వ్యూహకర్తల గురుశిష్యులు.. సరికొత్త లడాయికి కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ

Update: 2022-03-01 03:17 GMT
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నరకు పైనే సమయం ఉంది. అలా అని షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే.. అనూహ్య నిర్ణయాలతో ప్రత్యర్థులకు షాకులిచ్చే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే.

తనకు మేలు జరుగుతుందంటే.. అప్పటికప్పుడు ఏదో ఒక ఇష్యూను ఎన్నికల నినాదంగా మార్చేసి.. ఎన్నికలకు సిద్ధం చేయటం గత ఎన్నికల వేళలోనే చూశాం. ఇప్పుడు కూడా అలా జరగటానికి అంతో ఇంతో అవకాశం ఉందన్నది మర్చిపోకూడదు.

ఈ వాదనను బలపరిచేలా.. ఎన్నికలకు ఏడాదిన్నర కంటే ముందే.. తెలంగాణ ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తల చేతికి చిక్కింది. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఇప్పుడు రాజకీయ వ్యూహకర్తల మీద ఆధారపడటం ఈసారి ఎన్నికల ప్రత్యేకతగా చెప్పాలి. వ్యూహకర్తల సందడితో తెలంగాణ రాజకీయం అంతకంతకూ హీటెక్కుతోంది. ఇప్పటివరకు అధినేతల ఆలోచనలకు తగ్గట్లు నడిచిన పార్టీలకు.. ఇప్పుడు వ్యూహకర్తల దన్ను చేరటంతో.. కొత్త తరహా రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

టీఆర్ఎస్ కు వ్యూహకర్తగా పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగితే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పీకే అనుచరుడు.. శిష్య సమానుడైన సునీల్ కనుగోలు వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు. ఇలా ఈ ఇద్దరు వ్యూహకర్తల వ్యూహాలతో ఇప్పుడు అధికార.. విపక్ష పార్టీలు మాంచి జోరు మీద ఉన్నాయి. తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని తరచూ బల్లగుద్ది చెప్పే బీజేపీ మాత్రం.. వ్యూహకర్తల అవసరం లేదని.. తమ అధిష్ఠానమే తమకు అసలుసిసలు వ్యూహకర్తగా పేర్కొంటోంది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోవటం.. ఇప్పటికే తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యమ్నాయం తామే అన్నట్లుగా వ్యవహరిస్తున్న బీజేపీ.. ఇప్పుడు తన ఫోకస్ అంతా గులాబీ బాస్ కేసీఆర్ మీదనే పెట్టింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత.. జాతీయ పార్టీ నాయకత్వం తెలంగాణ మీద ఫోకస్ చేస్తుందని.. అప్పటి నుంచి పరిణామాలు మరింత వేగంగా మారతాయన్న మాట వినిపిస్తోంది.

మొత్తంగా చూస్తే.. తెలంగాణ రాజకీయం ఇప్పుడు వ్యూహకర్తల చేతుల్లోకి వెళ్లిపోయిందని చెప్పాలి. అదే సమయంలో ఒకప్పుడు కలిసి పని చేసిన గురుశిష్యులు.. ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రత్యర్థుల మాదిరి బరిలోకి దిగి.. తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. పీకే దేశ రాజకీయ పార్టీలకే కాదు.. ప్రజలకు సుపరిచితులు. సునీల్ కనుగోలు మాత్రం కొద్ది మందికే తెలుసు. అయినప్పటికీ.. ఆయన వ్యూహాలు అదురుపాటుతో ఉంటాయన్న మాట వినిపిస్తోంది. మరీ.. వ్యూహకర్తల సమరంలో విజయం ఎవరిదన్నది కాలమే నిర్ణయించాలి.
Tags:    

Similar News