2020లో కరోనాతో కన్నుమూసిన నేతలు వీరే

Update: 2020-12-18 23:30 GMT
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ కకావికలమైన సంగతి తెలిసిందే. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు...తన పర భేదం లేదని చాటిచెప్పింది కరోనా. ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చాలామంది ప్రముఖులు కూడా కరోనాబారిన పడ్డారు. కొందరు రాజకీయ నేతలు, సినీ తారలు, క్రీడాకారులు కరోనా బారిన పడి కోలుకోగా....మరికొందరు కరోనా కాటుకు బలయ్యారు. ఇంతమందిని పొట్టనబెట్టుకున్న 2020 సంవత్సరం కరోనా నామ సంవత్సరం అంటూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. నూతన సంవత్సరం 2021లో వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చి కరోనా పీడ విరగడ కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కరోనా బారిన పడి కన్నుమూసిన రాజకీయ నేతలను ఆయా పార్టీల కార్యకర్తలు, నేతలు స్మరించుకుంటున్నారు.

భారత మాజీ రాష్ట్రపతి, దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ కరోనా బారిన పడి ఆగస్టు 31న తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది సెప్టెంబరు 24న కేంద్ర రైల్వే శాఖా సహాయ మంత్రి సురేశ్ అంగాడిని కూడా కరోనా మహమ్మారి పొట్టనబెట్టుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, సోనియా గాంధీకి సలహాదారు అయిన అహ్మద్ పటేల్ కూడా కరోనా బారినపడి నవంబర్ 25న చనిపోయారు. అసోం మాజీ సీఎం తరుణ్ గగోయ్ ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి నవంబరు 23న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తి కరోనా బారిన పడి సెప్టెంబరు 17న మరణించారు. తమిళనాడు వ్యవసాయ శాఖా మంత్రి ఆర్ దొరైకణ్ణు కరోనా కాటుకు గురై నవంబరు 1న తుదిశ్వాస విడిచారు. ఒడిసాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి, పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎమ్మెల్యే తమోనష్ ఘోష్, తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ లు కూడా కరోనాబారిన పడి అర్ధాంతరంగా తనువు చాలించారు.
Tags:    

Similar News