సింధు జలాలు.. పాక్ ను ఎండబెట్టేదుకు భారత్ వ్యూహం!

కొన్నేళ్లుగా పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. ఆపై వరదలతో సతమతం అవుతోంది.

Update: 2024-09-19 17:30 GMT

కొన్నేళ్లుగా భారత్-పాకిస్థాన్ మధ్య విభేదాలు తలెత్తినప్పుడల్లా.. ఉగ్రవాద దాడులు జరిగినప్పుడుల్లా ప్రస్తావనకు వస్తున్నది సింధు నదీ జలాల ఒప్పందం. దీనిని రద్దు చేసుకోవాలంటూ భారత్ నుంచి గట్టి డిమాండ్లు వస్తుంటాయి. ఇప్పుడు అప్పుడు కాదు.. దాదాపు 65 ఏళ్ల కిందట కుదిరిన ఈ ఒప్పదం వాస్తవానికి నదీ జలాల అంతర్జాతీయ పంపకానికి ఒక విజయవంతమైన ఉదాహరణ. అయితే, దీని తర్వాత రెండుసార్లు భారత్-పాక్ యుద్ధం జరిగింది. ఒకసారి బంగ్లాదేశ్ వంటి దేశమే ఆవిర్భించింది. మరోసారి కార్గిల్ చొరబాట్లు బయటపడ్డాయి. కానీ, ఒప్పందం మాత్రం రద్దు కాలేదు. అందుకే దీనిని విజయవంతమైన ఒప్పందంగా చెబుతుంటారు.

పాక్ ను అదను చూసి..

కొన్నేళ్లుగా పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. ఆపై వరదలతో సతమతం అవుతోంది. ఉగ్రవాదం, ధరల పెరుగుదల వంటి మిగతా కష్టాలు ఉండనే ఉన్నాయి. అయితే, ఇప్పుడు భారత్ ఈ పరిస్థితులపై పుండు మీద కారం చల్లేలా ఉంది. సింధు నదీ జలాల ఒప్పందంపై సమీక్ష కోరుతోంది. వాస్తవానికి దీని నుంచి తప్పుకొనేందుకు ఓ అవకాశం ఉంది. పాకిస్థాన్ తమకు వ్యతిరేకంగా తీవ్రవాద గ్రూపులను ప్రోత్సహిస్తోందని చెబుతూ తప్పుకోవచ్చు. మౌలిక పరిస్థితుల్లో మార్పులు ఉంటే, ఏ ఒప్పందాన్నైనా రద్దు చేసుకోవచ్చని అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టం చేస్తోంది. దీనినే సాకుగా చూపుతూ సింధు నది జలాల ఒప్పందం నుంచి వైదొలగొచ్చు.

సింధు నది జలాల ఒప్పందం తొమ్మిదేళ్ల చర్చోపచర్చల తర్వాత 1960 సెప్టెంబరు 19న కుదిరింది. సింధు నది పరివాహక ప్రాంతం 11.2 లక్షల కిలోమీటర్లు. పాక్ లో 47 శాతం, భారత్‌ లో39 శాతం ప్రవహిస్తుంది. చైనాలో 8 శాతం, అప్గానిస్థాన్ లో 6 శాతం పారుతుంది. కాగా, రెండేళ్ల కిందట కూడా ఈ ఒప్పందంపై చర్చలు జరిగాయి. లద్దాఖ్‌ లో భారత జల విద్యుత్ ప్రాజెక్టులపై పాక్ అభ్యంతరం తెలపడమే దీనికి కారణం. నదీ జలాల పంపకాలతో పాటు పరస్పరం నెలకొన్న ఆందోళనలపై నాడు చర్చించారు. మళ్లీ ఇప్పుడు భారత్ మరోసారి పాక్ కు లేఖ రాసింది. పరిస్థితుల్లో సమూల మార్పులు వచ్చినందున సింధు జలాల పంపిణీ ఒప్పందాన్ని సమీక్షించక తప్పదని నోటీసు ఇచ్చింది. గత నెల 30నే పాక్‌ కు ఈ నోటీసు జారీచేసింది.

మూడో భాగస్వామి వరల్డ్ బ్యాంక్

గమనార్హం ఏమంటే.. భారత్-పాక్ కాకుండా సింధు నదీ జలాల ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు మూడో పక్షం. రెండు దేశాల్లో ప్రవహించే సింధు ఉప నదుల జలాల పంపకానికి ఈ ఒప్పందం నిబంధనలను నిర్దేశించింది. అయితే, 60 ఏళ్ల కిందటికి ఇప్పటికి జనాభాలో, పర్యావరణంలో మార్పులు రావడం, హరిత ఇంధనానికి ప్రాధాన్యం పెరగడంతో సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించక తప్పదని భారత్‌ అంటోంది. అన్నిటికిమించి సీమాంతర ఉగ్రవాదం పెరిగిందని కీలక పాయింట్ ను బయటపెట్టింది. కిషన్‌ గంగా, రాట్లే జల విద్యుత్తు ప్రాజెక్టుల మీద కూడా రెండు దేశాల మధ్య వివాదం ఉంది. అందుకే సింధు జలాలపై సమీక్షకు సంబంధించి ఏడాదిన్నరలో పాక్‌ కు భారత్‌ రెండు నోటీసులిచ్చింది. కొన్నేళ్లలో చూస్తే నాలుగు నోటీసులు జారీ చేసింది. కాగా, ఒక అంచనా ప్రకారం సింధు నది చుట్టుపక్కల ప్రాంతాల్లో 30 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లో. .అంటే 1948 ఏప్రిల్ 1న భారత్ రెండు కాలువలకు నీళ్లు ఆపేసింది. పాకిస్థాన్‌ పంజాబ్‌లో 17 లక్షల ఎకరాల్లో వ్యవసాయం దారుణంగా దెబ్బతిన్నది. ఇదీ సింధు జలాల ఒప్పందం రద్దుకు భారత్ చేస్తున్న డిమాండ్ వెనుక అసలు ఉద్దేశం.

Tags:    

Similar News