టీ హైకోర్టుకు 12 మంది పేర్లు పంపితే 10 మందికి రాష్ట్రపతి ఓకే

Update: 2022-03-23 04:29 GMT
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు మరింత మంది జడ్జీలు కొత్తగా రానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని కొలీజింయ లాయర్ల కేటగిరి నుంచి ఏడుగురిని.. జడ్జిల కేటగిరి నుంచి ఐదుగురు పేర్లతో కూడిన 12 మంది జాబితాను రాష్ట్రపతి వద్దకు పంపగా.. వారిలో 10 మందికి ఓకే చెబుతూ ఆమోదముద్ర వేశారు. వీరంతా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పది మందిలో నలుగురు మహిళలకు చోటు లభించింది. ఇక.. సిఫార్సు చేసినప్పటికీ రాష్ట్రపతి ఆమోదముద్ర ఉత్తర్వులో కనిపించని వారి విషయానికి వస్తే.. చాడ విజయభాస్కర్ రెడ్డి.. మీర్జా సైపుల్లా బేగ్ లుగా చెబుతున్నారు.

హైకోర్టు జడ్జిలు ఎంపికైన వారిలో లాయర్ల కోటా నుంచి జడ్జిలుగా ఎంపికైన వారు ఎవరంటే..

-  కాసోజు సురేందర్

-  సూరేపల్లి నంద

-  ముమ్మినేని సుధీర్ కుమార్

-  జువ్వాడి శ్రీదేవి

-  ఎన్ శ్రావణ్ కుమార్ వెంకట్
జడ్జిల విభాగం నుంచి ఎంపికైన వారిలో..

-  గున్ను అనుపమా చక్రవర్తి

- మాటూరి గిరిజా ప్రియదర్శిని

- సాంబశివరావు నాయుడు

- ఏనుగు సంతోష్ రెడ్డి

-  దేవ్ రాజ్ నాగార్జున్

తెలంగాణ హైకోర్టులో మొత్తం 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 19 మంది సేవలు అందిస్తున్నారు. తాజాగా ఎంపికైన పది మందితో వీరి సంఖ్య 29కు చేరుకుంటుంది.హైకోర్టులో ఒకేసారి పది మంది న్యాయమూర్తులను అపాయింట్ చేయటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. తాజాగా నియమితులైన నలుగురు మహిళా జడ్జిలతో కలిపి తెలంగాణ హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 10కు చేరనుంది. అంటే.. మొత్తం 29 మందిలో పది మంది అంటే.. మొత్తం జడ్జిల్లో మహిళా జడ్జిలు 34.48 శాతానికి పెరగనుంది.

జడ్జిలుగా ఎంపికైన వారి వివరాల విషయానికి వస్తే.. తొలుత లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తూ.. తాజాగా హైకోర్టు జడ్జిలుగా ఎంపికైన వారి విషయానికి వస్తే..
కాసోజు సురేందర్

-  మహబూబ్ నగర్ కు చెందిన ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో స్కూలింగ్.. ఉస్మానియాలో డిగ్రీ పూర్తి చేశారు. 1992 డిసెంబరు 15న బార్ కౌన్సిల్ లో నమోదయ్యారు. సీబీఐ న్యాయవాదిగా.. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్.. ఎన్ఐఏల ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా.. కేంద్రం తరఫు అదనపు స్టాండింగ్ కౌన్సిల్ గా సేవలు అందించారు.

-  దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన గోకుల్ చాట్ బాంబు పేలుళ్లు.. లుంబినీ పార్కు పేలుళ్లు.. దిల్ సుఖ్ నగర్ లో పెట్టిన బాంబు కేసులకు సంబంధించి కోర్టులో వాదనలు వినిపంచారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సత్యం స్కాంలో వాదనలు వినిపించగా.. ప్రత్యేకకోర్టులో నేరం రుజువై నిందితులకు జైలుశిక్ష పడింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ప్రత్యేక న్యాయవాదిగా పని చేశారు.

సూరేపల్లి నంద
-  సికింద్రాబాద్ కు చెందిన ఆమె 1969లో జన్మించారు. 1993 ఆగస్టులో బార్ కౌన్సిల్ లో నమోదయ్యారు. 28 ఏళ్లుగా పలు రాజ్యాంగ.. సివిల్.. క్రిమినల్.. కార్మిక.. రెవెన్యూ.. సర్వీసులకు సంబంధించిన కేసుల్లో వాదనలు వినిపించారు. 2000 నుంచి బార్ కౌన్సిల్ స్టాండింగ్ కౌన్సిల్ గా కొనసాగుతున్నారు.

-  ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా వ్యవహరించారు. కేంద్రం తరఫున పని చేశారు. నిమ్స్.. కార్పొరేషన్ బ్యాంక్ ల పక్షాన వాదనలు వినిపించారు.

ముమ్మినేని సుధీర్ కుమార్
- ఖమ్మం జిల్లా వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. చర్ల ప్రభుత్వ పాఠశాలలో.. ఏలూరు సర్ సీఆర్ రెడ్డి కాలేజీలో డిగ్రీ.. నాందేడ్ లో లా పూర్తి చేసి.. 1994లో బార్ కౌన్సిల్ లో నమోదయ్యారు.

జువ్వాడి శ్రీదేవి
-  జగిత్యాల జిల్లాకు చెందిన ఆమె 1997లో బార్ కౌన్సి్ల్ లో నమోదయ్యారు. 2018 నుంచి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ర గా పని చేస్తున్నారు. ఆమె భర్త కూడా లాయరే.
శ్రావణ్ కుమార్ వెంకట్

-  మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనమడు. పీవీ పెద్ద కుమార్తె కుమారుడు. ఉస్మానియాలో బీకాం.. ఎంఎల్ బీ.. బిట్స్ నుంచి ఎంబీయే చేశారు. 2005లో బార్ కౌన్సిల్ లో నమోదయ్యారు. హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.

- సివిల్ కేసులు.. టాక్స్.. కంపెనీ లా.. ఆర్బిటేషన్ కేసుల్లో నైపుణ్యం ఉంది.

జడ్జిల విభాగం నుంచి ఎంపికైన వారి వివరాల్లోకి వెళితే..

అనుపమా చక్రవర్తి
-  శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆమె 1970లో జన్మించారు. విశాఖలోని ఎన్ బీఎం లా కాలేజీలో డిగ్రీ చేశారు. 1994లో బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేయించుకున్నారు.

- సివిల్.. క్రిమినల్ కోర్టులు.. కో ఆపరేటివ్ ట్రైబ్యునల్ తో పాటు ఇతర ట్రైబ్యునళ్లు.. హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2006లో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పని చేశారు.

2008లో జడ్జిగా ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పని చేశారు. ప్రస్తుతం వ్యాట్ ట్రైబ్యునల్ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు.

మాటూరి గిరిజా ప్రియదర్శిని
-  విశాఖపట్నానికి చెందిన ఆమె అక్కడే లా పూర్తి చేశారు. లేబర్ అండ్ ఇండస్ట్రీ లాలో మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేశారు. భర్త వ్యాపార రంగానికి చెందిన వారు. పెళ్లైయ్యాక 1995లో బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకున్నారు.  జిల్లా కోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టి.. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు.

-  రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో జడ్జిగా పని చేసిన ఆమె.. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జడ్జిగా కొనసాగుతున్నారు.

సాంబశివరావు నాయుడు
-  తూర్పుగోదావరి జిల్లాలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన స్థానికంగా చదువు పూర్తి చేశారు. అమలాపురం ఎస్ కేబీఆర్ కాలేజీలో బీకాం.. ఆంధ్రా వర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు. 1986లో లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు.

-  రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో జడ్జిగా పని చేసిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్ ఏసీబీ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2019 నుంచి పని చేస్తున్నారు.
ఏనుగు సంతోష రెడ్డి

-  జగిత్యాల జిల్లాకు చెందిన ఆయన జగిత్యాల ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కాలేజీలో గ్రాడ్యుయేషన్.. ఎస్ కే వర్్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా నుంచి మాస్టర్స్ లా పూర్తి చేశారు. 1985లో బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకున్నారు.

-  1991లో జిల్లా మున్సిఫ్ గా ఎంపికైన ఆయన పలు జిల్లాల్లో పని చేశారు. 2019 నుంచి న్యాయశాఖ కార్యదర్శిగా ఎంపికై పని చేస్తున్నారు.

దేవరాజ్ నాగార్జున్
- ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందిన ఆయన అక్కే డిగ్రీ చేశారు గుల్బార్గాలో లా పూర్తి చేసి.. అక్కడే ఎంఎల్ కూడా పూర్తి చేశారు. కాలిఫోర్నియా వర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. నల్సార్ వర్సిటీలో పీహెచ్ డీ పూర్తి చేశారు.

-  1986లొ న్యాయవాదిగా ఎన్ రోల్ అయి.. 1991లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. అనంతరం పలు పదవుల్ని చేపట్టిన ఆయన.. ప్రస్తుతం రిజిస్ట్రార్ జనరల్ గా కొనసాగుతున్నారు. హైదరాబాద్ కు తలమానికంగా భావిస్తున్న అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ట్రస్టు డీడీ రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
Tags:    

Similar News