లోకేష్‌ పాదయాత్ర ఫిక్స్‌.. అప్పటి నుంచే ప్రారంభం!

Update: 2022-11-11 10:03 GMT
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం అన్ని పార్టీలకు జీవనర్మణ సమస్యగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఈ అవసరం చాలా ఉంది. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ.. టీడీపీ నేతలను మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. అధికారంలోకి వచ్చిందే తడవుగా టీడీపీ ముఖ్య నేతలను వరుస పెట్టి అరెస్టు చేసింది.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి టీడీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇప్పటికే జిల్లాలవారీగా నిర్వహించిన మినీ మహానాడు, బాదుడే బాదుడు కార్యక్రమాలు విజయవంతమై మంచి జోష్‌ను ఆ పార్టీలో నింపాయి. మరోవైపు జనసేనతో పొత్తు కుదిరే అవకాశం కూడా కనిపిస్తోంది.

దీంతో జనసేన, టీడీపీల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. ఈ జోష్‌ను మరింత రెట్టింపు చేయడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఇప్పటికే నారా లోకేష్‌ పాదయాత్రను ప్రారంభించాల్సి ఉంది.

ఇది అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు పాదయాత్రను ప్రారంభించాలని నారా లోకేష్‌ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తాజాగా ప్రకటన కూడా జారీ చేశారు. జనవరి 27 నుంచి నారా లోకేష్‌ పాదయాత్ర మొదలు కానుంది. చిత్తూరు జిల్లాలోని తన తండ్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాఫురం వరకు నారా లోకేష్‌ పాదయాత్ర సాగుతుంది.

2023 జనవరి 27 నుంచి లోకేష్‌ పాదయాత్ర ప్రారంభం కానుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగే పాదయాత్రకు సంబంధించి రోడ్‌ మ్యాప్‌ను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

మొత్తం ఏడాదిపాటు పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండేలా నారా లోకేష్‌ ప్రణాళికలు రచిస్తున్నారు. తన పాదయాత్రలో భాగంగా మార్గంమధ్యలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. అలాగే పలు సభల్లోనూ ఆయన ప్రసంగించే అవకాశముందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

లోకేశ్‌ పాదయాత్ర చేపడతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇన్నాళ్లూ స్పష్టత రాలేదు. తాజాగా ఆయనే ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

కాగా గత ఎన్నికల ముందు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్, 2004 ఎన్నికల ముందు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, 2014 ఎన్నికల చంద్రబాబు పాదయాత్రలు చేసిన సంగతి తెలిసిందే. పాదయాత్రలు చేసినవారందరినీ అధికారం వరించడంతో నారా లోకేష్‌ సైతం పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News