ట్రంప్ అధ్య‌క్షుడిగా అన్ ఫిట్‌...51% ఓట‌ర్లు!

Update: 2017-09-28 09:41 GMT
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్య‌క్ష ప‌దవికి పోటీ చేసిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌పై చాలామంది అమెరికన్ల‌కు వ్య‌తిరేక‌త ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న త‌మ అధ్యక్షుడు కావ‌డం ఇష్టం లేద‌ని సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ప్ర‌చారం జ‌రిగింది. కొన్ని మీడియా సంస్థ‌లు కూడా ట్రంప్ ప‌ట్ల వ్య‌తిరే ప్ర‌చారం చేశాయి. వీట‌న్నింటినీ ఛేదించుకుని ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడ‌య్యారు. ఆయ‌న అధ్య‌క్షుడ‌య్యాక కూడా ట్రంప్ వ్యతిరేక నిర‌స‌న‌లు కొన‌సాగాయి. ట్రంప్ కు వ్య‌తిరేకంగా ల‌క్ష‌లాది మంది మ‌హిళ‌లు పింక్ ర్యాలీ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, జ‌రిగిన పోల్ లో కూడా ట్రంప్ కు వ్య‌తిరేకంగా అమెరిక‌న్లు ఓటు వేశారు. ట్రంప్ త‌మ అధ్య‌క్షుడిగా ఉండటాన్ని వ్య‌తిరేకిస్తూ దాదాపు 51 శాతం మంది ఓటు వేయ‌డం గ‌మ‌నార్హం.

ట్రంప్ అధ్య‌క్షుడిగా సేవ‌లందించ‌డంపై ఓ సంస్థ స‌ర్వేను చేప‌ట్టింది. క్విన్నిపియాక్ పోల్ ప్ర‌కారం ట్రంప్ కు వ్య‌తిరేకంగా 51 శాతం మంది ఓటు వేశారు. అంతేకాకుండా, ఆయ‌న అమెరికా అధ్య‌క్షుడిగా కొన‌సాగడం త‌మ‌కు ఇబ్బందిక‌రంగా ఉంద‌ని చెప్పారు. 59 శాతం మంది ట్రంప్ నిజాయితీప‌రుడుకాద‌ని, 60 శాతం మంది ట్రంప్ కు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు లేవ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను, ఆకాంక్ష‌ల‌ను గౌర‌వించ‌డ‌ని 61 శాతం మంది, ట్రంప్ ట్వీట్లు చేయ‌డం ఆపాల‌ని 69 శాతం మంది చెప్పారు. 50 శాతం మంది శ్వేత జాతీయులు ట్రంప్ ప‌రిపాల‌న‌ను అంగీక‌రిస్తామ‌ని, 94 శాతం మంది న‌ల్ల‌జాతీయులు ట్రంప్ పాల‌న‌ను వ్య‌తిరేకిస్తున్నామ‌ని ఓటు వేశారు.

జాతి వివ‌క్ష‌ను అరిక‌ట్ట‌డంలో ట్రంప్ అవ‌లంబించిన విధానాలు బాగోలేవ‌ని 62 శాతం మంది అభిప్రాయ‌ప‌డ్డారు. దేశాన్ని విభ‌జించ‌డానికి ట్రంప్ అధికంగా మొగ్గు చూపుతున్నార‌ని 60 శాతం మంది  చెప్పారు. ట్రంప్ దేశాధ్యక్షుడిగా ఉండ‌డానికి అన‌ర్హుడ‌ని 94 శాతం మంది డెమోక్రాట్లు, అర్హుడేన‌ని 84 శాతం మంది రిప‌బ్లిక‌న్లు అభిప్రాయ‌ప‌డ్డారు. 57 శాతం ఇండిపెండెంట్ ఓట‌ర్లు ట్రంప్ పాల‌న‌ను స‌మ‌ర్ధించ‌గా, 40 శాతం మంది వ్య‌తిరేకించారు. 2018 లో సెనేట్ పై డెమోక్రాట్లు ఆధిప‌త్యం సాధించాల‌ని 49 శాతం మంది డెమోక్రాట్లు ఓటు వేశారు. సెప్టెంబ‌రు 21 నుంచి 26 మ‌ధ్య జ‌రిగిన ఈ పోల్ ఫ‌లితాలు బుధ‌వారం వెలువ‌డ్డాయి.
Tags:    

Similar News