క్రికెట్ రూల్స్ లో భారీ మార్పులు

Update: 2022-03-10 02:40 GMT
వందేళ్ల పైగా ఉన్న చరిత్ర ఉన్న క్రికెట్ లో మూల స్థాయిలో మార్పులు చాలా తక్కువ. అంటే చాలా పద్ధతులు.. రూల్స్ గా చెలామణీ అయిపోతుంటాయి. కొన్ని దశాబ్దాల నుంచి అవి అలాగే నడుస్తున్నాయి. కాకపోతే.. కాలం మారుతున్న కొద్దీ ఆటకు తగినట్లుగా కొన్ని సంస్థాగత మార్పులు అనివార్యం అవుతుంటాయి. అంటే సాంకేతికంగా అని అన్నమాట. కానీ, తాజాగా నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అంతర్జాతీయంగా అంపైర్లు, అధికారులకు శిక్షణ ఇచ్చిన తర్వాత ఇవి అక్టోబరు నుంచి అమల్లోకి రానున్నాయి. బహుశా టి20 ప్రపంచ కప్ నాటికి అనుకోవచ్చు.

"మన్కడింగ్" మనోడిదే
బౌలర్ చేతి నుంచి బంతి జారకముందే బ్యాట్స్ మన్ క్రీజు దాటితే ఔట్ చేయడాన్ని మన్కడింగ్ గా సంబోధిస్తారు. దీనికి ఆద్యుడు టీమిండియా మాజీ ఆటగాడు వినూ మన్కడ్. అతడి పేరిటే మన్కడింగ్ వచ్చింది. ఇప్పుడీ మన్కడింగ్ రనౌట్ గా మారబోతోంది. ఈ మేరకు క్రికెట్‌ కోడ్‌ ఆఫ్ లా నిబంధనల్లో మెరిల్‌బోన్‌ క్రికెట్ క్లబ్‌ (ఎంసీసీ) కీలక మార్పులు చేసింది.  బంతి టర్న్ కోసం లాలాజలం రుద్దడం, కొత్త బ్యాటర్‌ ఎటువైపు బ్యాటింగ్‌ చేయాలి? ఇలా పలు కీలక మార్పులు కూడా కొత్త నిబంధనల్లో ఉన్నాయి.

ఇవి అమలైతే అటు టెస్టుల్లో, ఇటు టి20ల్లో పరిస్థితులు మారడం ఖాయం. "2017లో క్రికెట్‌ కోడ్‌ ఆఫ్ ది లా పబ్లికేషన్‌ నుంచి ఆటలో పెనుమార్పులు వచ్చాయి. అలానే రెండో ఎడిషన్‌ను 2019లో పబ్లిష్ చేసినప్పుడు అన్నింటికీ వివరణ ఇవ్వడంతోపాటు సవరణలు చేశాం. అయితే 2022 ఎడిషన్‌ వచ్చేనాటికి పెద్ద మార్పులు తీసుకొచ్చాం" అని ఎంసీసీ లా మేనేజర్‌ ఫ్రాజర్‌ స్టీవర్ట్‌ తాజా మార్పుల ప్రకటన తదనంతరం వెల్లడించారు. ఆయన చెప్పినదాని ప్రకారం ఇప్పటివరకు అన్‌ఫెయిర్‌ ప్లే విభాగంలో ఉన్న 'మన్కడ్‌' ఔట్ విధానం ఇక నుంచి రనౌట్‌ కేటగిరీలోకి వస్తుంది.

బంతిపై ఉమ్ము రుద్దొద్దు
బంతిపై మెరుపు కోసం ఉమ్ము రుద్దడం క్రికెట్ లో సహజం. తద్వారా బంతి వేగం పెరుగుతుంది. బ్యాట్స్ మన్ కు దానిని ఎదుర్కోవడం కష్టంగా మారుతుంది. అయితే, ఇలాంటి చర్యకు ఇకపై వీల్లేదు.అంతేకాదు.. చెమటను రుద్దడం వంటి చర్యలపైనా శాశ్వతంగా నిషేధం విధించారు.

కొత్త బ్యాట్స్ మన్ స్ట్రయికింగ్ కే ఆటగాడు క్యాచ్‌ ఔట్‌ అయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చే కొత్త బ్యాటర్‌ స్ట్రైకింగ్‌ చేయాల్సి ఉంటుంది. క్యాచ్‌ అందుకునే సమయానికి ఔటైన బ్యాటర్‌ సగం పిచ్‌ దాటినా కూడా ఇదే వర్తించనుంది. అయితే ఓవర్‌ పూర్తి కాకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. నిబంధనలు 27.4, 28.6 ప్రకారం బౌలర్ బౌలింగ్‌ చేసేటప్పుడు ఎవరైనా ఫీల్డర్ అనైతికంగా కదిలితే ఆ బంతిని డెడ్‌బాల్‌గా పరిగణించేవారు. బ్యాటర్‌ మంచి షాట్ కొట్టినా రద్దు చేయాల్సి వచ్చేది. ఇక నుంచి దానికి బ్యాటింగ్‌ వైపు జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులను ఇవ్వనున్నారు.

మార్పులు మంచికేనా?
తాజా మార్పులు క్రికెట్ మంచికేనా? అంటే అమలు తర్వాత వేచి చూడాల్సి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే కొంత మార్పు అయితే ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే క్రికెట్ బ్యాట్స్ మన్ ఆటగా మారిపోయిందనే విమర్శలున్నాయి. టి20లు వచ్చాక ఇది కచ్చితంగా బ్యాట్స్ మన్ గేమ్ గానే మారిపోయింది. కానీ, కొత్త రూల్స్ లో ఒకటైన "బ్యాట్స్ మన్ స్ట్రయికింగ్ " పరిస్థితిని మార్చవచ్చు. మరీ ముఖ్యంగా టెయిలెండర్లు వచ్చే సమయానికి. ఫీల్డింగ్ లో అనైతిక కదలిక లో పెనాల్టీ నిబంధన కూడా ఇలాంటిదే. చూద్దాం ఏం జరుగుతుందో??
Tags:    

Similar News