ఢిల్లీ వ‌దిలి గ‌ల్లీకి తెలంగాణ లీడ‌ర్లు..!

Update: 2022-02-28 01:08 GMT
తెలంగాణ లీడ‌ర్లు ఢిల్లీ వ‌దిలి గ‌ల్లీ బాట ప‌ట్ట‌నున్నారా..? పార్ల‌మెంటుతో పోలిస్తే అసెంబ్లీ స్థాన‌మే త‌మ‌కు సుర‌క్షిత‌మ‌ని భావిస్తున్నారా..?  ఆ దిశ‌గా ఆయా పార్టీల అధిష్ఠానాల వ‌ద్ద ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా..? ప్ర‌స్తుత‌ ఎంపీల‌తో పాటు మాజీ ఎంపీలు కూడా అసెంబ్లీపై క‌న్నేశారా..? అంటే అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. ముందుగా అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ జాబితా ఎక్కువ‌గా ఉంది.

ఎంపీ స్థానం కంటే అంసెబ్లీ పైనే త‌మ ఫోక‌స్ ఎక్కువ‌గా పెట్టారు. మెద‌క్ ఎంపీ కొత్త‌ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఈ సారి దుబ్బాక అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రామ‌లింగా రెడ్డి మ‌ర‌ణంతో వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో ఆయ‌న స‌తీమణికి టికెట్ కేటాయిస్తే ఆమె స్వ‌ల్ప తేడాతో ఓట‌మి చ‌విచూశారు. ఈసారి అక్క‌డి నుంచి ప్ర‌భాక‌ర్ రెడ్డి పోటీకి ఆస‌క్తి చూపుతున్నారు.

అలాగే మ‌హ‌బూబాబాద్ ఎంపీ మాలోతు క‌విత కూడా మ‌హ‌బూబాబాద్ అసెంబ్లీ బ‌రిలో దిగేందుకు ఉత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈమె గ‌తంలో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. మ‌రోసారి ఇక్క‌డి నుంచి పోటీకి గ‌ట్టిగానే కృషి చేస్తున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మ‌రోసారి ఎంపీగా పోటీకి అనాస‌క్తిగా ఉన్నారు.

రంగారెడ్డి శివార్ల‌లోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం కోసం అధినేత వ‌ద్ద ప‌ట్టుబ‌డుతున్నారు. వీరితో పాటు ఖ‌మ్మం, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, న‌గేశ్ కూడా అసెంబ్లీకే మొగ్గు చూపుతున్నారు. క్రితం సారి సికింద్రాబాద్ పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిన మంత్రి త‌ల‌సాని కుమారుడు సాయికిర‌ణ్ కూడా అసెంబ్లీకే ట్రై చేస్తున్నారు.

కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి ఈసారి క‌చ్చితంగా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. రేవంత్ కొడంగ‌ల్ నుంచి.. కోమ‌టి రెడ్డి న‌ల్ల‌గొండ నుంచి.. ఉత్త‌మ్ కోదాడ నుంచి పోటీలో ఉండ‌బోతున్నారు. వీరు ముగ్గ‌రు సీఎం ప‌ద‌వికి పోటీదారులే కావ‌డం విశేషం. వీరితో పాటు మాజీ ఎంపీలు పొన్నం ప్ర‌భాక‌ర్‌, బ‌ల‌రాం నాయ‌క్‌, అంజ‌న్ కుమార్ యాద‌వ్ కూడా ఎమ్మెల్యే టికెట్లే ఆశిస్తున్నారు.

ఇక బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఈసారి అంబ‌ర్ పేట అసెంబ్లీ బ‌రిలో ఉండ‌నున్నారు. క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ క‌రీంన‌గ‌ర్ లేదా వేముల‌వాడ అసెంబ్లీ స్థానాల‌పై గురి పెట్టారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు కూడా అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. క్రితం సారి ఎంపీ స్థానాల‌కు పోటీ చేసిన జితేంద‌ర్ రెడ్డి, తూళ్ల వీరేంద‌ర్ గౌడ్ కూడా లోక‌ల్ గానే ఉండాల‌ని భావిస్తున్నారు. వీళ్లంద‌రి ఆశ‌లు ఏ మేర‌కు నెర‌వేరుతాయో.. పార్టీలు ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తాయో వేచి చూడాలి.
Tags:    

Similar News