వైఎస్సార్ బ్రాండ్ ఇమేజ్ కి బీటలు...?

Update: 2022-03-01 08:30 GMT
వైఎస్సార్ అంటేనే తెలుగు రాజకీయాల్లో ఒక బ్రాండ్ ఇమేజ్. అది ఏదో ఒక రోజులో వచ్చింది కాదు. నిజానికి వైఎస్సార్ కూడా ఇలాంటి ఇమేజ్ ఏదో తనకు వస్తుందని అనుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఉండరు. ఆయన 1970 తొలి దశకంలో  డాక్టర్ విద్యను పూర్తి చేసుకుని ప్రజా వైద్యుడిగా పులివెందులలో ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఆయన కంటే తండ్రి రాజారెడ్డికే రాజకీయాల పట్ల అమితాసక్తి. అలా ఇంట్లో ప్రోత్సాహం, స్నేహితులు అభిమానుల వత్తిడితో రెడ్డి కాంగ్రెస్ ద్వారా 1978లో అంది వచ్చిన అవకాశాన్ని పుచ్చుకుని ఆయన పులివెందుల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆనక ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. అలా యువకుడిగానే కీలకమైన భూమిక రాజకీయాల్లో ఆయనకు దక్కడంతో రెట్టించిన ఉత్సాహంతో అందులో కొనసాగారు అనుకోవాలి. ఆ మీదట కేవలం 33 ఏళ్ళకే పీసీసీ చీఫ్ కావడం, నాడు యువ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రోత్సాహం ఉండడం, సినీ నటుడు కమ్ ముఖ్యమంత్రి ఎన్టీయార్ తో ఢీ అంటే ఢీ  కొట్టడం  వంటివి వైఎస్సార్ ని రాయలసీమతో పాటు ఏపీలో మంచి లీడర్ ని చేశాయి.

ఇక ఆ తరువాత చూస్తే వైఎస్సార్ పోరాట పటిమతోనే ఏ పదవులూ అందుకోకుండా రాజకీయాల్లో మూడు పదుల జీవితాన్ని చూశారు. సొంత పార్టీలో రెబెల్ గా ఉండడం, ముక్కుసూటి వైఖరి, చెప్పిన మాటకు కట్టుబడడం, దాని కోసం ఎంత దూరమైనా వెళ్ళే తెగింపు మొండితనం ఇవన్నీ వైస్సార్ కి బ్రహ్మాండమైన పొలిటికల్ బ్రాండ్ ఇమేజ్ ని తెచ్చి పెట్టాయి.

ప్రత్యేకించి కడప గడపలో వైఎస్సార్ ఫ్యామిలీ అంటే దైవ సమానంగా చూసారు. ఆయన పడిన కష్టానికి జనాల నుంచి తరగని ఆదరణ అలా లభించింది అనుకోవాలి. ఇక వైఎస్సార్ ముఖ్యమంత్రి కావాలని అభిమానులే కాదు, అనుచరులే కాదు,రాష్ట్ర ప్రజలు కూడా గట్టిగా కోరుకున్న వైనం కూడా ఒక దశలో కనిపించింది. ఆయన రెండు సార్లు కాంగ్రెస్ సీఎం గా అయిదుంపావు ఎళ్ళు పాలించారు. కేంద్రం మద్దతుతో మంచి కార్యక్రమాలు చేపడుతూ బెస్ట్ సీఎం అనిపించుకున్నారు.

నిజానికి అపారమైన ప్రజాదరణ ఉన్న వారు పాలనలో ఫెయిల్ అవుతారు. కానీ వైఎస్సార్ తన కత్తికి రండు వైపుల పదును ఉందని రుజువు చేసుకున్నారు. ఆయన పాలన మీద మోజు అలా ఉంటూండగానే  అనూహ్య దుర్ఘటనలో అసువులు బాసారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో వైఎస్సార్ కి పెద్ద ఎత్తున అనుచర గణం ఉంది. వారంతా వైఎస్సార్ బ్రాండ్ ఇమేజ్ కి ఆకర్షితులు అయిన వారే.

అదే జగన్ కి కూడా రాజకీయ పెట్టుబడిగా మారింది. కడప నుంచి వైఎస్ అన్న ఇంటి పేరుతో ఎవరు వచ్చినా వారికి రాజకీయ సోపానాలు అందించేటంతగా ఆ ఇమేజ్ ఇంధనంగా పనిచేస్తూ పోయింది. జగన్ కాంగ్రెస్ ని లెక్కచేయకుండా బయటకు వచ్చినా, బలమైన పార్టీలు, ప్రభుత్వాలతో పోరాడినా కర్ణుడికి కవచ కుండలాల మాదిరిగా ఆయనకు సదా రక్షణగా ఉన్నది వైఎస్సార్ బ్రాండ్ ఇమేజ్ మాత్రమే.

ఇక జగన్ కి 151 సీట్లు వచ్చాయీ అంటే దాని వెనక ఆయన కృషి, పట్టుదలతో పాటు వైఎస్సార్ బ్రాండ్ ఇమేజ్ కూడా చాలా దోహదపడింది అన్నది నిష్టుర సత్యం.  అలాంటి ఇమేజ్ కి ఇపుడు వరసగా తూట్లు పడుతోంది. అదీ స్వయంగా వైఎస్సార్ ఫ్యామిలీకి కోట లాంటి కడపలో, లోగిలి లాంటి పులివెందులలో.

సొంత బాబాయ్, మాజీ మంత్రి వివేకాందందరెడ్డి దారుణ హత్యకు బాధ్యులు ఎవరు అన్నది నిలువెత్తు ప్రశ్న తెలుగు జనాలను ఒక వైపు పట్టి పీడిస్తోంది. మరో వైపు సొంత కుటుంబీకులే ఈ హత్యను మీరంటే మీరు కారకులు అని  వేలెత్తి చూపుకుంటూ ఆరోపణలు చేసుకోవడం తెలుగు జనాలను నిశ్చేష్టులను చేస్తోంది.

ఒక విధంగా వైఎస్సార్ ఇమేజ్ కే కాదు, ఏపీలో అత్యంత ఆదరణ కలిగిన రాజకీయ కుటుంబం ఇలా వీధిన పడి పరువు కూడా తీసుకుంటోంది అన్న చర్చ వస్తోంది. సీబీఐ ఒక వైపు దర్యాప్తు జరుపుతోంది. మరో వైపు దీని మీద ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తున్నాయి. దీంతో వైఎస్సార్ ఫ్యామిలీ వారే  స్వీయ హననానికే పాల్పడుతున్నారా అన్న చర్చ కూడా వస్తోంది.

ఇక్కడ ఒక మాట అయితే వాస్తవం. వైఎస్సార్ ఇమేజ్ అనే మర్రి చెట్టు నీడనే అంతా ఉన్నారు,  ఒక్కసారి ఆ ఇమేజ్ కి కనుక భంగం వాటిల్లితే ఎంతటి పెద్ద వారికైనా రాజకీయ  ఇబ్బందులు తప్పవనే అంటున్నారు. ఒక విధంగా ఇదంతా చూస్తూంటే వైఎస్సార్ కుటుంబానికి రాజకీయంగా తీవ్ర నష్టాన్ని చేకూర్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ కధ ఎటువైపు సాగుతుందో. ఎంత దూరం పోతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News