పాలకులు మళ్ళీ అదే తప్పు చేశారా ?

Update: 2022-03-10 23:30 GMT
రాష్ట్ర విభజన తర్వాత కూడా ప్రభుత్వ పెద్దలకు జ్ఞానోదయం అయినట్లు లేదు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన వల్ల విభజిత ఏపీ ఏ విధంగా నష్టపోయిందో జనాలందరికీ తెలిసింది. నిపుణులు కూడా ఎన్నో సూచనలు చేశారు. రాజధాని ఏర్పాటు, రాష్ట్రాభివృద్ధి కోసం యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుచేసిన శివరామకృష్ణన్ కమిటి కూడా విభజిత ఏపీ అభివృద్ధి ఏ విధంగా ఉండాలో నివేదిక రూపంలో స్పష్టంగా చెప్పింది.

అయినా పాలకుల ఆలోచనల్లో ఏమాత్రం మార్పు రాలేదు. ఎందుకంటే ఏపీ రాజధానిగా ఏర్పడిన అమరావతిలోనే కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్ధల కార్యాలయాలను ఏర్పాటు చేయటానికి రెడీ అయ్యారు.

అమరావతి ప్రాంతంలోనే 24 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, 18 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు భూములు కేటాయించారు. 42 సంస్ధలకు కలిపి 245 ఎకరాల భూమిని కేటాయించారు పాలకులు. దశాబ్దాల తరబడి సమైక్య రాష్ట్రంలోని పాలకులు  చేసిన తప్పే విభజన తర్వాత కూడా పాలకులు చేయడం ఆశ్చర్యంగా ఉంది.

రాష్ట్ర విభజన సమయంలో పాలకులు చేసిన తప్పులేంటో స్పష్టంగా బయటపడింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ హైదరాబాద్ చుట్టుపక్కలే ఏర్పాటు చేశారు. దాదాపు 110 సంస్ధలు హైదరాబాద్ చుట్టుపక్కల ఏర్పాటయ్యాయి.

ప్రతి సంస్థ ఏర్పాటు జరిగిన చుట్టుపక్కల ప్రాంతం ఎంతో కొంత డెవలప్ అయ్యింది. దీనివల్ల హైదరాబాద్ చాలా స్పీడుగా విస్తరించింది. ఇదే పద్దతిలో ఏపీని కూడా డెవలప్ చేసుండొచ్చు. కానీ పాలకులు మాత్రం అన్నింటినీ తీసుకొచ్చి అమరావతిలోనే ఏర్పాటు చేయాలని అనుకున్నారు.

ఉదాహరణకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్ధకు భవనం కేటాయించారు. ఈ సంస్ధ ఎక్కడున్నా ఒకటే కదా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ,  బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, తపాలశాఖ, ఇండియన్ నేవి, కేంద్రీయ విశ్వవిద్యాలయం, నేషనల్ బయోడైవర్సిటీ మ్యూజియం లాంటి 42 సంస్ధలకు అమరావతిలోనే భూములు కేటాయించారు.

అన్నింటినీ ఒకేచోట ఏర్పాటు చేసే బదులు వీటిల్లో చాలా వాటిని 13 జిల్లాల్లో సర్దుండవచ్చు. శివరామకృష్ణన్ కమిటి చెప్పింది కూడా ఇదే. అయినా కమిటీ నివేదికను పక్కన పెట్టేసి పాలకులు మాత్రం అన్నీ సంస్ధలను అమరావతిలోనే ఏర్పాటు చేశారు. రేపేడైనా తేడా వస్తే మళ్ళీ మిగిలిన ప్రాంతాలు నష్టపోవటం ఖాయం. మరి మన పాలకులకు ఎప్పటికి జ్ఞానోదయం అవుతుందే ఏమో.
Tags:    

Similar News