బెజవాడలో చినబాబుకూ ఓ గెస్ట్ హౌస్

Update: 2015-09-26 04:51 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఫ్యామిలీకి సంబంధించి ఇళ్ల యవ్వారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. నిన్నమొన్నటివరకూ ఏపీ ముఖ్యమంత్రికి అనువుగా ఉండే ఇంటి కోసం వెతికి.. వెతికి.. చివరకు లింగమనేని గెస్ట్ హౌస్ ను ఆయన అధికారిక నివాసంగా మార్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఉండేందుకు సరిపడా ఇంటిని వెతకటం.. దానికి చంద్రబాబు అవసరాలకు తగినట్లుగా మార్పులు చేర్పులు చేయటంతో సరిపోతే.. ఇప్పుడు ఆయన కుమారుడు లోకేశ్ అవసరాలకు తగిన ఇంటి కోసం అన్వేషణ సాగుతోంది.

నిజానికి లింగమనేని గెస్ట్ హౌస్ లో తండ్రితో పాటు కలిసి ఉండేందుకు సరిపడా వసతి ఉన్నప్పటికీ.. చినబాబును కలిసేందుకు వస్తున్న గెస్ట్ లకు ముఖ్యమంత్రికి కల్పించే భద్రత పెద్ద ఇబ్బందిగా మారిందట. దీంతో.. తాను వేరే ఇంట్లో మంచిదన్న భావనలో వచ్చినట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఆయన ఉండేందుకు వీలుగా ఒక గెస్ట్ హౌస్ వెతికే పనిలో ఏపీ అధికారులు నిమగ్నమయ్యారు.

తండ్రి ఇంటికి దగ్గర్లోనే తన ఇల్లు ఉండాలని చెప్పటంతో అందుకు తగ్గట్లుగా ఇంటిని వెతికిన అధికారులు ఒక ఇంటిని తాజాగా కన్ఫర్మ్ చేసినట్లుగా చెబుతున్నారు. లింగమనేని గెస్ట్ హౌస్ కి కూతవేటు దూరంలోని చినబాబు గెస్ట్ హౌస్ ఉంటుందని.. కాకుంటే.. బాబు ఇంటికి.. చినబాబు ఇంటికి వెళ్లే రోడ్లు వేర్వేరుగా ఉంటాయని చెబుతున్నారు. ఈ కారణంగా సమస్యల కోసం కానీ.. మరే ఇతర అంశాల కోసం కాని చినబాబుతో భేటీ అయ్యేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. తాజాగా అధికారులు ఎంపిక చేసిన ఇంటిని లోకేశ్ పరిశీలించి.. సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. తన అవసరాలకు తగినట్లుగా కొన్ని మార్పులు లోకేశ్ సూచించారని.. వాటిని పూర్తి చేశాక.. చినబాబు ఈ ఇంట్లోకి చేరతారని చెబుతున్నారు.
Tags:    

Similar News