రాహుల్ నాకంటే జూనియ‌ర్ అన్న‌దీదీ!

Update: 2018-07-08 04:49 GMT
ఏమైనా స‌రే బీజేపీకి వ్య‌తిరేకంగా.. మోడీ అధికారానికి షాకిచ్చేలా కూట‌మి ఒక‌టి ఏర్ప‌డాల‌న్న ప్ర‌య‌త్నాలు జోరుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రెండోసారి మోడీ ప్ర‌ధాని కాకూడ‌ద‌న్న ప‌ట్టుద‌ల‌ను ప్ర‌తిపక్షాలు ప్ర‌ద‌ర్శిస్తున్న వేళ ఊహించ‌ని రీతిలో ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి.. తృణ‌మూల్ కాంగ్రెస్ సార‌థి మ‌మ‌తా బెన‌ర్జీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

ఓప‌క్క తృణ‌మూల్ తో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల పొత్తు గురించి ప్ర‌య‌త్నిస్తున్న వేళ‌.. రాహుల్ త‌న కంటే చాలా జూనియ‌ర్ అన్న వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగా మారాయి. బీజేపీ పాల‌న‌ను అంత‌మొందించేందుకు కాంగ్రెస్ తో ప‌ని చేయ‌టానికి తాను విముఖం కాదంటూనే..రాహుల్ బాగా జూనియ‌ర్ అన్న మాట‌ల్ని దీదీ నోటి నుంచి రావ‌టం గ‌మ‌నార్హం.

ఎవ‌రితోనైనా క‌లిసి ప‌ని చేయ‌టానికి సిద్ధం.. వారి ఆలోచ‌న‌లు.. భావ‌సారూప్య‌త‌.. స‌మ‌ర్థ‌త అన్నీ ముఖ్యం. ఇవ‌న్నీ స్ప‌ష్టంగా ఉన్న‌ప్పుడు క‌లిసి ప‌ని చేయ‌టానికి ఎలాంటి అభ్యంత‌రం లేదంటూనే ఇవ‌న్నీ తాను ఒక్క‌దాన్ని నిర్ణ‌యించ‌లేన‌ని ప్రాంతీయ ప‌క్షాల‌న్నీ అనుకోవాల‌న్నారు. కొన్ని ప్రాంతీయ‌పార్టీలు కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ నిర్మాణానికి రెఢీగా ఉన్నాయ‌న్న ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చిన ఆమె.. ఆయా రాష్ట్రాల్లో నెల‌కొన్న రాజ‌కీయ పార్టీల ప‌రిస్థితి అలా ఉంద‌న్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ప్ర‌ధాని ప‌ద‌విని చేప‌ట్టే విష‌యంపై అడిగిన ప్ర‌శ్న‌కు సూటిగా స‌మాధానం చెప్ప‌ని దీదీ.. దాట‌వేత ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌ధాని ప‌ద‌విపై ఆస‌క్తి లేదంటూనే.. ప్ర‌ధాని అభ్య‌ర్థిత్వానికి త‌యారు కావ‌టం కంటే తొలుత క‌లిసి ప‌ని చేయ‌టం ముఖ్య‌మ‌న్న ఆమె.. తాను సామాన్యురాలిన‌ని దొరికిన దాంతో తృప్తి ప‌డ‌తానంటూ స‌మాధానం ఇవ్వ‌టం గ‌మ‌నార్హం. ఓవైపు రాహుల్ త‌న‌కంటే చాలా జూనియ‌ర్ అంటూనే.. మ‌రోవైపు ప్ర‌ధాని ప‌ద‌విపై దీదీ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.
Tags:    

Similar News