ఎన్టీయార్ జిల్లా... తెలుగు జాతి గర్వానికి ఖిల్లా...

Update: 2022-04-04 10:31 GMT
కారణ జన్ముడు, రణ జన్ముడు ఎన్టీయార్ అని ఒకానొక సందర్భంలో మహా కవి డాక్టర్ సి నారాయణరెడ్డి చాలా అభిమానంతో కవితావేశంతో చెప్పిన మాట. నిజంగా చూస్తే ఎన్టీయార్ జీవితం అలాగే సాగింది. ఆయన కారణ జన్ముడే. అలాగే దేనికైనా వెరవని నైజం ఆయన సొంతం. రణ నినాదంతో ఢిల్లీని గడగడలాడించిన మహానుభావుడు.

అలాంటి ఎన్టీయార్ తన బాల్యంతో పాటు, యవ్వనంలోనూ విజయవాడ వీధుల్లోనే తిరిగారు. 1930, 40  ప్రాంతాల్లో ఎన్టీయార్ నడయాడిన ప్రాంతం విజయవాడ. ఆయన గుంటూరు ఏసీ కళాశాలలో డిగ్రీ చదివారు. ఇక ఆయన మంగళగిరిలో సబ్ రిజిష్టార్ గా ఆరు నెలల పాటు పనిచేశారు. నాడు బ్రిటిష్ సర్కార్ పెట్టిన పరీక్షకు వందలాది మంది హాజరైతే సెలెక్ట్ అయిన ఏడుగురులో ఎన్టీయార్ ఒకరు. అది ఆయన ఉద్యోగ విజయపర్వం.

ఇక విజయవాడ ఆయన కార్యక్షేత్రం. కళాక్షేత్రం కూడా. విజయవాడ అంటే ఎన్టీయార్ కి ఎంతో ఇష్టం. ఆయన తన సినిమా వంద రోజుల ఫంక్షన్లు కానీ ఏమైనా సినీ సభలు, ఇతర సాహిత్య సభలు కానీ విజయవాడలో పెట్టాలని కోరుకునేవారు. అలా ఎక్కువసార్లు విజయవాడకు  వచ్చేవారు.

ఆయనకు కళాశాలలో లెక్చరర్ గా  తెలుగు చెప్పిన వారు కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణగారు. ఆయన కోసం కూడా ఎన్టీయార్ విజయవాడ తరచూ వచ్చేవారు. ఇక సినీ నటుడిగా ఎన్టీయార్ తన కెరీర్ ఉన్నత స్థితిలో కొనసాగించిన రోజుల్లో కూడా విజయవాడను మరచిపోలేదు. రాజకీయాల్లో ముఖ్యమంత్రి వంటి ఉన్నత పదవిని అధిరోహించిన మీదట ఆయన విజయవాడ ప్రగతి మీద దృష్టి పెట్టారు.
Read more!

నాడు ఆయన చేసిన అభివృద్ధి ఈ రోజుకీ అక్కడ కనిపిస్తుంది. అలాంటి ఎన్టీయార్ పేరిట విజయవాడకు పేరు పెట్టడం ఎంతో సముచితం. రాజకీయ రాజధానిగా, కళలకు కాణాచిగా ఉన్న విజయవాడ లో ఆ రెండింటిలోనూ పూర్తిగా విజయవంతం అయి తరతరాలకూ స్పూర్తిదాయకంగా ఉన్న ఎన్టీయార్ పేరు పెట్టి పాలకులు గొప్ప నిర్ణయమే తీసుకున్నారు అని చెప్పాలి.

ఎన్టీయార్ కి రాజకీయాలు తెలియవు. ఆయనకు పార్టీలు అంటూ వేరే లేవు. ఆయన అందరివాడు. ఆయన రాముడు, క్రిష్ణుడు పాత్రల పోషణతో అందరి మదిలో చిరస్థాయిగా నిలిచారు. ఇపుడు క్రిష్ణమ్మ గలగలల మధ్య నిత్యం దుర్గమ్మ వేద మంత్రాల మధ్య తరిస్తూ సాగే విజయవాకిటన ఎన్టీయార్ పేరు సార్ధక నామధేయంగా మారడం అంటే తెలుగు వారి మనసు ఉప్పొంగిపోయే సందర్భమే.

ఎన్టీయార్ జిల్లా అని ఎవరు  తలచుకున్నా అలా పేరు పెట్టి పిలచుకున్నా ఆ మహానుభావుడు స్పురణకు వచ్చి మనసు మధురానుభూతులకు లోను అవుతుంది. ఎన్టీయార్ జిల్లా ఇక మీదట తెలుగు వారి గర్వానికి ఖిల్లాగా చెప్పుకోవాలి. తెలుగు జాతి ఉన్నంతవరకూ ఎన్టీయార్ అన్న మూడు అక్షరాలూ చరిత్రలో పదిలం, చిరస్మరణీయం అని కూడా ఒప్పుకోవాలి. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ పేరు మీద జిల్లా రావడంతో ఎన్టీఆర్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తమ అభిమాననటుడి పేరు రోజూ ప్రజల నోళ్ళలో నానుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News

eac