సుప్రీం సీజే జస్టిస్ రమణపై ఇంకా ఒమైక్రాన్ ప్రభావం

Update: 2022-02-23 10:52 GMT
ఇప్పటివరకు వచ్చిన అన్ని కొవిడ్ వేరియంట్లలో వ్యాప్తిపరంగా వేగంగా ఉంటూ.. తీవ్రత రీత్యా తక్కు ప్రభావవంతమైనది ఒమైక్రాన్ అని చెబుతుంటారు. ఇందులో కొంత అటుఇటు అయినా.. ఒమైక్రాన్ మాత్రం ప్రమాదకరం కాదని మన అనుభవాల ద్వారా కూడా తెలిసొచ్చింది. మరోవైపు ఈ వేరియంట్ దక్షిణాఫ్రికాలో గతేడాది నవంబరు చివరిలో వెలుగుచూసి కొద్ది రోజుల్లోనే ప్రపంచాన్ని చుట్టేసింది.

సహజంగానే వ్యాప్తి అత్యంత వేగం కాబట్టి.. అప్పటివరకు మనుగడలో ఉన్న ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ ను పక్కకునెట్టింది. డెల్టా స్థానాన్ని ఒమైక్రాన్ ఆక్రమించడంతో.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కేసులు నమోదయ్యాయి. ఒక్క అమెరికాలోనే ఒక్క రోజులో 10 లక్షల పైగా కేసులు నమోదవడం దీనికి నిదర్శనం. అయితే, మరణాలు మాత్రం చాలా స్వల్పంగా ఉన్నాయి. అదే ఒమైక్రాన్ కు గనుక డెల్టా అంతటి తీవ్రత కనుక ఉంటే ప్రపంచం అల్లకల్లోలం  అయిపోయి ఉండేది.

దేశంలో అందరినీ చుట్టేసిన ఒమైక్రాన్

ఇదంతా పక్కనపెడితే ఒమైక్రాన్ తో మన దేశంలో థర్డ్ వేవ్ వచ్చింది. వాస్తవానికి డెల్టా వేరియంట్ తగ్గుముఖం పట్టి.. సెకండ్ వేవ్ కనుమరుగు అవుతున్నక్రమంలో మరో వేవ్ కు అవకాశం ఉందా? లేదా? అనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. దీనికితోడు టీకా పంపిణీ కూడా భారీగా సాగడంతో మరో వేవ్ రావాలంటే డెల్టా కంటే గట్టి వేరియంట్ రావాలని నిపుణులు పేర్కొన్నారు.

ఈ మేరకు ఒమైక్రాన్ వచ్చిఅందరినీ చుట్టేసింది. మొదటి, రెండో వేవ్ లో కొవిడ్ కు గురికాని వారు ఈ వేవ్ లో దొరికిపోయారు. అంతకుముందు ఓసారి వైరస్ కు గురైన వారికీ థర్డ్ వేవ్ లో రెండోసారి పాజిటివ్ వచ్చింది. కొందరు మూడోసారీ వైరస్ సోకినవారున్నా వీరి సంఖ్య అతి స్వల్పం. మొత్తానికి కొందరు నిపుణుల మాట ప్రకారం చైనాలో పుట్టి ప్రపంచాన్ని రెండేళ్లు వణికించిన కరోనాకు.. ఒమైక్రాన్ రూపంలో సహజ సిద్ధ వ్యాక్సిన్ లభించింది.

ఇంతకీ సీజే రమణ ఏమన్నారు...?

కాగా, ఒమైక్రాన్ తీవ్రత చాలా స్వల్పమని చాలామంది నిపుణులు పేర్కొంటున్నా.. కొందరిలో కోలుకున్నాక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నట్లు కూడా స్పష్టమైంది. ఇదే విషయాన్ని బుధవారం సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ సోకి తగ్గినప్పటికీ.. దాని ప్రభావంతో తాను ఇంకా బాధపడుతున్నానని జస్టిస్‌ రమణ తెలిపారు. సుప్రీంకోర్టులో పూర్తి స్థాయిలో భౌతిక విచారణలు ప్రారంభించాలని ఓ సీనియర్‌ న్యాయవాది చేసిన అభ్యర్థనకు సీజేఐ ఆ మేరకు స్పందించారు. ‘‘భౌతిక విచారణలు పాక్షికంగా మొదలవడం ఆనందంగా ఉంది. అయితే ఒమిక్రాన్‌ ఇప్పుడు వైరల్‌ జ్వరంగా మారింది. దీని లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయి. ప్రజలు తొందరగా కోలుకుంటున్నారు. అందువల్ల, సుప్రీంకోర్టులో పూర్తి స్థాయి భౌతిక విచారణలను పునరుద్ధరించాలని కోరుతున్నా’’అని సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ సీజేఐను అభ్యర్థించారు. దీనికి సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ స్పందిస్తూ.. ‘‘నాకు ఒమైక్రాన్ సోకింది. నాలుగు రోజుల్లోనే తగ్గింది. కానీ ఇంకా నాపై  దాని ప్రభావం ఉంది. ఒమైక్రాన్ సైలెంట్‌ కిల్లర్‌ లాంటిది.

నేను ఫస్ట్ వేవ్‌లో వైరస్‌ బారిన పడి త్వరగానే కోలుకున్నా. కానీ, థర్డ్ వేవ్‌లో ఒమైక్రాన్‌ సోకి 25 రోజులు గడుస్తున్నా వైరస్ అనంతర ప్రభావాలతో ఇబ్బంది పడుతూనే ఉన్నా’’ అని  అన్నారు. దేశంలో కేసులు ఇంకా ఎక్కువగా  నమోదవుతున్నాయని, బుధవారం కూడా 15వేలకు పైనే కొత్త కేసులు వెలుగుచూశాయని సీజేఐ తెలిపారు. అయితే వైరస్‌ పరిస్థితి సమీక్షించి.. పూర్తి స్థాయి భౌతిక విచారణలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Tags:    

Similar News