ఇజ్రాయెల్ త్రినేత్రం 8200.. శివుడి మూడో కన్నంత పవర్ ఫుల్
దీంతో మొన్నటివరకు పెడబొబ్బలు పెట్టిన హెజ్బొల్లా ఉగ్ర సంస్థ నేడు లబోదిబో అంటోంది.
ఏడాది నుంచి జరుగుతోంది ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఇందులో మనకు ఎవరిది పైచేయి అని చెప్పలేం..కానీ, నష్టం మాత్రం అపారంగా ఉంది. ఈ మధ్యలో షిన్ బెట్-మొస్సాద్ వంటి సంస్థలు ప్రస్తావనకు వచ్చాయి. వీటి గురించి ప్రజలకు తెలిసివచ్చింది. మొస్సాద్ అంటే విదేశాల్లో గూఢచర్యం చేసే ఇజ్రాయెలీ సంస్థ. షిన్ బెట్ అంటే దేశంలోపల నిఘాను పర్యవేక్షించే వ్యవస్థ. కానీ, మనకు తెలియని మరో సంస్థ కూడా ఇజ్రాయెల్ కు ఉంది. అది మన శివుడి మూడో కన్ను లాంటిది.. ఇప్పుడా త్రినేత్రాన్నే తెరిచింది ఇజ్రాయెల్. దీంతో మొన్నటివరకు పెడబొబ్బలు పెట్టిన హెజ్బొల్లా ఉగ్ర సంస్థ నేడు లబోదిబో అంటోంది.
8200 ఇదోమిటో? అంటే ఏమిటో..?
ఇరాన్ మద్దతుతో లెబనాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థ హెజ్బొల్లా. ఇరాన్ తో కలిసి ఇజ్రాయెల్ మీద దాడిచేయాలని చూస్తోంది. ఇలాంటి సమయంలోనే దాని కమ్యూనికేషన్లను చిందరవందర చేసింది ఇజ్రాయెల్. తొలుత హెజ్బొల్లా పేజర్లను, తర్వాత వాకీటాకీలను ఆఖరికి సౌర పరికరాలనూ ధ్వంసం చేసింది. దీంతో.. అసలు సెల్ ఫోన్లను వాడని హెజ్బొల్లాకు ఇప్పుడు ‘మాట’ పడిపోయింది. రహస్య సందేశాలు, టాప్ లీడర్ల మెస్సేజ్ లు పంపేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇదంతా చేసింది ఇజ్రాయెల్ సీక్రెట్ యూనిట్ 8200.! మొస్సాద్ తో కలిసి చేసిన ఈ ఆపరేషన్ తో హెజ్బొల్లాకు దిమ్మతిరిగింది. ఇక ఇజ్రాయెల్ 8200 ఇంటెలిజెన్స్ అసలు పేరు ‘యహిద షమోనే మతాయిమ్’. నిజంగా యుద్ధం జరిగితే.. అందులో అరుదైన పరిస్థితులు ఎదురైతే ఎదుర్కొనడం ఎలా? అనేది 8200 ప్రధాన టాస్క్ లలో ఒకటి. అయితే, 8200 ఇజ్రాయెల్ బయట పనిచేస్తుంది. దీని సక్సెస్ ఫుల్ కార్యకలాపాలకు ఓ ఉదాహరణ.. ఇరాన్ అణు కేంద్రంలోని అత్యంత కీలకమైన సెంట్రి ఫ్యూజ్‌లను ధ్వంసం చేయడం.
చురకత్తుల్లాంటివారికే..
డేటా సేకరణ, సైబర్ డిఫెన్స్ 8200 ప్రధాన విధులు. ఇందుకోసం కావాల్సిన పరికరాలను అభివృద్ధి చేస్తుంది. అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీతో కలిసి చాలాసార్లు ఉగ్రవాదుల పనిపట్టింది. కాగా, 8200లో అందరికీ చాన్స్ రాదు. అత్యంత ప్రతిభావంతులు, సృజనాత్మకంగా ఆలోచించి, టెక్నాలజీ తెలిసినవారికే చోటు. అయితే వీరిని హైస్కూల్ స్థాయిలోనే గుర్తిస్తారు. 16-18 ఏళ్ల వయసు కుర్రాళ్లకు హ్యాకింగ్, ఎన్‌క్రిప్షన్, నిఘా శిక్షణ ఇస్తారు. వీరికి ఎంత డిమాండ్ అంటే.. 8200లో పనిచేసి బయటకు వస్తే ఇజ్రాయెల్ లోని హైటెక్ కంపెనీలు రిక్రూట్ చేసుకుంటాయి. ఇన్నోవేటివ్ ఆవిష్కరణలు వాడుకుంటాయి.
ఇజ్రాయెల్ ప్రధానికే రిపోర్ట్..
8200 నేరుగా ఎవరికీ జవాబుదారీ కాదు. నేరుగా ఇజ్రాయెల్ ప్రధానికే రిపోర్ట్ చేస్తుంది. కొన్నాళల కిందట ఐసిస్ ఓ వెస్ట్రన్ కంట్రీపై దాడి చేయబోగా 8200 అడ్డుకుంది. కాగా, మరి ఇంత గొప్ప సంస్థ కూడా ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని పసిగట్టలేకపోయింది. అందుకే 8200 చీఫ్ యాసి సారల్ గత వారం రాజీనామా చేశారు. లెబనాన్ పేజర్ల, వాకీటాకీల్లో పేలుడు పదార్థాలు ఎలా అమర్చవచ్చు. ఎలా పేల్చవచ్చో ప్లానింగ్.. ప్రయోగ పరీక్షలు 8200 కనుసన్నల్లోనే జరిగాయని సమాచారం. చివరకు గత ఏడాది ఘోర వైఫల్యాన్ని మరిపిస్తూ తాజాగా గట్టి దెబ్బకొట్టింది 8200. దీంతో భారీ సంఖ్యలో ఫైటర్లున్న హెజ్బొల్లా చేతులు పడిపోయాయి.