సంప‌న్నులు ముంచేసిన బ్యాంకుల మొత్తం.. 2.4 ల‌క్ష‌ల కోట్లు..!

Update: 2022-07-25 04:25 GMT
కౌలు రైతు ప‌ది వేలు అప్పు ఉన్నాడంటే.. వెంట బ‌డి మ‌రీ వ‌సూలు చేసే బ్యాంకులకు.. మ‌న దేశంలోని సంప‌న్నులు.. ఏకంగా 2.4 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు కుచ్చు టోపీ పెట్టారు. ఇదేమంత త‌క్కువ విష‌యం కాదు.. దాదాపు 87 దేశాల జీడీపీ కంటే ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ఈ ఎగ‌వేత‌దారుల్లో దేశాన్ని ముంచేసిన లిక్క‌ర్ డాన్  విజ‌య్ మాల్యా,  వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోడీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి వీరే కాకుండా .. 225 మంది సంప‌న్నులు.. దేశంలోని బ్యాంకుల‌ను ప‌క్కాకు నొక్కేశారు. ఈ వివ‌రాల‌ను ఆంగ్ల దిన‌ప‌త్రిక ప్ర‌ముఖంగా ప్ర‌చురించడంతో వివ‌రాలు వెలుగు చూశాయి.

ఎగ్గొట్టిన మొత్తాలు.. ఇలా..

+ వెయ్యి కోట్ల రూపాయ‌ల పైబ‌డిన మొత్తాల‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా ఎగ్గొట్టిన వారు 36 మంది.
+ మూడు వేల కోట్ల రూపాయ‌లుపైన ఎగ్గొట్టిన వారు ముగ్గురు.
+ 2000 కోట్ల రూపాయ‌ల నుంచి 3000 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఎగ్గొట్టిన వారి సంఖ్య ఆరు.
+ 1000 నుంచి 2000 కోట్లు ఎగ్గొట్టిన వారి సంఖ్య 27
+ 500 నుంచి 1000 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ చెల్లించ‌ని వారు 37
+ 400 నుంచి 500 కోట్ల రూపాయ‌లు చెల్లించ‌ని వారు 28 మంది
+ ప‌దేళ్ల క్రితం ఉద్దేశపూర్వ‌క ఎగ‌వేత‌దారుల మొత్తం బాకీ 23 వేల కోట్లు
+ 2018 నాటికి అది ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌కు చేర‌గా.. 2020 నాటికి రెండు ల‌క్షల కోట్ల రూపాయ‌ల‌కు పెరిగింది.  

ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కే.. పంగ‌నామం!

ఈ సంప‌న్న ఎగ‌వేత‌దారులు అంద‌రూ మోసం చేసింది.. ప్ర‌భుత్వ రంగ బ్యాంకులే కావ‌టం విశేషం. వీటిలో ప్రైవేట్ బ్యాంకుల వాటా నామ‌మాత్రంగానే ఉంది. ఎస్ బీఐ, దాని అనుబంధ బ్యాంకుల వాటానే 71,896 కోట్ల రూపాయ‌లు కాగా..ఈ వాటా 30.4 శాతంగా ఉంది.

ఆ త‌ర్వాత స్థానంలో పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు 39,455 కోట్ల రూపాయ‌లు, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 29860 కోట్ల రూపాయ‌లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 25,440 కోట్ల రూపాయ‌లు, ఐడిబిఐ బ్యాంకు లిమిటెడ్ 21,751 కోట్ల రూపాయ‌లుగా ఉన్నాయి.

+ మ‌హారాష్ట్ర అత్య‌ధిక మంది ఎగ‌వేత‌దారులు ఉన్న రాష్ట్రంగా నిలిచింది.
+ ఆ త‌ర్వాత స్థానంలో ఢిల్లీ ఉంటే..మూడ‌వ స్థానంలో ప‌శ్చిమ బెంగాల్, నాల్గ‌వ స్థానంలో గుజ‌రాత్, ఐద‌వ స్థానంలో తెలంగాణ‌, ఆర‌వ స్థానంలో త‌మిళ‌నాడు ఉండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News