చివరకు కాంగ్రెస్ ఎటూ కాకుండా పోతుందా ?

Update: 2022-03-28 10:30 GMT
వరుస ఓటముల కారణంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఏమి చేస్తోందో ? ఏమి ఆలోచిస్తోందో కూడా ఎవరికీ అర్థం కావటం లేదు.  ఈ ఏడాది చివరలో జరగబోతున్న గుజరాత్, హిమాచల్  ఎన్నికల్లో వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను తీసుకోవాలని ఆలోచిస్తోంది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పటికే ప్రశాంత్ తో మంతనాలు జరిపారట. రాబోయే రోజుల్లో వాళ్ళ భేటీపై మరింత క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు.

అయితే వ్యూహకర్తగా  ప్రశాంత్ ను మళ్ళీ తీసుకురావటం కాంగ్రెస్ లోనే కొందరు సీనియర్లకు ఏమాత్రం నచ్చటం లేదట. ఎందుకంటే ప్రశాంత్ వల్లే పార్టీ అధికారంలోకి వస్తుందనే వాదనను సీనియర్లు కొట్టి పడేస్తున్నారు.

గోవాలో ప్రశాంత్ తృణమూల్ కాంగ్రెస్ కు పనిచేశారు. అయితే ఆ పార్టీకి గోవాలో ఒక్క సీటు కూడా రాకపోవటాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే 2017లో యూపీకి కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేసినా 7 సీట్లకు మించి రాలేదన్న విషయాన్ని సీనియర్లు ప్రస్తావిస్తున్నారు.

సరే ఈ విషయాన్ని వదిలేసినా కాంగ్రెస్ జాతీయ స్ధాయి వ్యూహకర్తగా ఈ మధ్యనే సునీల్ కానుగోలును నియమించుకున్నది. ఒకపుడు సునీల్ ఇదే ప్రశాంత్ టీములో పనిచేశాడు.

తర్వాత బయటకు వచ్చేసి సొంతంగానే ఒక కంపెనీ పెట్టుకున్నాడు. ఆల్రెడీ సునీల్ తో జాతీయ స్ధాయిలో ఒప్పందం చేసుకుని మళ్ళీ ఇపుడు ప్రశాంత్ తో ప్రత్యేకంగా ఒప్పందం ఎందుకు చేసుకోవాలని అనుకుంటోందా అర్థం కావటంలేదు. ఇపుడు ప్రశాంత్ తో ఒప్పందం చేసుకుంటే మరి సునీల్ ఏమి చేస్తాడు ?

జాతీయ స్థాయిలో చేసుకున్న ఒప్పందంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ కూడా వస్తుంది కదా ? అంటే ఒకే పార్టీకి ఏకకాలంలో ఇద్దరు వ్యూహకర్తలు పనిచేస్తారా ? అసలు ఇద్దరు వ్యూహకర్తల మధ్య సమన్వయం ఎలాగుందో ఎవరికీ తెలీదు. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యూహకర్తలతో ఏకకాలంలో పనిచేయించుకోవాలన్న ఆలోచన విచిత్రంగా ఉంది. చివరకు  కాంగ్రెస్ పార్టీ ఎటూ కాకుండా పోతుందని సీనియర్లు గోల చేస్తున్నారు.
Tags:    

Similar News