వివేకా హత్యకేసు: శివశంకర్ రెడ్డి అరెస్టుపై లోకేశ్ ట్వీట్ చూశారా?

Update: 2021-11-18 07:36 GMT
గతానికి భిన్నంగా ఈ మధ్య కాలంలో ఆవేశపూరిత వ్యాఖ్యలు.. ట్వీట్లు చేస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకోవటంతో పాటు.. ఒకరి తర్వాత ఒకరు చొప్పున అరెస్టు అవుతున్న వైనం హాట్ టాపిక్ గా మారుతోంది.

అన్నింటికి మించి వివేకాకు ఒకప్పుడు డ్రైవర్ గా వ్యవహరించిన దస్తగిరి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం బయటకురావటం.. అందులో పేర్కొన్న పేర్లు రాజకీయ రగడకు తెర తీసింది.

కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి వైఎస్ వివేకా హత్యలో హస్తం ఉందన్న రీతిలో చెప్పిన దస్తగిరి వాంగ్మూలంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే వైఎస్ అవినాష్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. ఇలాంటివేళ లోకేశ్ చేసిన ట్వీట్ ఒకింత ఘాటుగా మాత్రమే కాదు సంచలనంగా మారింది.

‘వైఎస్ జగన్ రెడ్డి బంధువు.. కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి అన్నీ తానై వ్యవహరించే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకోవటంతో మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి. దస్తగిరి వాంగ్మూలం ప్రకారంగొడ్డలిపోటు సూత్రధారి వైఎస్ అవినాశ్ రెడ్డి’’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

మరో ట్వీట్ లో ‘అవినాశ్ రెడ్డిని ఈ కేసు నుంచి తప్పించేందుకు సిట్ బ్రందాన్ని మార్చేసింది. సీబీఐ విచారణ వద్దన్నది వైఎస్ జగన్. మీ బ్లూ మీడియాలో ఈ వైఎస్సాసుర రక్తచరిత్ర గురించి ఎప్పుడు రాయిస్తారో?’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. మరి.. దీనికి వైసీపీ నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.
Tags:    

Similar News