సీఎం జగన్ తాజా టార్గెట్ విన్నారా? 175 సీట్లు ఎందుకు గెలవలేం?

Update: 2022-04-28 05:18 GMT
ప్రజాస్వామ్యం లో బలమైన ప్రతిపక్షం చాలా అవసరమని చెబుతారు. ఎప్పుడైతే ప్రభుత్వానికి ధీటుగా ప్రతిపక్షం ఉంటుందో.. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లటంతో పాటు.. అందరూ బాధ్యతగా వ్యవహరించే వీలుంది. అందుకు భిన్నంగా అధికారం కొందరి చేతుల్లో ఉండిపోతే.. ప్రజలకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. అందుకే.. తిరుగులేని నాయకత్వం కొన్ని సందర్భాల్లో బాగానే ఉన్నా.. చాలా సందర్భాల్లో మాత్రం ఈ పవర్ పక్కదారి పట్టేందుకే అవకాశం ఉంటుంది. అందుకే.. అధికారం అందరి చేతుల్లో సమానంగా కాకున్నా.. కాస్త అటు ఇటుగా అలా ఉంటే మంచిదన్నమాట వినిపిస్తూ ఉంటుంది.

తాజాగా మంత్రులు.. పార్టీ ప్రాంతీయ సమన్వయ కర్తలు.. జిల్లా అధ్యక్షులతో సమావేశమైన సందర్భంగా 2019 సార్వత్రిక ఎన్నికల వేళ తాము సాధించిన 151 సీట్లకు బదులుగా.. అసెంబ్లీలో ఉన్న 175 సీట్లను ఎందుకు గెలవలేమన్న ప్రశ్నను సంధించటం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న 151సీట్లకు ఒక్కటి కూడా తగ్గకూడదన్న ఆయన.. కరోనా వేళలోనూ సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

కరోనా సమయం లోనూ సంక్షేమ పథకాల్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నప్పుడు 175 స్థానాల్ని ఎందుకు గెలవలేం? అంటూ సంధించిన ప్రశ్న.. ఆ సమావేశానికి హాజరైన అధికార పార్టీ నేతలందరిని కాసింత విస్మయానికి గురైందన్న మాట వినిపిస్తోంది. ఎంత ఆశ ఉన్నప్పటికీ ప్రజాక్షేత్రంలో జరిగే ఎన్నికల్లో నూటికి నూరు మార్కుల్నితాము సొంతం చేసుకోవాలన్న ఆశ ఏ మాత్రం సరికాదన్న వాదన వినిపిస్తోంది.

నిజంగానే జగన్ కోరుకున్నట్లుగా.. మొత్తం సీట్లను ఆయన పార్టీనే సొంతం చేసుకున్నారనుకుందాం. అప్పుడేం జరుగుతుంది? ప్రశ్నించే గొంతు అన్నది లేకుండా పోతుంది. తప్పుల్ని ఎత్తి చూపించినోడు పిచ్చోడ్నిచేస్తారు.

మొత్తంగా వ్యవస్థ కొత్త తరహా లోకి మారి పోతుంది. ఎవరు ఏమైనా అడిగే ప్రయత్నం చేస్తే.. ప్రజలే సంపూర్ణ విశ్వాసాన్ని కట్టబెట్టి మొత్తం సీట్లు ఇచ్చేశారని.. అలాంటప్పుడు చిల్లరగాళ్లు కొందరు ఏవో ఒక సందేహాల్ని ప్రదర్శిస్తారని మండిపడితే పరిస్థితి ఏమిటి? అయినా ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకోవాలే తప్పించి.. అసలు విపక్షమే లేని ప్రభుత్వం ఏర్పడాలన్న ఆశ.. అత్యాశ కాకుండా మరేమిటన్న మాట వినిపిస్తోంది.

దేశంలోనూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది అధినేతలు.. నేతలు వచ్చారు. కానీ.. ఉన్న మొత్తం సీట్లు తమ పార్టీనే ఎందుకు గెలవకూడదన్న ప్రశ్నను సంధించిన మొదటి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డే అవుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నలుగురి మాదిరి జగన్ ఎందుకు ఉండాలి. తానొక్కడే అన్న విషయాన్ని తన మాటలతోనూ చెప్పకపోతే ఎలా చెప్పండి?
Tags:    

Similar News