చెన్నై రైలు దొంగ‌కు మ‌లేషియాలో హోట‌ల్!

Update: 2019-05-18 04:56 GMT
ఒక దొంగ‌ను ప‌ట్టుకున్నారు. చోరీ కేసులో అడ్డంగా బుక్ అయిన అత‌గాడిని విచారించే క్ర‌మంలో.. అత‌గాడు తానెవ‌రో చెప్ప‌టం షురూ చేశారు. అత‌డు చెప్పిన వివ‌రాల్ని విన్న పోలీసులు అవాక్కు అయ్యే ప‌రిస్థితి. రైల్లో దొంగ‌త‌నాలు చేయ‌టం కోసం విమానంలో ప్ర‌యాణం చేసే అత‌గాడికి మ‌లేషియాలో హోట‌ల్ న‌డుపుతున్న వైనం పోలీసుల‌కు నోట మాట రాకుండా చేసింది. చెన్నై రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్న ఈ ఘ‌రానా దొంగ వ్య‌వ‌హారాలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

త‌మిళ‌నాడులోని చెన్నై నుంచి సేలం వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్లలో అర్థ‌రాత్రి వేళ వ‌రుస‌గా చోరీలు జ‌రుగుతున్నాయి. దీంతో.. దొంగ‌ల్ని ప‌ట్టుకోవ‌టానిక ప్ర‌త్యేక బృందాన్ని సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ప‌క్కా స్కెచ్ వేశారు. మ‌హిళా పోలీసుతో క‌లిసి దంప‌తుల త‌ర‌హాలో ఒక‌రు.. వారిని అనురిస్తూ మిగిలిన పోలీసులు ఒక బృందంగా ఏర్ప‌డి రైల్లో ప్ర‌యాణించారు.

ఇవేమీ తెలియ‌న దొంగ ఎప్ప‌టిలా అర్థ‌రాత్రి వేళ బ్యాగ్ తీసుకొని పారిపోయే ప్ర‌య‌త్నం చేశారు. మారువేషంలో ఉన్న పోలీసులు అత‌గాడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ‌లో దొంగ చెప్పిన విష‌యాలు విని అవాక్కు అయిన ప‌రిస్థితి. ఈ రైలు దొంగ‌ను కేర‌ళ‌కు చెందిన సాహుల్ అమీద్ గా గుర్తించారు. ఆరు భాష‌ల్లో మాట్లాడే ఇత‌గాడికి ఇద్ద‌రు భార్య‌ల‌తో స‌హా మ‌లేషియాలో ఒక హోట‌ల్ న‌డుపుతున్నట్లు తెలుసుకున్నారు.

మ‌లేషియాలో ఇత‌డి కుటుంబం ఉంద‌ని.. అక్క‌డి నుంచి ఫ్లైట్ లో చెన్నైకి వ‌చ్చి రైళ్ల‌ల్లో దొంగ‌త‌నాలు చేస్తుంటార‌ని గుర్తించారు. ముంద‌స్తుగా ఏసీ రైళ్ల‌లో టికెట్ బుక్ చేసుకునే ఇత‌గాడు.. అర్థ‌రాత్రి వేళ ప్ర‌యాణికుల వ‌స్తువుల్ని త‌స్క‌రిస్తాడు. అనంత‌రం తాను చోరీ చేసిన న‌గ‌ల్ని వివిధ ప్రాంతాల్లో అమ్మేసి సొమ్ము చేసుకుంటాడు. అంతేకాదు.. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని చెబుతూ ప‌లువురిని మోసం చేసిన వైనాన్ని గుర్తించారు.

మలేషియాలో మంచి హోట‌ల్ పెట్టుకొని.. దాన్ని న‌డుపుకోక‌.. షార్ట్ క‌ట్ లో భారీ ఎత్తున సంపాదించాల‌న్న ద‌రిద్ర‌పు ప్లాన్ ఇప్పుడు జైలుకు వెళ్లేలా చేసింది. మొత్తానికి ఈ ఘ‌రానా దొంగ ఎపిసోడ్ పోలీసు వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News