బీజేపీ ఎంపీ చ‌ర్య‌తో లోక్ స‌భ గంద‌ర‌గోళం

Update: 2017-12-18 07:28 GMT
రెండు రాష్ట్రాల్లో వెలువడుతున్న ఎన్నిక‌ల ఫ‌లితాలు లోక్ స‌భ‌లో కొత్త ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. ఒక బీజేపీ ఎంపీ స్వామిభ‌క్తి విప‌క్ష పార్టీల‌కు మంట పుట్టేలా చేశాయి. ఊహించ‌ని రీతిలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్ని మ‌ధ్యాహ్నానానికి వాయిదా వేసేలా చేశాయి. ఇంత‌కీ జ‌రిగిందేమంటే..

సోమ‌వారం ఉద‌యం ఎనిమిదిగంట‌ల నుంచే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌.. గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కార్య‌క్ర‌మం మొద‌లైంది.  గంటసేప‌టికి ట్రెండ్ బ‌య‌ట‌కు రాగా.. కాసేప‌టికే తుది ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న విష‌యంపై ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది.

ఇదిలా ఉంటే.. రెండు రాష్ట్రాల్లో త‌మ పార్టీ సాధించిన విజ‌యం నేప‌థ్యంలో మోడీ మ‌న‌సు దోచుకునేందుకు బీజేపీ ఎంపీ ఒక‌రు అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించారు. స‌మావేశాల్లో భాగంగా బీజేపీ ఎంపీ కిరిట్ సోమ‌యా ఒక ప్ర‌శ్న‌ను అడ‌గాల్సి ఉంది. ట్రెజ‌రీ విభాగానికి సంబందించిన ప్ర‌శ్న‌ను సంధించేందుకు బ‌దులుగా.. కాంగ్రెస్ పార్టీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో అధికారాన్ని కోల్పోయింద‌ని.. గుజ‌రాత్ లో బీజేపీ మ‌రోసారి విజ‌యాన్ని సొంతం చేసుకుంద‌ని.. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీకి ధ‌న్య‌వాదాలు చెప్పాల‌నుకుంటున్న‌ట్లుగా వ్యాఖ్యానించారు.

బీజేపీ ఎంపీ మాట‌లు విప‌క్ష నేత‌ల‌కు మంట పుట్టించాయి. ఆయ‌న తీరును త‌ప్పు ప‌ట్ట‌టంతో పాటు.. విప‌క్ష స‌భ్యులు త‌మ స్థానాల్లోని బెంచ్ ల‌పై నిలుచొని బీజేపీ వ్య‌తిరేక నినాదాలు చేయ‌టం మొద‌లు పెట్టారు. దీంతో.. ఏం జ‌రుగుతుందో అర్థం కాని గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. స‌భ్యుల్ని స‌ముదాయించేందుకు లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ప్ర‌య‌త్నించినా స‌భ అదుపులోకి రాలేదు. దీంతో.. స‌భ‌ను మ‌ధ్యాహ్నం వ‌ర‌కు వాయిదా వేశారు. మొత్తానికి విప‌క్ష నేత‌ల‌కు కాలేలా చేయ‌టంలో మాత్రం బీజేపీ ఎంపీ స‌క్సెస్ అయ్యారు.
Tags:    

Similar News