జ‌గ‌న్ ఎంపీల రాజీనామాస్త్రంపై మోడీ నీతి!

Update: 2018-05-30 05:15 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ మొద‌ట్నించి ఒకే డిమాండ్ తో కేంద్రంపై పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే ఎన్నో ఆందోళ‌న‌లు.. మ‌రెన్నో నిర‌స‌న‌ల్ని చేప‌ట్టింది. అంతేనా.. డేట్ చెప్పి మ‌రీ.. హోదాపై కేంద్రం తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశారు. సాధార‌ణంగా ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ రాజీనామాలు స‌మ‌ర్పించిన వెంట‌నే స్పీక‌ర్లు.. ఆమోదించ‌టం ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో మాత్రం ఆ ప‌ని చేయ‌కుండా.. త‌మ‌కున్న విచ‌క్ష‌ణాధికారంతో ప‌క్క‌న పెట్టేస్తుంటారు.

ఏపీ అధికార‌ప‌క్షం దుర్మార్గంగా విప‌క్ష ఎమ్మెల్యేల్ని త‌న పార్టీలో చేర్చుకోవ‌ట‌మే కాదు.. కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు అప్ప‌జెప్ప‌టం తెలిసిందే. దీనిపై చేసిన ఫిర్యాదుపై నిర్ణ‌యం తీసుకోవాల్సిన స్పీక‌ర్.. త‌న‌కున్న విచ‌క్ష‌ణాధికారంతో ఇప్ప‌టివ‌ర‌కూ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ది లేదు. అదే తీరును తాజాగా పార్ల‌మెంటు స్పీక‌ర్ కూడా ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ఈ మ‌ధ్య‌న ముగిసిన పార్ల‌మెంటు స‌మావేశాల స‌మ‌యంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్పీక‌ర్ ఫార్మాట్‌ లో రాజీనామాలు చేశారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని నేప‌థ్యంలో.. కేంద్రం మాట త‌ప్ప‌టాన్ని త‌ప్పు ప‌డుతూ త‌మ నిర‌స‌న‌ను తెలియ‌జేసేందుకు.. ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు తెలిపేందుకు వీలుగా ఎంపీలు రాజీనామాలు చేశారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఉప ఎన్నిక‌లు జ‌రిగితే.. తుది ఫ‌లితం మ‌రింత ఒత్తిడి కేంద్రంపై ప‌డే అవ‌కాశం ఉండ‌టంతో  ఎంపీల రాజీనామాల‌పై నిర్ణ‌యాన్ని ప‌క్క‌న పెట్టారు.

గ‌తంలో రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల‌ను తాజాగా పిలిచిన స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌..వారితో చ‌ర్చ‌లు జ‌రిపారు. రాజీనామాపై త‌న నిర్ణ‌యాన్ని జూన్ మొద‌టి వారానికి వాయిదా వేశారు. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో చూస్తే.. ఎంపీల రాజీనామాల్ని జూన్ 5 త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటార‌ని చెబుతున్నారు. ఎందుకిలా అంటే.. ఉప ఎన్నిక‌ల్ని త‌ప్పించేందుకేన‌ని చెబుతున్నారు.

నిబంధ‌న‌ల ప్ర‌కారం చ‌ట్ట స‌భల గ‌డువు ముగిసేందుకు ఏడాది కంటే త‌క్కువ స‌మ‌యం ఉన్న‌ప్పుడు ప్ర‌జాప్ర‌తినిధులు రాజీనామాలు చేస్తే.. ఆ స్థానాల్ని ఖాళీలుగా చూపిస్తారే కానీ.. ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించ‌రు. ఈ నేప‌థ్యంలో జూన్ 5 త‌ర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాల‌పై నిర్ణ‌యం తీసుకొని.. వాటిని ఆమోదించిన‌ట్లుగా ప్ర‌క‌టిస్తే మోడీ స‌ర్కారుకు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని చెప్పాలి. ఎందుకంటే..ఎంపీల రాజీనామాల‌తో ఉప ఎన్నిక‌లకు అవ‌కాశం ఉండ‌దు. ఎందుకంటే జూన్ 4 నాటికి మోడీ స‌ర్కారు చేతికి అధికార ప‌గ్గాలు వ‌చ్చి నాలుగేళ్లు పూర్తి అవుతాయి. ఆ త‌ర్వాత ఎప్పుడు ఎంపీల రాజీనామాల్ని స్పీక‌ర్ ఆమోదించినా.. ఆయా స్థానాల్ని ఖాళీలుగా చూపిస్తారేకానీ. భ‌ర్తీ చేయ‌రు. దీంతో.. ఉప ఎన్నిక‌ల‌కు అవ‌కాశం ఉండ‌దు. ఉప ఎన్నిక‌లు జ‌రిగి.. త‌మ ఆకాంక్ష‌ను ఏపీ ప్ర‌జ‌లు వెళ్ల‌గ‌క్కితే.. మోడీ స‌ర్కారుకు ఇబ్బందిక‌రంగా మారుతుంది. ఈ ఇబ్బందిని అధిగ‌మించ‌టం కోసమే జ‌గ‌న్ పార్టీ ఎంపీల రాజీనామాల ఆమోదానికి కావాల‌నే తాత్సారం చేస్తున్నార‌న్న ఆరోప‌ణ బ‌లంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News