అంత ధీమా ఉంటే..ఇన్ని తాయిలాలు ఎందుకో?

Update: 2018-10-19 06:02 GMT
గెలుపు ధీమాను ప్ర‌ద‌ర్శించ‌టం మామూలే. కాకుంటే.. తాము చెప్పే మాట‌లు ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట్ కాకుంటే.. లేని తిప్ప‌లు కొని తెచ్చుకున్న‌ట్లే. అందుకే.. తొంద‌ర‌ప‌డి అతిశ‌యం మాట‌లు అస్స‌లు చెప్ప‌కూడ‌దు. మామూలు రోజుల్లో ఇలాంటి మాట‌లు చెబితే..కాల ప్ర‌వాహంలో అలాంటి మాట‌ల్ని మ‌ర్చిపోతారు.

కానీ.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇదే తీరుతో వ్య‌వ‌హ‌రిస్తే మాత్రం మొద‌టికే మోసం రావ‌టం ఖాయం. తాజాగా తెలంగాణ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి మాట‌లు ఇలానే ఉన్నాయి. రేప‌టి సూర్యోద‌యం ఎంత నిజ‌మో.. టీఆర్ ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌టం అంతే ముఖ్య‌మ‌ని.. అదే వాస్త‌వ‌మ‌ని ఆయ‌న చెబుతున్నారు.

నాలుగేళ్ల క్రితం కేసీఆర్ నాయ‌క‌త్వంలో అధికారంలోకి వ‌చ్చిన స‌ర్కారుతో అభివృద్ధి వేగంగా సాగింద‌న్నారు. నిజాయితీకి నిలువెత్తు రూపంలా టీఆర్ ఎస్ నాయ‌కులు నిలిచార‌న్నారు. తాను ప్రాతినిధ్యం వ‌హించే పార్టీని విప‌రీతంగా పొగిడేసిన మ‌ధుసూద‌నాచారి.. మ‌రోవైపు మ‌హాకూట‌మిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

మ‌హా కూట‌మి ఒక మాయాకూట‌మి అని.. అది మాయ‌మ‌య్యే కూట‌మిగా ఆయ‌న విమ‌ర్శించారు. ఆ కూట‌మికి జెండా కానీ.. అజెండాకానీ లేద‌న్నారు. అవ‌స‌రం కోసం ఏర్ప‌డే పార్టీలతో ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీగా మ‌హా కూట‌మిని విమ‌ర్శించ‌టం త‌ప్పేం కాదు. కానీ.. రేప‌టి సూర్యోద‌యం మాదిరే టీఆర్ ఎస్ విజ‌యం ప‌క్కా అన్న మాట‌ల‌తోనే అభ్యంత‌రమంతా. నిజంగానే.. అంత కాన్ఫిడెన్స్ ఉంటే.. కేసీఆర్ సారూ.. అన్నేసి తాయిలాలు ఎందుకు ప్ర‌క‌టించిన‌ట్లు?

గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల్ని నూటికి నూరుశాతం అమ‌లు చేశామ‌ని గొప్ప‌గా చెప్పుకోవ‌డమే కాదు.. తాము ఇవ్వ‌ని హామీల్ని కూడా ఇచ్చామ‌ని.. అలాంటివి త‌మ‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెప్పుకునే కేసీఆర్‌.. ఎన్నిక‌ల వేళ‌లో మ‌ళ్లీ వేలాది కోట్లకు తాయిలాలు ఎందుకు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు? అధికారం అంత ప‌క్కాగా వ‌చ్చేట‌ట్లైయితే.. ఇన్నేసి తాయిలాలు ప్ర‌క‌టించి.. ఇంత‌లా కిందామీదా ప‌డాల్సిన అవ‌స‌రం ఉందంటారా?
Tags:    

Similar News