ప్రభుత్వాన్ని పడగొట్టిన ఏక్ నాథ్ తాజా టార్గెట్ అదేనట

Update: 2022-07-10 04:24 GMT
రాజకీయంలో ఉన్న మేజిక్ అదే. ఒక్కోసారి ఎదురుదెబ్బలు వరుస పెట్టి తగులుతుంటాయో.. మరికొన్నిసార్లు అందుకు భిన్నంగా వరుస పెట్టి విజయాలు సొంతమవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తిరుగులేని అధినేతలుగా వ్యవహరించిన వారు.. తర్వాతి కాలంలో వరుస దెబ్బలు పడుతుంటాయి. ఇప్పుడు శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే రెండో పక్షంలో నిలిచారు. ఆయన సర్కారును సొంత పార్టీకి చెందిన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే కూలదోయటమే కాదు.. బాస్ కుర్చీని తాను సొంతం చేసుకోవటం తెలిసిందే.

పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి చీలిపోయి బీజేపీ మద్దతుతో ప్రస్తుతానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఆయనతో భేటీ అయ్యారు. మహారాష్ట్ర విషయంలో మోడీ ప్రత్యేకమైన విజన్ తో ఉన్నారని.. అందుకే ఆయన్ను కలిసినట్లుగా ఏక్ నాథ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తాజాగా శివసేన అధినేత ఉద్దవ్ కు మరో దెబ్బేయటానికి ఏక్ నాథ్ ప్లానింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

మెజార్టీ ఎమ్మెల్యేలు తన పక్షాన ఉన్న నేపథ్యంలో శివసేన పార్టీ గుర్తు తమకే సొంతం కావాలన్న ఎత్తుగడను తెర మీదకు తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని మీడియా ఆయన ముందు ఉంచితే.. ఆయన నో చెప్పకుండా.. 'కాలమే బదులిస్తుంది' అంటూ సమాధానం ఇవ్వటం గమనార్హం. పార్టీ గుర్తు కోసం పోరాటం తన ఒక్కడిదే కాదని.. తన తోటి సభ్యులతో చర్చించాలన్నారు. ఇదే అంశం మీద మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను ఒప్పించేందుకు తాను ప్రయత్నిస్తున్నాని.. తమ అభ్యర్థనలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయని చెప్పారు.

ఇదంతా చూస్తే.. శివసేన ఎన్నికల గుర్తు మీద ఏక్ నాథ్ షిండే కన్నేసినట్లుగా చెప్పక తప్పదు. ఒకప్పటి అధినేత అయిన ఉద్దవ్ తో నేరుగా.. ఆయన అధ్యక్షుడిగా ఉన్న పార్టీ గుర్తును అడిగేసిన వైనాన్ని ఏక్ నాథ్ వెల్లడించిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. సంఖ్యా బలాన్ని.. సాంకేతిక అంశాల్ని పక్కన పెడితే.. శివసేన పార్టీని స్థాపించింది బాల్ ఠాక్రే కాగా.. ఆయన కుమారుడు పార్టీ అధినేతగా ఉన్నారు. ఇప్పుడు సీఎంగా వ్యవహరిస్తున్న ఏక్ నాథ్ షిండే.. ఏకంగా పార్టీ గుర్తుకే టార్గెట్ పెట్టేసిన తీరు షాకింగ్ గా మారిందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News