేత
2021 5వ.
Tags:    

Similar News