వాళ్లు కొన‌రు.. వీళ్లు విన‌రు

Update: 2022-03-21 11:33 GMT
తెలంగాణ‌లో మ‌రోసారి వ‌రి కోనుగోళ్ల అంశం హాట్ టాపిక్‌గా మారింది. యాసంగి ధాన్యాన్ని మొత్తం కేంద్రం కొనుగోలు చేయాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తుండడం మ‌రోసారి తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రైతుల స‌మ‌స్య మ‌ళ్లీ రాజకీయ రంగు పులుముకోనుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల ఎర్ర‌వ‌ల్లిలోని త‌న ఫామ్‌హౌస్‌లో  మంత్రుల‌తో స‌మావేశ‌మైన కేసీఆర్‌.. ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో మ‌రోసారి కేంద్రంపై పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు. అందుకు త‌గిన కార్య‌చ‌ర‌ణ కూడా రూపొందించుకున్న‌ట్లు స‌మాచారం.

బీజేపీని ఇరుకున పెట్టాల‌ని..

తాజాగా కేసీఆర్ మ‌రోసారి శాస‌న‌స‌భ ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేశారు. యాసంగి ధాన్యం కొనుగోళ్ల‌పై కేంద్రంపై ఒత్తిడి తేవ‌డానికి ఈ స‌మవేశంలో ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. అయితే ఇప్ప‌టికే వాన కాలం పండించిన ధాన్యాన్ని కొన‌డానికి కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఒప్పుకోవ‌డం లేద‌ని అప్పుడు కేసీఆర్ నానా యాగీ చేసిన సంగ‌తి తెలిసిందే.

ముఖ్య‌మంత్రి అయ్యాక ఎన్న‌డూ లేనిది తొలిసారి టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి కేసీఆర్ స్వ‌యంగా ధ‌ర్నాలో కూర్చున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు బాయిల్డ్ రైస్ కొన‌మ‌ని కేంద్రం తెగేసి చెప్పింది. అయిన‌ప్ప‌టికీ ఢిల్లీ వెళ్లి మ‌రీ మ‌కాం వేసిన కేసీఆర్‌.. వ‌రి కోనుగోళ్ల విష‌యంపై బీజేపీని దోషిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేశారని విశ్లేష‌కులు చెబుతున్నారు.

రైతుల‌కే బాధ‌..

ఇప్పుడు యాసంగి ధాన్యం కొనుగోళ్ల విష‌యంలోనూ కేసీఆర్ మ‌ళ్లీ అదే బాట‌లో సాగ‌నున్నారు. ప్ర‌ధాని మోడీ అపాయింట్‌మెంట్ను ముఖ్య‌మంత్రి కార్యాల‌యం కోరింది. ఒక‌వేళ ప్ర‌ధాని అపాయింట్‌మెంట్ ల‌భించ‌క‌పోతే ఢిల్లీలోనే కేసీఆర్ ధ‌ర్నాకు దిగే అవ‌కాశం ఉంది. పంజాబ్ త‌ర‌హాలో వంద శాతం ధాన్యాన్ని కేంద్ర‌మే కొనుగోలు చేయాల‌నే డిమాండ్‌తో కేసీఆర్ ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ రూపొందిస్తున్నార‌ని టాక్‌.

ఈ నేప‌థ్యంలో నాలుగైదు రోజులు మ‌రోసారి ఢిల్లీలోనే ఆయ‌న మ‌కాం వేసే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు బీజేపీ నేత‌లు మాత్రం కేసీఆర్ అబ‌ద్దాల‌తో కేంద్రంపై బుర‌ద జ‌ల్లుతున్నార‌ని అంటున్నారు. మ‌రోసారి ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున కేసీఆర్ డ్రామాల‌కు తెర‌తీశార‌ని చెబుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల విష‌యంపై త‌న వైఖ‌రిని కేంద్రం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింద‌ని.. ఎంత మొత్తంలో కొనుగోలు చేసేది ముందుగానే పేర్కొంద‌ని బీజేపీ నేత‌లు అంటున్నారు.

ఇలా ఇప్పుడు కేసీఆర్ వ‌ర్సెస్ బీజేపీ మ‌ధ్య మ‌రోసారి రైతులు న‌లిగిపోతార‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. వానా కాలం ధాన్యం కొనుగోళ్ల విష‌యంలోనూ ఇలాగే టీఆర్ఎస్‌, బీజేపీ రాజ‌కీయ క్రీడ కార‌ణంగా రైతులు ధాన్యాన్ని స‌కాలంలో అమ్ముకోలేక వ‌ర్షాల వ‌ల్ల దెబ్బ‌తిని నానా ఇబ్బందులు పడ్డారు. వ‌రి కుప్పల ద‌గ్గ‌రే గుండె ఆగి చ‌నిపోయిన రైతుల విషాద ఘ‌టన‌లు చూశాం. ఇప్పుడు మ‌రోసారి వ‌రి కొనుగోళ్ల వివాదంతో గ్రామ‌స్థాయిలో బీజేపీని దెబ్బ కొట్టాల‌ని కేసీఆర్ చూస్తున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. కానీ మ‌ధ్య‌లో రైతులు ఇబ్బందులు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News