సొంత నేత‌ల‌కు షాకిచ్చిన అమ్మ పార్టీ లాయ‌ర్‌

Update: 2017-06-24 07:42 GMT
అంత‌కంత‌కూ అంతుచిక్క‌ని రీతిలో అమ్మ మ‌రణంపై సాగుతున్న సంచ‌ల‌నాల ప‌రంప‌ర‌లో తాజాగా మ‌రో అంశం చోటు చేసుకుంది. అమ్మ మ‌ర‌ణాన్ని మిస్ట‌రీగా అభివ‌ర్ణిస్తూ తాజాగా అమ్మ పార్టీకి చెందిన న్యాయ‌వాది ఒక‌రు ఫిర్యాదు చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది.

అమ్మ మ‌ర‌ణం అనుమానాస్ప‌దంగా ఉంద‌ని.. ఆమె మ‌ర‌ణాన్ని మిస్టరీగా మార‌టానికి కార‌కులైన అమ్మ నెచ్చెలి శ‌శిక‌ళ మొద‌లుకొని.. నాటి ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వంతో స‌హా మొత్తం 186 మందిపై కేసులు పెట్టాలని కోరుతూ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు కావ‌టం త‌మిళ‌నాడు తాజా సంచ‌ల‌నంగా మారింది. జ్వ‌రం.. డీహైడ్రేష‌న్ అంటూ అపోలో ఆసుప‌త్రికి చేరిన జ‌య‌ల‌లిత ప్రాణాల‌తో తిరిగి రాక‌పోవ‌టంపై ఆయ‌న ప‌లు సందేహాలు వ్య‌క్తం చేశారు.

అమ్మ ఆసుప‌త్రిలో చేరిన సెప్టెంబ‌రు 22 నుంచి ఆమె మ‌ర‌ణించిన డిసెంబ‌రు 5 వ‌ర‌కు అంతా ర‌హ‌స్యంగా ఉంచార‌ని.. పార్టీ నేత‌లు.. ప్ర‌జ‌లు కోరుకున్నా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న జ‌య‌ల‌లిత ఫోటోలు విడుద‌ల చేయ‌లేద‌న్నారు.
రేపోమాపో అమ్మ డిశ్చార్జ్ అంటూ ప్ర‌క‌టించినా.. ఆమె మ‌ర‌ణం త‌ర్వాతే ఆసుప‌త్రి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారంటూ అన్నాడీఎంకే పార్టీకి చెందిన న్యాయ‌వాది వుహ‌ళేంది వాపోతున్నారు. అమ్మ మ‌ర‌ణం వెనుక శ‌శిక‌ళ‌.. ప‌న్నీరు సెల్వం హ‌స్తం ఉందంటూ ఆరోప‌ణ‌లు చేసిన పుహ‌ళేంది.. గ‌త నెల‌లో తేనంపేట పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. ఆయ‌న ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చ‌ర్యా తీసుకోలేదు. దీంతో.. తాజాగా ఆయ‌న 18వ మెట్రోపాలిట‌న్ కోర్టులో పిటీష‌న్ వేశారు. చికిత్స పొందుతున్న వేళ‌లో.. జ‌య‌ల‌లిత బాగా కోలుకుంటున్నార‌ని అపోలో యాజ‌మాన్యం పేర్కొంద‌న్నారు. అయితే.. ఆప్ర‌క‌ట‌న‌ల‌కు భిన్నంగా డిసెంబ‌రు 5న ఆమె ప్రాణాలు కోల్పోయిన‌ట్లుగా ప్ర‌క‌టించిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావిస్తూ.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే అమ్మ ప్రాణాలు తీశార‌ని ఆరోపించారు.

ఈ నేరంలో శ‌శిక‌ళ‌.. ప‌న్నీరు సెల్వంతో స‌హా.. అన్నాడీఎంకే నిర్వాహ‌కులు.. మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. అపోలో ఆసుప‌త్రి యాజ‌మాన్యంతో స‌హా మొత్తం 186 మంది పాత్ర ఉంద‌ని పేర్కొంటూ.. వారంద‌రిపై కేసులు న‌మోదు చేయాల‌ని పేర్కొన్నారు. మ‌రి.. దీనిపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుంద‌న్న‌ది ఇప్పుడు ఉత్కంఠ‌గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News