మేకపాటి అజాత శత్రువు ఎలా అయ్యారంటే? 5 కారణాలివే !

Update: 2022-02-22 07:36 GMT
సౌమ్యత ..వినమ్రత

విపక్ష నేతలనూ గౌరవించే నైజం

అహంకారం లేకపోవడం / అందరినీ కలుపుకునే నైజం

వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండడం

బూతులు మాట్లాడకపోవడం

ఇప్ప‌టి రాజ‌కీయ నాయ‌కుల‌తో అస్స‌లు పోలిక లేని స్ఫుర‌ద్రూపం (మంచిరూపం) ఒక‌టి నిన్న‌టి వేళ లోకం విడిచి వెళ్లిపోయింది. అంత‌ర్గ‌త క‌ల‌హాలను కానీ వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లను కానీ ఏమీ ప‌ట్టించుకోకుండా మెలిగే నైజం ఒక‌టి మ‌న మ‌ధ్య నుంచి దూరం అయిపోయింది.ఏపీ స‌చివాల‌యంలో దుఃఖం నెల్లూరులో దుఃఖం తెలంగాణ వాకిట దుఃఖం అన్నింటా దుఃఖం అన్నింటి చెంత దుఃఖం నిన్న‌టి వేళ సాగ‌ర‌మైంది.ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మొద‌లుకుని అంద‌రికీ పెద‌వి దాటని మాట ఒక‌టి మౌన శాబ్దిక ఛాయ‌లో ఉండిపోయింది.ఆయ‌న పేరు ఎవ్వ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు.సామాన్యుల‌కు అస్స‌లు తెలియ‌దు.ఆయ‌న రూపం కానీ ఆయ‌న న‌డ‌వ‌డి కానీ ఏవీ మీడియా కెమెరాల‌కు పెద్ద‌గా చిక్క‌వు.అదే ప‌నిగా వివాదాల‌కు తావివ్వ‌రు.ముఖ్యంగా ఇత‌ర పార్టీ నేత‌ల‌తోనూ స‌ఖ్య‌త‌ను న‌డిపే లేదా నెర‌పే ఆ గుణం పేరు మేక‌పాటి గౌతం రెడ్డి. ఆ రూపం పేరు మేక‌పాటి గౌతం రెడ్డి.

మంత్రి  మేక‌పాటి గౌతం రెడ్డి మొద‌ట్నుంచి వివాదర‌హితులు.ఉన్న‌త విద్యావంతుడు కావ‌డంతో అధికారుల‌తో మెలిగే తీరు ఎప్పుడూ బాగుండేది.ఆయ‌న పార్టీల‌కు అతీతంగా అభిమానులను సంపాదించుకున్నారంటే అందుకు కార‌ణం  ఆయ‌న న‌డ‌వ‌డికే ! ముఖ్యంగా హుందాగా న‌డుచుకున్న తీరే ఆయ‌న‌కు ఇంత‌టి ఖ్యాతిని  తెచ్చిపెట్టింది.అపోలో దారుల్లో ఆంధ్రా, తెలంగాణ‌ నాయ‌కుల విషణ్ణ వ‌దనాలు తార‌సిల్లుతూ, దుఃఖాశ్రువులు చిందించాయి.నెల్లూరు నాయ‌కుల్లో అంత‌టి సౌమ్య గుణం మ‌రోసారి మ‌రొక్క‌రిలో ఊహించ‌లేం.సంప‌న్న కుటుంబాల్లో ఉండే అహం ఆయ‌న‌లో లేని కార‌ణం ఇంత‌టి ప్రాభవానికి ఓ కార‌ణం.శ్రీ‌కాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కూ ఆయ‌న‌కు ఉన్న‌వారంతా స్నేహితులు. ప‌ది ప‌న్నెండేళ్ల స్నేహం కేటీఆర్ తో.. అదేవిధంగా ఇంకొన్నేళ్ల స్నేహం ప‌వ‌న్ తో..ఇంకా ఇంకొంద‌రిది ఆ స్నేహం.. ఇంకా ఇంకొంద‌రి సొంతం ఆ మౌన భాష‌ణం కూడా!

తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి బంధువు. ఇంకా ఇంకొంద‌రికి ఆత్మ బంధువు. వైసీపీ ఆవిర్భావం నుంచి తండ్రి అడుగుజాడ‌ల్లో న‌డిచిన వైనం ఇవాళ ఒక స్మ‌ర‌ణ. 2014,2019 ఎన్నిక‌ల్లో గెలుపు త‌రువాత ఆయ‌న మ‌రింత ఎదిగారు.ఐటీ మరియు ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి అయ్యారు. కానీ ఇత‌ర అమాత్యుల‌తో ఏనాడూ విభేదాలు లేవు. అదేవిధంగా వారిని పోలిన విధంగా ప్ర‌వ‌ర్తన కూడా లేదు. జ‌గ‌న్ క్యాబినెట్ లో బూతులు మాట్లాడ‌ని ఏకైక మంత్రి ఆయ‌నే అంటే ఆశ్చ‌ర్యం లేదు.

అందుకే ఆయ‌న‌ను చూసి మంత్రులు త‌మ న‌డ‌వ‌డి మార్చుకోవాల‌న్న‌ది ఇప్పుడు అంద‌రూ వ్య‌క్తం చేస్తున్న నిశ్చ‌లాభిప్రాయం. పాటించినా పాటించ‌కున్నా మ‌న మంత్రులు ఆయ‌న విడిచిపోయిన హుందాత‌నంను కొన‌సాగిస్తే మేలు.హోదాకు త‌గ్గ విధంగా ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌వ‌ర్తిస్తే ఇంకా మేలు. డ్రైవ‌ర్ ను కూడా గౌర‌వించే సంస్కారంను అల‌వాటు చేసుకుంటే ఇంకా మేలు. ఆ విధంగా ఆయ‌న ఇప్పుడు ఎన్నో జ్ఞాప‌కాల‌కు ఆన‌వాలు. ఉన్నత వ్య‌క్తిత్వానికి గీటురాయి. ఇంకా  ఏవేవో ఎన్నెన్నో క‌న్నీటి సంద్రాల‌లో క‌ద‌లాడుతున్నాయి. ఆ ఉప్పుటేరు గాలుల్లో మెద‌లాడుతున్నాయి. డియ‌ర్ స‌ర్ వి మిస్ యూ..!
Tags:    

Similar News