రెండు కళ్ల వ్యూహంలో లోకేశ్..?

Update: 2015-09-17 09:46 GMT
రాష్ట్ర విభజన సమయంలో ఎవరు ఏం చెప్పినా పెద్దగా చర్చకు రాలేదు కానీ..  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్పిన రెండు కళ్ల సిద్ధాంతం పెద్ద చర్చే నడిచేటట్లు చేసింది. విభజన విషయంలో తన వైఖరిని చంద్రబాబు సూటిగా చెప్పేసినా.. ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రం రెండుకళ్ల సిద్దాంతాన్ని కామెడీ కామెడీగా మార్చేసి.. అదో బ్రహ్మ పదార్థంగా మార్చేశారు.

రెండు ప్రాంతాల్లోనూ తన పార్టీ ఉండాలని.. ఆ మాటకు వస్తే రెండు ప్రాంతాల్లోనూ అధికార చక్రాన్ని తిప్పాలన్నది చంద్రబాబు కోరిక. అందుకే.. విభజన విషయంలో తాను ప్రాతినిధ్యం వహించే ఏపీకి అన్యాయం జరుగుతున్నా.. ఆయన తెలంగాణ మీదున్న మమకారంతో రెండు కళ్ల సిద్ధాంతాన్ని జపించే ప్రయత్నం చేశారు.

రాష్ట్ర విభజన పూర్తి కావటమే కాదు.. వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పడి పదిహేను నెలలు కావొస్తున్న పరిస్థితి. ఈ సమయంలో తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలతో.. హైదరాబాద్ నుంచి కదిలేందుకు ఏ మాత్రం ఇష్టపడని చంద్రబాబు.. ఓటుకు నోటు.. ఫోన్ ట్యాపింగ్ ఉదంతంతో బెజవాడకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి విజయవాడలోనే ఉంటున్న చంద్రబాబు.. చుట్టం చూపుగా కూడా హైదరాబాద్ కు రావటానికి పెద్ద ఇష్టపడడం లేదు. తొలు వారానికి ఐదు రోజులు ఏపీలో ఉంటానని చెప్పినప్పటికీ.. తన రాజ్యంలో రాజుగా ఉండే సౌలభ్యాన్ని.. సుఖాన్ని అనుభవించిన బాబుకు.. హైదరాబాద్ వెళ్లే విషయంలో ఏ మాత్రం ఇష్టపడటం లేదన్న మాట వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. బాబు తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందన్న మాట వినిపిస్తున్న లోకేశ్.. తాజాగా తన తండ్రి మాదిరే రెండు కళ్ల సిద్దాంతాన్ని ప్రస్తావించటం గమనార్హం.

ఇకపై వారంలో మూడు రోజులు ఏపీలో.. మరోమూడు రోజులు తెలంగాణలో ఉంటానని.. పార్టీ వ్యవహారాల్ని దగ్గరుండి చూసుకుంటానని పార్టీ నేతలకు భరోసా ఇస్తున్నారు. ఇందుకు తగ్గట్లే.. వారంలో ఏయే రోజులు ఎక్కడ ఉంటానో కూడా చెబుతున్నారు.  ప్రతి వారంలో మంగళ.. బుధ.. గురువారాల్లో విజయవాడలో ఉంటే లోకేశ్.. శుక్ర.. శని.. సోమవారాల్లో హైదరాబాద్ లో ఉంటానని చెప్పుకొచ్చారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు కళ్ల సిద్ధాంతం కన్నా.. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఉండే ఏర్పాటు అయితే మంచిదన్న భావన వ్యక్తమవుతోంది. అయితే.. రోజుల్ని కుదించటం ద్వారా.. పార్టీ క్యాడర్ కు వెసులుబాటు ఉన్నా.. ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకపక్క అధికారంలో ఉన్న ఏపీలో చక్కబెట్టాల్సిన పనుల్ని మూడు రోజులకే కుదించే కన్నా.. మరింత ఫోకస్ పెడితే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. తండ్రి తగ్గ తనయుడిగా రెండు కళ్ల సిద్ధాంతాన్ని కాల్షీట్ల విషయంలో సర్దుబాటు చేయటం లోకేశ్ కే చెల్లిందనుకోవాలి.
Tags:    

Similar News