లాక్ డౌన్ లెసన్స్..ఫర్ ఎ లైఫ్ టైం!

Update: 2020-04-23 14:30 GMT
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచంలోని చాలా దేశాలు విధించిన బ్రహ్మాస్త్రం లాక్ డౌన్. కరోనా పేరు చెబితే ప్రపంచ దేశాల ప్రజలు ఎంతగా వణికి పోతున్నారో....లాక్ డౌన్ పేరు వింటే అదే రేంజ్ లో వణుకుతున్నారంటే అతిశకయోక్తి కాదు. ఇక, భారత్ లో అయితే లాక్ డౌన్ అంటే లాకప్ లా ఫీలవుతున్నారు చాలా మంది. కరోనాను కట్టడి చేసేందుకు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం వైద్యులు చెబుతున్నారు. అయితే, తమకు ఇల్లే జైలులా ఉందని...ఇంకెన్నాళ్లీ లాక్ డౌన్ వాసమని చాలామంది కక్కలేక మింగలేక ఉన్నారు. మరికొంత మంది మాత్రం లాక్ డౌన్ పక్కాగా పాటిస్తూ...ఇల్లే పదిలం అనుకుంటూ కాలం గడుపుతున్నారు. మొదటి విడత లాక్ డౌన్ 21 రోజులు ముగియగానే..పంజరం నుంచి బయటకు వచ్చిన రామచిలుకలా ఎగిరిపోదామనుకున్నారు చాలామంది. అయితే, అనూహ్యంగా...రెండో విడత లాక్ డౌన్ విధించడంతో చాలామంది తీవ్ర నిరాశకు గురయ్యారు. నేటితో లాక్ డౌన్ విధింపు ప్రకటన వెలువడి ఓవరాల్ గా నెల రోజులు కావస్తోంది.

దీంతో, మొదటి నెల స్వీయ గృహ నిర్బంధ శుభాకాంక్షలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. ఈ నెలరోజుల్లో కరోనా వల్ల అనివార్యమైన లాక్ డౌన్ వల్ల కలిగిన లాభాలేమిటి? నష్టాలేమిటి? లాక్ డౌన్ మనకు నేర్పిన పాఠాలేమిటి? గుణపాఠాలేమిటి? కరోనాకు ముందు..కరోనా సమయంలో...కరోనా తర్వాత జీవితం ఎలా ఉండబోతోంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. వైరస్ సామ్రాజ్యానికి రారాజు వంటి `కరోనా`ప్రపంచాన్ని గడగడలాడిస్తోందనిగానీ...ఇటువంటి ఓ వైరస్ ముళ్ల కిరీటాన్ని జనం నెత్తిమీద పెట్టుకోవాల్సి వస్తుందనిగానీ...కంటికి కనిపించని సూక్ష్మజీవిని చూసి సకలచరాచర జీవుల్లో అత్యుత్తమ మేధస్సు కలిగిన మానవుడు గజగజ వణికిపోతాడనిగానీ ఎవ్వరూ ఊహించి ఉండరు. దేశ ప్రధాని మొదలు నిరుపేద వరకు....ఎవ్వరిపైనా కరోనా కనికరం చూపలేదు. ఇక, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.

కరోనా, లాక్ డౌన్.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎన్నో పాఠాలు నేర్పించింది. కరోనా బారిన పడిన కోటీశ్వరులు సైతం కోలుకోలేక మృత్యువాతపడ్డారు. డబ్బే సర్వస్వం కాదని...ఐశ్వర్యం కన్నా ఆరోగ్యం గొప్పదని...ఆరోగ్యమే మహాభాగ్యమని కరోనా మనకు వార్నింగ్ బెల్ ఇచ్చింది. ఉద్యోగం - వ్యాపారం అంటూ బిజీబిజీగా ఉండే మగవారికి...పట్టుమని పది రోజులు ఇంటిపట్టునే ఉండడం ఎంత కష్టమో తెలిసేలా చేసింది. బిజీ షెడ్యూల్ ... టైం లేదంటూ ఉండే చాలామందికి...తమ భార్యాబిడ్డలతో ఇళ్లలో ఉండడం వల్ల ఎంత సంతోషం దాగుందో తెలిసేలా చేసింది. ఇళ్లలోని ఆడవారు ఎంత చాకిరి చేస్తున్నారో - మనకు కమ్మగా వండిపెట్టడానికి ఎంతకష్టపడుతున్నారో కరోనా చెప్పింది. ఉద్యోగం - వ్యాపారంతోపాటు కుటుంబానికి తగినంత సమయం కేటాయించాలని తెలియజెప్పింది. ఒక మనిషికి పొదుపు ఎంత అవసరమో ...దుబారా ఖర్చులు తగ్గించడం ఎంత ముఖ్యమో తెలియజెప్పింది. పొదుపు చేసుకున్న సొమ్ము ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అక్కరకు వస్తుందని తెలియజెప్పింది. సహజసిద్ధమైన ప్రకృతిని మనిషి ఏరకంగా నాశనం చేశాడో తెలియజెప్పింది.

మనుషులు కలుషితం చేయకుంటే వాతావరణంలో కాలుష్యం అనేది ఉండదని - వేల కోట్లు ఖర్చు పెట్టి గంగానదిని శుభ్రం చేసే పని ఉండదని చాటిచెప్పింది.కాలుష్యం వలన పశుపక్ష్యాదులు - జలచరాలు - జంతువులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో తెలిసేలా చేసింది. సామాన్యుడైనా...సెలబ్రిటీ అయినా...మన పని మనం చేసుకోవడంలోనే ఆనందం ఉందని...అలా చేస్తే శారీరక వ్యాయామం వల్ల ఆరోగ్యంగా ఉంటామని....జిమ్ లకు వెళ్లాల్సిన పనిలేదని తెలియజేసింది. కుటుంబ సభ్యుల మధ్య సంభాషణ, బంధాలు ఎంత అవసరమో తెలియజెప్పింది. డాక్టర్లు డెమీగాడ్ లని...ప్రాణం ఇచ్చిన దేవుడి తర్వాత ప్రాణం పోసే దేవుడు డాక్టర్ అని తెలిసొచ్చేలా చేసింది. నిర్లక్షంగా ఉంటే డాక్టర్లయినా మూల్యం చెల్లించుకోక తప్పదని తెలియజేసింది. డాక్టర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మన ప్రాణాలే పోతాయని తెలియజేసింది. ఇలా కరోనా అనేక కఠినమైన జీవిత సత్యాలు - పాఠాలు నేర్పింది. అయితే, నాణేనికి రెండో వైపు...కరోనా మహమ్మారి అనేక చేదు నిజాలను బయటపెట్టింది.

మన దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉంది....వలస కూలీల అసలు సిసలు బతుకులేమిటన్నది కరోనా వల్ల వెలుగులోకి వచ్చింది. రెక్కాడితే గానీ డొక్కాడని బ్రతుకులు.....విపత్తుల సమయంలో కకావికలమవుతాయని కరోనా చెప్పింది. మన దేశంలో వైద్య వ్యవస్థ ఏ స్థాయిలో ఉంది...వైద్యంపై మనమెంత ఖర్చు పెడుతున్నామన్నది తెలియజెప్పింది. మన ఆర్థిక రంగం ఎంత బలహీనంగా ఉందో...తెలిసేలా చేసింది. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా....మన దేశంలోని లక్షలాది ఉద్యోగాలు గాల్లో దీపాలేనని తెలియజెప్పింది. దాదాపుగా అన్ని రంగాలపై ప్రభావం చూపిన కరోనా...దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. తీవ్రమైన ఆర్థిక మాంద్యం వస్తే....మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు తట్టుకుంటుందో తెలిసేలా చేసింది. ఇటువంటి విపత్తుల సమయంలో చాలామంది ఆర్థికంగా...తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని...ఆకలి చావులు కూడా సంభవిస్తాయని తెలిసేలా చేసింది. తాత్కాలికంగా ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకోవడం ఎలాగో నేర్పింది. దీర్ఘకాలికంగా రాబోతోన్న ఇబ్బందుల గురించి హెచ్చరించింది.

కరోనా వల్ల పలు రంగాల్లో లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడబోతున్నారు. ఒక రంగానికి ...మరొక రంగానికి ఉన్న లింకుల వల్ల...దాదాపు అన్ని రంగాల్లో ఆర్థిక మాంద్యం ఖాయమని....అటువంటి వారి భవిష్యత్తు ఏమిటన్నది ప్రశ్నార్థకం చేసింది. చివరగా...మనిషి బ్రతుకు తామరాకు మీద నీటి బిందువు వంటిదని...గాలిలో బుడగ వంటిదని తెలిసేలా చేసింది కరోనా. ఉన్నంత కాలం సంతోషంగా ఉండాలని....ఉన్నంతలో నలుగురికి సాయం చేయాలని.... పోయేటప్పుడు ఏమీ తీసుకుపోమని కళ్లముందు సాక్ష్యాలతో సహా తెలిసేలా చేసింది. అందుకే, కరోనా - లాక్ డౌన్ నేర్పిన జీవిత సత్యాలు...నెవ్వర్ బిఫోర్...ఎవ్వర్ ఆఫ్టర్
   

Tags:    

Similar News