రాజయ్యకు వర్తించినరూల్ కేసీఆర్‌ కి వర్తించదా?

Update: 2015-11-03 04:18 GMT
యూపీఏ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవిని వెలగబెట్టిన సమయంలో కేసీఆర్ నిర్వాకాలపై సీబీఐ ఇంటరాగేషన్‌ పై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ సీఎం కె. చంద్రశేఖరరావును ఆక్షేపించారు. సహారా కంపెనీకి ప్రావిడెంట్ ఫండ్‌ ను సొంతంగా నిర్వహించేందుకు కేసీఆర్ అనుమతివ్వడంపై విచారణకు ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ తాము సుప్రీంకోర్టు తలుపులు తట్టడానికి కూడా సిద్ధమేనని మల్లు చెప్పారు.

అవినీతి ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్యను ఉన్నఫళాన పదవినుంచి తొలగించిన కేసీఆర్ తనపై ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని ఎలా అంటిపెట్టుకున్నారంటూ మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాజయ్య విషయంలో వర్తించిన నిబంధన కేసీఆర్‌కు వర్తించదా అని మల్లు ఎద్దేవా చేశారు.

తనకు తానుగా రాజీనామా చేస్తారా లేదా తనపై తానే స్వయం శిక్ష విధించుకుంటారో కేసీఅర్ స్పష్టం చేయాలని మల్లు డిమాండ్ చేసారు. సీబీఐ దర్యాప్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకనైనా నోరు విప్పాలని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. రాజయ్య చేసినట్లుగా చెబుతున్న అవకతవకలపై మీడియాకు లీకులిచ్చి మరీ కేసీఆర్ ఆయన్ని పదవినుంచి తొలగించారని మరి అంతకన్నా అవకతవకలకు పాల్పడిన కేసీఆర్ విషయంలో ఆయన మద్దతుదారులు ఇప్పుడు ఎందుకు నోరు మెదపటం లేదని మల్లు నిలదీశారు.

కాని మల్లు భట్టివిక్రమార్గకు అర్థం కాని విషయం ఒకటుంది. పదేళ్లకు ముందు తను చేసిన నిర్వాకాలకు ఫలితం ఇలా ఎదురవుతుందని ఊహించని కేసీఆర్ ఆ షాక్ నుంచి తేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది కదా. ఫాం హౌస్‌ లో కాస్త రెస్టు తీసుకుంటే తప్ప కేసీఆర్‌ నోరు తెరుచుకోదాయె. అయినా వెంటనే స్పందించడానికి ఇదేమన్నా కోటిరూపాయల వ్యవసాయమా..
Tags:    

Similar News