క‌ర్ణాట‌క త‌ర్వాత బీజేపీ టార్గెట్ స్టేట్లు అవేన‌ట‌!

Update: 2019-07-11 07:46 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఫ‌లితాల‌తో క‌మ‌ల‌నాథుల్లో పెరిగిన కాన్ఫిడెన్స్ ఎలా ప‌ని చేస్తున్న‌దే దేశమంతా చూస్తున్న‌ది. మోడీ మీద న‌మ్మ‌కంతో.. విశ్వాసంతో రెండోసారి అధికారాన్ని అప్ప‌జెబితే.. అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా ఎగ‌రాల‌న్న ప్ర‌య‌త్నం ఇప్పుడు అత్యుత్సాహ‌పు చ‌ర్య‌గా మారింది. ద‌రిద్ర‌పుగొట్టు రాజ‌కీయాల్ని దేశానికి నేర్పిన కాంగ్రెస్ ను మించిపోయిన రీతిలో తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఇప్పుడు అంద‌రిని విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. ఒక‌టి త‌ర్వాత ఒక‌టి అన్న‌ట్లు కాకుంటే.. ఒకే స‌మ‌యంలో ప‌లు రాష్ట్రాల్లో ఆప‌రేష‌న్లు నిర్వ‌హిస్తున్న వైనం చూస్తే.. మోడీషాల దూకుడు మామూలుగా లేద‌ని చెప్పాలి.

మొన్న‌టి వ‌ర‌కూ ప‌శ్చిమ‌బెంగాల్ లో ఎదురులేని రీతిలో ఉన్న దీదీ కోట‌కు తాము చేసి క్రాక్స్ ఎలాంటివ‌న్న విష‌యాన్ని సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో చెప్ప‌క‌నే చెప్పేశారు మోడీషాలు. సార్వ‌త్రిక విజ‌యం త‌ర్వాత నుంచి బెంగాల్ లో రాజ‌కీయాలు అంత‌కంత‌కూ వేడెక్కిపోవ‌టమే కాదు..ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు తెర తీస్తున్నాయి. కొద్ది నెల‌ల వ్య‌వ‌ధిలో బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే అక్క‌డ త‌మ జెండా పాతిన మోడీషాల‌తో మ‌మ‌త తెగ ఇబ్బంది ప‌డుతున్నారు.

గ‌తంలో ఏ రాష్ట్రంలో ఏమైతే నాకేంద‌న్న‌ట్లుగా ఉన్న దీదీ.. ఇప్పుడు తానే స్వ‌యంగా రంగంలోకి దిగారు. క‌ర్ణాట‌క‌లో ప్ర‌స్తుతం నెల‌కొన్న రాజ‌కీయ‌ సంక్షోభం గురించి ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త రియాక్ట్ అయ్యారు. క‌ర్ణాట‌క‌లో ప్ర‌స్తుత ప‌రిస్థితికి కార‌ణంగా బీజేపీనేన‌ని తేల్చిన ఆమె..   రాజ్యాంగం ఇప్పుడు ప్ర‌మాదంలో ప‌డింద‌ని.. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్య‌త అందరి  మీదా ఉంద‌న్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను బంధించార‌ని మీడియాలో వార్త‌లు వ‌స్తుంటే విన్నాన‌ని.. వారున్న ప్ర‌దేశానికి కొన్ని మీడియా సంస్థ‌ల‌ను కూడా రానివ్వలేక‌పోవ‌టాన్ని ప్ర‌స్తావించారు. ఎమ్మెల్యేల‌ను మ‌ధ్య పెడుతున్నార‌ని.. ఇలాంటి ప‌రిస్థితులే కొన‌సాగితే ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డింద‌న్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని బ‌లోపేతం చేసేందుకు ప్రాంతీయ‌ రాజ‌కీయ పార్టీలు అన్ని ఏకం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

దేశ వ్యాప్తంగా కాషాయ‌జెండా ఎగ‌రేయాల‌నే దురుద్దేశ‌తో ఉన్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. అన్ని రాష్ట్రాల్లో పాగా వేయాల‌న్న ఆలోచ‌న వారికెందుకు?   వారివి చెత్త రాజ‌కీయాలుగా మ‌మ‌త అభివ‌ర్ణించారు. త‌న‌కు తెలిసి క‌ర్ణాట‌క మోడీషాల తొలి టార్గెట్ అని త‌ర్వాతి కాలంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. రాజ‌స్థాన్ లోనే ప‌వ‌ర్ ను చేతులు మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తార‌ని.. ఇదేమాత్రం మంచిదికాద‌న్నారు. అంద‌రి గురించి  బాధ ప‌డుతున్న దీదీ.. త‌న రాష్ట్రం మీద క‌మ‌ల‌నాథులు పెట్టిన గురి గురించి మాత్రం ప్ర‌స్తావించ‌క‌పోవ‌టం వెన‌కున్న అస‌లు కార‌ణం ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్పదు. దీదీ ప్ర‌స్తావించ‌కున్నంత మాత్రాన బెంగాల్ ను మోడీషాలు విడిచిపెడ‌తారా ఏంది?
Tags:    

Similar News