తెలుగువారి ఐక్య‌త వ‌ర్ధిల్లాలి.. వైజాగ్ లో కేటీఆర్ చిత్ర‌ప‌టానికి క్షీరాభిషేకం!

Update: 2021-03-11 07:30 GMT
విశాఖ ఉక్కు ఖ‌చ్చితంగా ఆంధ్రుల హ‌క్కు అని కేటీఆర్ నిన‌దించడం ప‌ట్ల ఏపీ వాసులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఏం చేసినా.. వైజాగ్ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ ఆపేది లేద‌ని, ఒక‌వేళ అది కుద‌ర‌కపోతే మూసేస్తామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో.. ఏపీలో కార్మికులు, ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఈ సంద‌ర్భంగా వారికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ మ‌ద్ద‌తు తెలిపారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ ప్రైవేటీక‌ర‌ణ‌‌ను వ్య‌తిరేకిస్తున్నామ‌ని, కార్మికులు చేస్తున్న ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నామ‌ని కేటీఆర్ అన్నారు. అవ‌స‌ర‌మైతే.. విశాఖ వెళ్లి ప్ర‌త్య‌క్షంగా ఉద్య‌మంలో పాల్గొని, మ‌ద్ద‌తు తెలుపుతామ‌న్నారు కేటీఆర్‌.

''తెలంగాణ రాష్ట్రం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్ట‌రీ పెడ‌తామ‌న్నారు. కానీ.. ఇప్పుడు విశాఖ‌లో పోరాడి సాధించుకున్న ఉక్కు క‌ర్మాగారాన్ని అమ్మేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కేంద్రం నిర్ణ‌యం వ‌ల్ల కార్మికులు, ఉద్యోగులు రోడ్డెక్కి ఉద్య‌మిస్తున్నారు. వారికి మేం అండ‌గా ఉంటాం. అవ‌స‌ర‌మైతే కేసీఆర్ అనుమ‌తితో వైజాగ్ వెళ్లి ప్ర‌త్య‌క్షంగా వారి పోరాటానికి మ‌ద్ద‌తు తెలియ‌జేస్తాం. ఎక్క‌డో విశాఖ‌లో జ‌రిగే ఉద్య‌మంతో మ‌నకెందుకులే అనుకుంటే.. రేపు మ‌న ద‌గ్గ‌ర‌కు కూడా వ‌స్తారు. ఇవాళ విశాఖ ఉక్కు అమ్ముతున్నారు. రేపు బీహెచ్ఈఎల్ అమ్ముతారు. ఎల్లుండి సింగ‌రేణి అమ్ముతారు. ఆ త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎందుకు..? వీటిని కూడా ప్రైవేటు ప‌రం చేయండి అంటారు.'' అని వ్యాఖ్యానించారు కేటీఆర్.

కేటీఆర్ స్పంద‌న ప‌ట్ల‌.. ఏపీలోని ప్ర‌జ‌లు, కార్మికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు కేటీఆర్ చిత్ర‌ప‌టానికి క్షీరాభిషేకం చేశారు. కార్మిక ఉద్య‌మానికి తెలంగాణ మంత్రి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఈ సంద‌ర్భంగా తెలుగు వారి ఐక్య‌త వ‌ర్థిల్లాల‌ని నినాదాలు చేశారు. క‌లిసి పోరాటం చేస్తామ‌ని, విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకుంటామ‌ని నిన‌దించారు.
Tags:    

Similar News