ప‌రిటాల శ్రీరామ్‌ కు నో.. తల్లికి ఓకే!

Update: 2022-03-26 07:21 GMT
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టి నుంచే ప‌క్కా వ్యూహంతో సాగుతున్నారు. ఆ ఎన్నిక‌ల్లో గెలిస్తేనే పార్టీకి రాజ‌కీయ మ‌నుగడ ఉంటుంద‌ని భావిస్తున్న ఈ మాజీ ముఖ్య‌మంత్రి.. జ‌గ‌న్‌ను ఎలాగైనా ఓడించాల‌ని పావులు క‌దుపుతున్నారు. ముందుగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పార్టీ బ‌లోపేతంపై ఆయ‌న దృష్టి సారించారు. ఆ త‌ర్వాత బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను గుర్తించి టికెట్లు కేటాయించే ప్ర‌క్రియ‌కు తెర‌తీస్తార‌ని తెలుస్తోంది. ఈ సారి ఒక కుటుంబానికి ఒకే టికెట్ కేటాయించాల‌ని బాబు అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. అలా జరిగితే ప‌రిటాల కుటుంబంలోనూ ఆయ‌న ఒక‌రికే టికెట్ ఇస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

త‌న‌యుడికి బ్రేక్‌..

వివిధ స‌ర్వేలు, నియోజ‌క‌వ‌ర్గ ప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకుని బాబు ఈ సారి టికెట్ల కేటాయింపు చేస్తార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌ధానంగా ఒకే కుటుంబానికి ఒకే టికెట్ అనే విధానాన్ని బాబు అమ‌లు చేస్తార‌ని అంటున్నారు. ఒక్క సీటు ఇస్తే కుటుంబం మొత్తం దానిపైనే ఫోక‌స్ పెట్టి గెలుపు దిశ‌గా సాగుతార‌న్న‌ది బాబు అంచ‌నా. అందుకే ఈ సారి ప‌రిటాల కుటుంబానికి 2019 మాదిరే ఒక‌టే టికెట్ కేటాయిస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో రాప్తాడు నుంచి పోటీ చేసిన ప‌రిటాల శ్రీరామ్ ఓట‌మి పాల‌య్యారు. దీంతో ఇప్పుడు ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌కుండా ఆయ‌న త‌ల్లి ప‌రిటాల సునీత‌ను రాప్తాడు నుంచి పోటీ చేయించాల‌ని బాబు అనుకుంటున్నార‌ని తెలిసింది.

ధ‌ర్మ‌వ‌రానికి మార‌డంతో..

గ‌త ఎన్నిక‌ల్లో ఓటమి త‌ర్వాత ప‌రిటాల శ్రీరామ్‌కు ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు. అక్క‌డ ఉన్న వ‌ర‌దాపురం సూరి బీజేపీలోకి వెళ్ల‌డంతో శ్రీరామ్‌ను బాబు అక్క‌డికి పంపించారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ధ‌ర్మ‌వ‌రం నుంచి త‌న త‌ల్లి  రాప్తాడు నుంచి పోటీ చేసేలా శ్రీరామ్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నార‌ని తెలిసింది. కానీ బాబు మాత్రం సునీత‌కే టికెట్ ఇస్తార‌ని స‌మాచారం. ఎందుకంటే బీజేపీలోకి వెళ్లిన వ‌ర‌దాపురం సూరి తిరిగి టీడీపీలోకి వ‌స్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఒక‌వేళ ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీతో టీడీపీకి పొత్తు కుదిరితే బీజేపీ కోటాలో వ‌ర‌దాపురం సూరినే ధ‌ర్మ‌వ‌రంలో పోటీ చేసే అవ‌కాశం ఉంది. పైగా ధ‌ర్మ‌వ‌రంలో ప‌రిటాల‌, వ‌ర‌దాపురం సూరి వ‌ర్గాలు క‌లిస్తే విజయం ఖాయ‌మ‌ని బాబు భావిస్తున్నారు. అందుకే సునీత‌ను రాప్తాడు నుంచి పోటీ చేయించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News