అవంతిని రీప్లేస్ చేసేది ఆయనేనా.. ?

Update: 2022-03-16 10:32 GMT
విశాఖ జిల్లా కొత్తగా విభజన తరువాత స్వరూప స్వభావాలు మారిపోతాయి. కేవలం ఆరు అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉంటాయి. ఇందులో రెండింటిలో మాత్రమే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. భీమిలీ నుంచి ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తూంటే గాజువాకలో జనసేనాని పవన్ ని  ఓడించిన తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపధ్యంలో అవంతిని తప్పిస్తే నాగిరెడ్డికి మాత్రమే మంత్రి పదవి ఇవ్వాలి.

అయితే ఆయన వయసు రిత్యా, సామాజిక సమీకరణల దృష్ట్యా మంత్రి పదవి అన్నది దక్కదు అని ఫిక్స్ అయిపోతున్నారు. మరి విశాఖ వంటి మెగా సిటీలో కొత్త మంత్రి ఎవరు అన్న చర్చ వస్తోంది. దానికి జవాబుగా ఎమ్మెల్సీ, విశాఖ సిటీ వైసీపీ ప్రెసిడెంట్ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ కనిపిస్తున్నారు.

ఆయనంటే జగన్ కి ప్రత్యేక అభిమానం ఉంది. మేయర్ ని చేస్తానని నాడు హామీ ఇచ్చినా మహిళకు ఆ పదవి కేటాయించడంతో ఎమ్మెల్సీగా చేశారు. ఇపుడు ఆయనకే అమాత్య కిరీటం కూడా దక్కబోతోంది అని ప్రచారం జోరుగా సాగుతోంది. కొత్త జిల్లాగా ఏర్పడబోతున్న విశాఖ సిటీలో కాపులతో పాటు యాదవులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాంతో సామాజిక సమీకరణలు బేరీజు వేసుకుంటే వంశీకే లక్కీ చాన్స్ తగిలేలా ఉందని అంటున్నారు.

ఇక ఈ మధ్య జగన్ విశాఖ వచ్చినపుడు వంశీతో ప్రత్యేకంగా కాసేపు ముచ్చటించడంతో నాడే ఆయన మినిస్టర్ అని అంతా అంచనా వేశారు. ఇక ఈ మధ్య జరిగిన యాదవ సామాజిక వర్గం సమావేశంలో కూడా వంశీని కాబోయే మంత్రిగా ఆ కులస్థులు పేర్కొంటూ విషెస్ అడ్వాన్స్ గా  చెప్పేశారు.

పార్టీని నమ్ముకుని పన్నెండేళ్ళుగా పనిచేస్తున్న వంశీకి మూడు నెలల క్రితం వరకూ ఏ అధికార  పదవీ అయితే  దక్కలేదు. ఎపుడూ చివరి నిముషంలోనే అవకాశాలు జారిపోతూ ఉండేవి. రాజకీయ దురదృష్టవంతుడిగా ఆయనని అంతా పేర్కొంటూ సానుభూతి చూపేవారు.

అలాంటి వంశీకి ఎమ్మెల్సీ లభించడం, తక్కువ వ్యవధిలోనే మినిస్టర్ పోస్ట్ కూడా ఖరారు అయిందన్న ప్రచారంతో అనుచరులు అభిమానులు ఖుషీ అవుతున్నారు.  ఈ వార్త  నిజం కావాలని వారు కోరుకుంటున్నారు. చివర్లో  ఏ రకమైన రాజకీయ  మతలబు జరగకపోతే మాత్రం వంశీ మినిస్టర్ కావడం గ్యారంటీ అని అంటున్నారు.
Tags:    

Similar News