ప్రేమ‌-పెళ్లి.. మ‌ధ్య‌లో హ‌త్య దారుణాల‌కు ప‌రాకాష్ఠ‌!

Update: 2022-12-08 01:56 GMT
ఆమె న‌మ్మింది.. కాదు కాదు.. అత‌నే న‌మ్మించాడు. ప్రేమ‌న్నాడు. వెంట‌ప‌డ్డాడు. పెళ్ల‌న్నాడు న‌మ్మి వెంట వ‌చ్చింది. కానీ, ఏమైందో ఏమో.. న‌రికి చంపేశాడు. అంతేకాదు.. ఆమె శ‌వాన్ని కాల్చి బూడిద చేశాడు. పిస‌రంత ఎముక ముక్క కూడా మిగ‌ల‌కుండా మ‌సి చేశాడు. అనంత‌రం.. ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఈ బూడిద‌ను కూడా పూడ్చి పెట్టాడు. కానీ, ఇన్ని చేసినా.. చ‌ట్టం ముందు దొరికిపోయాడు. చేసిన నేరాన్ని అంగీక‌రించాడు. దారుణాల‌కే దారుణంగా మారిన ఈ ఘ‌ట‌న పంజాబ్‌లో జ‌రిగింది.

ఏం జ‌రిగిందంటే.. పంజాబ్లోని లుధియానా జిల్లాకు చెందిన జస్విందర్ కౌర్, పరంప్రీత్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అందుకే కొద్దిరోజుల క్రితం ఇంట్లో నుంచి కొంత డబ్బు, బంగారం తీసుకుని ఆమె పరంప్రీత్తో పారిపోయింది.

అయితే పరంప్రీత్, అతడి నలుగురు స్నేహితులు కలిసి ఆ యువతిపై ప‌దే ప‌దే అత్యాచారం చేశారు. అనంత‌రం దారుణంగా ఆమెను గొడ్డలితో నరికి హత్య చేశారు. తరువాత దగ్గర్లోని ఆ కాలువలో శవాన్ని పడేశారు. అయితే.. శ‌వాన్ని ఎవ‌రైనా గుర్తు ప‌ట్టే అవ‌కాశం ఉంటుంద‌ని భావించిన క‌ప‌ట ప్రేమికుడు మళ్లీ ఆమె మృతదేహాన్ని బయటకు తీసి కాల్చి ఓ నిర్జ‌న స్థలంతో పాతిపెట్టాడు.

ఎలా బ‌య‌ట‌ప‌డిందంటే.. జ‌స్వింద‌ర్ త‌మ్ముడు త‌న అక్క‌ కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎలాగూ ప్రేమ వ్య‌వ‌హారం తెలిసిందే కాబ‌ట్టి.. క‌ప‌ట ప్రేమికుడు పరంప్రీత్ స‌హా అతడి నలుగురు స్నేహితులను అరెస్ట్ చేశారు. అనంతరం విచారణ సమయంలో అసలు విషయం బయటపడింది. వెంటనే పోలీసులు.. జేసీబీ సాయంతో ఆ స్థలాన్ని తవ్వించి యువతి బూడిద‌ను గుర్తించి.. ఫోరెన్సిక్ ప‌రీక్ష‌ల‌కు పంపించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News