ఏడాదికి 10లక్షల సంపాదనా?గ్యాస్ సబ్సిడీకట్?

Update: 2015-11-15 05:00 GMT
ఈ దేశంలో చాలా చిత్రమైన పరిస్థితి ఉంటుంది. నికార్సుగా తన ఆదాయాన్ని వెల్లడిస్తూ.. పద్ధతిగా పన్ను చెల్లించే వాడి మీద పన్నుల మీద పన్నులు విధిస్తుండటం కామన్. మిగిలిన పన్నుల సంగతి పక్కన పెడితే.. ఆదాయపన్ను విషయంలో భారీ బాదుడు తప్పదు. ఎంత ఎక్కువ సంపాదిస్తుంటే అంత ఎక్కువగా ఆదాయపన్ను కట్టాల్సిన కారణంగా పలువురు తమ ఆదాయాన్ని నిజాయితీగా బయటకు వెల్లడించకుండా ఉంటారు. ఈ కారణంగానే బ్లాక్ మనీ మరింత పెరిగేందుకు దోహదమవుతోంది.

ఇక.. డబ్బులున్నోళ్లు త్యాగాలకు సిద్ధం కావాలన్నట్లుగా ప్రభుత్వాల మైండ్ సెట్ ఉంటుంది. దానికి తాజా నిదర్శనంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి మాటలు చూడొచ్చు. ఏడాదికి రూ.10లక్షల ఆదాయం ఉన్న వారికి అందించే గ్యాస్ సబ్సిడీని కట్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పుకొచ్చారు. సంపన్నులు అయితే.. ఎలాంటి సౌకర్యాలు అక్కర్లేదన్నట్లుగా వ్యవహరించటంపై పలువులు అసంతృఫ్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఆదాయపన్ను చెల్లింపు విషయంలో.. మిగిలిన వర్గాలతో పోలిస్తే ఉద్యోగులు తమకొచ్చిన ఆదాయాన్ని పక్కాగా చూపించి.. పన్ను కట్టేస్తుంటారు. ఆదాయపన్ను రూపంలోనే భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

మరి.. ఇంత ఆదాయాన్ని సంపాదిస్తున్న వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏదైనా వసతి కల్పిస్తుందా? అంటే అదీ ఉండదు. గుంటలు పడిన రోడ్ల మీద ప్రయాణం.. స్వచ్ఛంగా లేని గాలిని పీల్చాలి? శుద్ధమైన తాగు నీరు కూడా రాని దుస్థితి. తనవరకూ ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం లభించినప్పటికీ.. బాధ్యతగా మాత్రం తన ఆదాయపన్నును కట్టాలన్న భావనపై ఇప్పటికే దేశంలోని చాలా వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నయి.

నిజానికి వారు ఆదాయపన్ను చెల్లించటానికి వెనుకాడరు. కాకుంటే.. అందరికి ఒకే రూల్ ఉండాలన్నది వారి కోరిక. తాము కష్టపడిన సొమ్ము పన్నురూపంలోప్రభుత్వ ఖజానాకు వెళుతున్నప్పటికీ దాని వినియోగంలో చోటు చేసుకుంటున్న అవినీతి మీద ఇప్పటివరకూ స్పందించింది లేదు.

ఇక.. సంపన్నులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఏమైనా ఉన్నాయా? అంటే అది గ్యాస్ సిలిండర్ మీద ఇచ్చే సబ్సిడీ మాత్రమే. తాజాగా.. దానికి కూడా కోత పెడుతూ నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్న విషయాన్ని కేంద్రమంత్రి వెంకయ్య చెబుతున్న సంగతి తెలిసిందే. ఏడాదికి రూ.10లక్షలు ఆదాయం ఉన్న వారికి గ్యాస్ మీద ఇచ్చే సబ్సిడీని కట్ చేయాలని ఆలోచిస్తున్న ప్రభుత్వం.. ప్రపంచంలో ఎక్కడా దొరకనంత చౌకధరలకు పార్లమెంటులో ఆహార పదార్థాలు అందించాల్సిన అవసరం ఉందా? ఈ రోజు పార్లమెంటులో ఎంపీలుగా పని చేస్తున్న నేతలకు జీతాల రూపంలో ఎంత పెద్ద మొత్తం అందుతుందో తెలిసిందే. ఏడాదికి రూ.10లక్షలు ఆదాయం ఉంటే.. వారికిచ్చే గ్యాస్ సబ్సిడీని కట్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు.. పార్లమెంటు క్యాంటీన్ లో లక్షలాది రూపాయిల జీతభత్యాల తీసుకునే ఎంపీలకు సబ్సిడీ మీద ఆహారపదార్థాల అందించాల్సిన అవసరం ఉందా? ప్రజలకు ఒక న్యాయం? ప్రజాప్రతినిధులకు ఒక న్యాయమా..?
Tags:    

Similar News