డాక్టర్లే చెప్పారు.. వారం వరకు కేసీఆర్ కు రెస్టు అవసరమని!

Update: 2022-03-12 04:39 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ గులాబీ బాస్ కేసీఆర్ స్వల్ప అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన యశోదా ఆసుపత్రికి రావటం.. అక్కడే మూడున్నర గంటల పాటు ఉండి.. పలు పరీక్షలు చేయించుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి వెళ్లటం తెలిసిందే. ఆయనకున్న ప్రధాన ఆరోగ్య సమస్య ఏడమ చేయి లాగటం.. రెండు రోజుల నుంచి ఉన్న ఈ సమస్య.. గుండె పోటుకు ఏమైనా కారణమా? అన్న సందేహాన్ని తీర్చుకునేందుకు ఆసుపత్రికి రావాలని కోరటం.. సీఎం వచ్చేయటం జరిగింది.

పలు పరీక్షలు చేసిన అనంతరం తేల్చిందేమంటే.. సర్వైకల్ స్పాండిలోసిస్ కారణంగా చేతి నొప్పి ఉందని తేల్చారు. స్వల్ప అస్వస్థత అని చెప్పినప్పటికీ.. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులే స్వయంగా చెప్పటంతో ఆయన విశ్రాంతి తీసుకోవటం తప్పనిసరైంది. తనకేదైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే.. వెంటనే ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు హాజరవుతారు. శుక్రవారం కూడా అలానే జరిగింది. తొలుత ప్రగతిభవన్ కు వెళ్లిన ఆయన.. ప్రాథమిక పరీక్షలు చేసి.. ఆ తర్వాత కేసీఆర్ ను కొన్ని పరీక్షల కోసం యశోదా ఆసుపత్రికి రావాలని కోరటంతో.. కాసేపటికి ఆయన యశోదా ఆసుపత్రికి వచ్చారు.

ఆసుపత్రిలో ఆయనకు రక్త పరీక్షలు.. కరోనరీ యాంజియో గ్రామ్.. ఈసీజీ.. 2డి ఎకో.. మెదడు.. వెన్నెముకలకు ఎంఆర్ఐ పరీక్షల్ని నిర్వహించారు. గుండె ఆరోగ్యం బాగుందని.. కాలేయం.. మూత్రపిండాల పనితీరులో సమస్యలు లేవని.. మధుమేహం.. రక్తపోటు నియంత్రణలో ఉందని.. వెన్నెముకలో కాస్తంత సమస్య ఉన్నట్లుగా ఎంఆర్ఐలో గుర్తించారు.  

ఎడమ చేయి లాగటంతో గుండె రక్త నాళాల్లో పూడికలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానంతో కరోనరీ యాంజియోగ్రాం చేశారు. పూడికలేమీ లేవని తేల్చారు.అయితే.. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి ఎక్కువగా చదవటం.. ఐప్యాడ్ చూస్తుండటంతో వెన్నుముక మీద ఒత్తిడి పడి సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్య తలెత్తినట్లుగా పేర్కొన్నారు.

ఈ కారణంతోనే ఎడమ చేయి నొప్పి పుడుతోందని తేల్చారు. న్యూరో ఫిజీషియన్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గడిచిన కొన్ని రోజులుగా పర్యటనలు చేయటం.. బహిరంగ సభల్లో మాట్లాడటం వల్ల నీరసం వచ్చి ఉంటుందని.. వయసు రీత్యా ఇది సాధారణమని చెబుతున్నారు. అందుకే వారం పాటు విశ్రాంతి అవసరమన్నారు.
జాతీయ రాజకీయాల్లో బిజీ కావాలని కోరుకుంటున్న కేసీఆర్.. ప్రస్తుతానికైతే వారం పాటు విశ్రాంతి అవసరం. ఆ తర్వాతే ఏదైనా.

యూపీతో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావటం.. నాలుగు రాష్ట్రాల్లో కమల వికాసం నేపథ్యంలో కేసీఆర్ స్పందన ఏలా ఉండదనుందన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలోనే ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావటంతో.. ఆసుపత్రికి వెళ్లారు. వైద్యుల మాట నేపథ్యంలో మరో వారం పాటు విశ్రాంతి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు మీదా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News