కరోనా : మాఫియా డాన్లకు కలిసొచ్చింది..

Update: 2020-05-06 17:30 GMT
ముంబైలో మాఫియా ఉన్నట్టే ఇటలీ దేశంలో కూడా పెద్ద నేరసామ్రాజ్యం, మాఫియా విస్తరించి ఉంది. ఇటలీలో కరోనా కల్లోలం వేళ కోట్ల కొద్దీ ధనార్జనే ధ్యేయంగా ఇటలీ మాఫియాలు ప్రయత్నిస్తున్నాయట.. రంగంలోకి దిగి ఆస్తులను పెద్ద ఎత్తున కొంటున్నాయట.. సాయం పేరిట ప్రజలకు పంచిపెడుతున్నాయట.. వారిని తమకు అనుకూలంగా మలుచుకొని సమాంతర వ్యవస్థను రూపకల్పన చేస్తున్నాయట.. అయితే వీరిలో మరో కోణం బయటపడడం విశేషంగా మారింది.

ఇటలీలో మాఫియా బృందానికి చెందిన ఒక వ్యక్తి సిసిలీ ద్వీపంలోని పాలెర్మో ప్రాంతంలో పేద ప్రజలకు ఆహారం సరఫరా చేస్తున్నారు. కరోనాతో వేల చావులు, లక్షల కేసులు నమోదైన ఇటలీలో ప్రజల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. తిండికి, బట్టకు పొట్టకు ప్రజలు అర్రులు చాస్తున్నారు. ఈ నేపథ్యంలో మాఫియా నేర వ్యవస్థలు సహాయం చేస్తున్నా తీసుకోవడం తప్ప అక్కడ ప్రజలకు మార్గం లేకుండా పోయింది.

చాలా మంది ఆకలికేకలు ఇటలీలో వినిపిస్తున్నాయి. పిల్లలకు ఆకలి తీర్చడానికి తల్లులంతా ఇప్పుడు ఈ మాఫియా డాన్లకు ఫోన్లు చేసి ఆదుకోవాలని..కాస్త తిండి పంపించాలని వేడుకుంటున్నారట.. దీంతో కరుడుగట్టిన నేరగాళ్లు సైతం కరిగిపోయి వారికి సహాయం చేస్తున్నారు.అయితే దీనివెనుక పెద్ద స్కెచ్చే దాగి ఉందట..

ఇటలీలో కరోనా కేసులు, మరణాలు చాలా ఎక్కువగా నమోదయ్యాయి. లాక్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. పరిస్థితి దారుణ సంక్షోభంలో ఉంది. దీంతో చాలా మంది నిస్సహాయంగా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో మాఫియా సాయం తీసుకోవాలా? లేక ఆకలితో చావాలా అన్న విషయంలో ప్రజలు సందిగ్ధంలో పడ్డారు. సాయం తీసుకోవడానికే ముందుకొచ్చారు. అయితే తర్వాత వారితో ఇబ్బందులు వస్తాయా? వేరే పనిని తమతో చేయించుకుంటారో అన్న భయం ప్రజలను వెంటాడుతోందట..

అయితే ప్రస్తుతం ఇటలీలో ప్రజల అసహాయతను చూసి అప్పులు ఇస్తున్న మాఫియా తర్వాత ఆ అప్పుకు ఏం ప్రతిఫలం ఆశిస్తుందోనన్న భయం వెంటాడుతోంది. ఈ క్రమంలోనే బ్లాక్ మనీని పెద్ద ఎత్తున వైట్ మనీగా మాఫియా మార్చేస్తోందట.. ఈ కరోనా విపత్తు చాలా మంది ఇటాలియన్ల జీవితాలని సంక్షోభంలోకి నెట్టివేస్తోంది. మాఫియాకు మాత్రం లాభాలను చేకురుస్తున్నాయట..

ఈ క్రమంలోనే మాఫియా కంటే ముందే ప్రభుత్వం ప్రజలకు సహాయం చేస్తే మాఫియాను నివరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇటలీ ప్రభుత్వం సైతం అవసరమైన వ్యాపారాలకు 22వేల పౌండ్లు అప్పుగా ఇస్తామని ప్రకటించింది. అయితే ఆ అప్పు తీర్చడం కరోనా తర్వాత కష్టమని చాలా మంది రెస్టారెంట్ వ్యాపారులు మాఫియాకే తమ ఆస్తులు రెస్టారెంట్లు అమ్మేసుకుంటున్నారు.

ఇలా ప్రజల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకొని తమ దగ్గరున్న నల్లధనంతో ఆస్తులు పోగేసుకుంటూ ప్రజలను తమ గుప్పిట పెట్టుకుంటున్నారు మాఫియా డాన్ లు..
Tags:    

Similar News