పంతం నెగ్గిందా జ‌గ‌న్ ! ఘ‌టికుడివే !

Update: 2022-07-05 04:47 GMT
నిన్న అచ్చెన్న‌ను పోలీసులు అడ్డుకున్నారు. మొన్న రఘురామను  పోలీసులు అనుస‌రించి స‌భ‌కు రానివ్వ‌కుండా చేశారు. ఈ రెండు సంఘ‌టన‌ల్లో జ‌గ‌న్ తాను అనుకున్న‌దే చివ‌రికి సాధించారు. ఓ విధంగా ప‌వ‌న్ రారు అనుకున్నారు క‌నుక రాలేదు. ఆ సంగ‌తి అటుంచితే ! కేంద్ర ప్ర‌భుత్వం పిలిచినా., రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న‌ను అవ‌మానించింద‌ని బాధ‌ప‌డుతున్నారు అచ్చెన్నాయుడు.

పీఎంఓ నుంచి వ‌చ్చిన జాబితాలో హెలి ప్యాడ్ వ‌ద్ద స్వాగ‌తం ప‌లికే నాయ‌కుల జాబితాలో అచ్చెన్న పేరు ఉంది. కానీ రాష్ట్ర స్థాయి అధికారుల జాబితాలో ఆయన పేరు లేక‌పోవ‌డంతో క‌లెక్ట‌ర్ ఆయ‌న్ను అడ్డుకున్నారు. దీంతో ఆయ‌న అధికారుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం తీరుపై మండిప‌డుతున్నారు. వాస్త‌వానికి అసెంబ్లీలో కూడా ఈ  సారి అచ్చెన్న గెల‌వ‌డానికి వీల్లేద‌ని ఆయ‌న రావ‌డానికి వీల్లేద‌ని జ‌గ‌న్ త‌న వ‌ర్గానికి చెప్పి ఉన్నార‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో వినిపించే మాట. ఆ మాట‌కు అనుగుణంగానే గ‌త ఎన్నిక‌ల్లో టెక్క‌లిలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు న‌డిచేయి. కానీ ఆఖ‌రి నిమిషంలో పేరాడ తిల‌క్ ఓడిపోయారు.

అంత‌ర్గ‌త కుమ్ములాట కార‌ణంగానే ఆయ‌న ఓడిపోయారు. ఈ విష‌యం గ్ర‌హించి ఇప్పుడు బ‌ల‌మైన అభ్య‌ర్థి వేట‌లో జగ‌న్ ఉన్నారు. ఆ ఎన్నిక‌ల్లో కింజ‌రాపు కుటుంబం జ‌గ‌న్ కు ఝ‌ల‌క్ ఇచ్చింది. దివంగ‌త నేత ఎర్ర‌న్నాయుడు సోద‌రుడు అచ్చెన్నాయుడు, కుమారుడు రామ్మోహ‌న్ నాయుడు (ఎంపీ, శ్రీ‌కాకుళం), కుమార్తె ఆదిరెడ్డి భ‌వానీ (ఎమ్మెల్యే, రాజ‌మండ్రి), ఇంకా ఎంపీ కుటుంబానికి మ‌ద్ద‌తు దారుడిగా నిలిచే అశోక్ బెందాళం (ఇచ్ఛాపురం ఎమ్మెల్యే) ఇలా వ‌రుస‌గా న‌లుగురు గెలిచి జ‌గ‌న్ కు షాక్ ఇచ్చారు. అప్ప‌టి నుంచి ఆ నాలుగు స్థానాల‌పై కూడా జ‌గ‌న్ క‌న్నేసి ఉంచారు.

అసెంబ్లీలో కూడా అచ్చెన్న‌ను నిలువ‌రించేందుకే వైసీపీ ఆయ‌న శ‌రీరాకృతిపై కామెంట్లు చేస్తుంటుంది అన్న విమర్శ కూడా ఉంది. ఇక నిన్న‌టి వేళ అచ్చెన్న‌ను నిలువ‌రించి ఓ విధంగా జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు. కానీ టీడీపీ వర్గాలు ఇదెంత మాత్రం భావ్యం కాద‌ని, త‌మ‌ను పిలిచి అవమానించారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

విప‌క్ష పార్టీలను క‌లుపుకుని పోవాల్సిన కార్య‌క్ర‌మంలో కూడా వివ‌క్ష చూపించ‌డం త‌గ‌దు  అని హిత‌వు చెబుతోంది. ఇక తిరుగుబాటు ఎంపీ ట్రిపుల్ ఆర్ విష‌య‌మై కూడా జ‌గ‌న్ పై  చేయి సాధించారు. ర‌ఘురామతో పోలిస్తే అచ్చెన్న వ్యాఖ్య‌లేవీ దిగ‌జారి ఉండ‌వు.అయినా కూడా ఎందుకనో జ‌గ‌న్ వ‌ర్గాలు ఆయ‌న రాక‌ను నిలువ‌రించి విమ‌ర్శ‌లు మూట‌క‌ట్టుకుంది.
Tags:    

Similar News