గౌతమ్ రెడ్డిని చాపర్ లో తరలిస్తున్న కుటుంబ సభ్యులు

Update: 2022-02-22 05:08 GMT
అనూహ్యంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమ యాత్రకు ఏర్పాట్లు సాగుతున్నాయి. సోమవారం ఉదయం హైదరాబాద్ లో గుండెపోటుకు గురై కన్నుమూసిన ఆయన్ను జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఉంచారు.

ఆయన అంతిమ సంస్కారాల్ని నెల్లూరు జిల్లాలో చేపట్టాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించిన వైనం తెలిసిందే. ఈ రోజు (మంగళవారం) ఉదయం 6.50 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు మాజీ ఎంపీ.. గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి.. మరికొందరు బయలుదేరి వెళ్లారు.

మరో చాపర్ లో మేకపాటి గౌతమ్ రెడ్డిని తరలిస్తున్నారు. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ నుంచి ఆయన భౌతికకాయాన్ని బేగంపేటకు తరలించారు.

పది గంటల సమయంలో మరో చాపర్ లో మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయంతో పాటు ఆయన సతీమణి శ్రీకీర్తి..తల్లి మణిమంజరి బయలుదేరి వెళ్లనున్నారు. మరికొందరు కుటుంబ సభ్యులు వెంట ఉండనున్నారు. ఈ చాపర్ ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఉదయం 11.15 గంటల వేళలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీస్ గ్రౌండ్ కు చాపర్ చేరుకోనుంది. 11.25 గంటలకు డైకాస్ రోడ్డులోని నెల్లూరు జిల్లా క్యాంపు కార్యాలయానికి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని చేరుస్తారు. అనంతరం ప్రజల సందర్శనార్థం మంత్రి క్యాంపు కార్యాలయంలో గౌతమ్ రెడ్డి పార్థిపదేహాన్ని ఉంచనున్నారు.

ఇదిలా ఉంటే యూఎస్ లో ఉన్న గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి మంగళవారం రాత్రి 11 గంటల వేళలో నెల్లూరు జిల్లా క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు. బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి అంతిమ సంస్కారాల్ని నిర్వహించనున్నారు. దీనికి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. అంత్యక్రియల్ని నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు.
Tags:    

Similar News