అదేంది కేసీఆర్ సార్..గ్రాఫ్ ప‌డిపోతున్న‌ట్లుంది!

Update: 2018-08-20 08:25 GMT
జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పుతాన‌ని బీరాలు ప‌లికే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఏ మాత్రం అవ‌కాశం చిక్కినా.. జాతీయ స్థాయిలో కూట‌మి పెట్టేందుకు ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుల ప‌ప్పులు ఉడ‌క‌టం లేదు. మూడ్ ఆఫ్ ది నేష‌న్ పేరుతో చేప‌ట్టిన స‌ర్వే ఇద్ద‌రు చంద్రుళ్లకు జాతీయ‌స్థాయిలో వారి స్థానం ఎక్క‌డ‌న్న విష‌యాన్ని చెప్పేశారు.

రాష్ట్రాల ముఖ్య‌మంత్రులుగా వ్య‌వ‌హ‌రిస్తూ జాతీయ స్థాయిలో ప్ర‌భావం చూపించే స‌త్తా ఉన్న ముఖ్య‌మంత్రుల‌కు సంబంధించిన స‌ర్వే ఒక‌టి నిర్వ‌హించారు. ఇందులో ప్ర‌ధాని మోడీని ఢీ కొనే స‌త్తా ఉన్న సీఎంగా ప‌శ్చిమ‌బెంగాల్ దీదీ మ‌మ‌తాకు మొద‌టిస్థానం ద‌క్కింది. ఆమె త‌ర్వాతి స్థానంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌.. బిహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ లు నిలిచారు. వీరిద్ద‌రూ రెండో స్థానానికి ప‌రిమిత‌మ‌య్యారు.

ఇదిలా ఉంటే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ తొమ్మిది శాతం ఓట్ల‌తో మూడో స్థానంలో నిల‌వ‌గా.. ప్ర‌త్యేక హోదా అంశంపై మోడీపై నిప్పులు క‌క్కుతూ.. ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏడు శాతం ఓట్ల‌తో నాలుగో స్థానంలో నిలిచారు.

చ‌త్తీస్ గ‌ఢ్ ముఖ్య‌మంత్రి ర‌మ‌ణ్ సింగ్.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఇద్ద‌రు ఐదోస్థానంలో నిలిచారు. ఇక‌.. ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ నాలుగు శాతం ఓట్ల‌తో నిలిచారు. ఇంతే శాతం ఓట్ల‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు వ‌చ్చాయి. వీరిద్ద‌రూ ఆరో స్థానంలో నిలిచారు. ఓప‌క్క బీజేపీ.. కాంగ్రెస్ పార్టీల‌కు ప్ర‌త్యామ్న‌యంగా నిలుస్తామ‌ని.. త్వ‌ర‌లో భారీ విజ‌న్ ప్లాన్ తో బ‌య‌ట‌కు రానున్న‌ట్లుగా గొప్ప‌లు చెప్పే కేసీఆర్ మాట‌లు జాతీయ స్థాయిలో ఎలాంటి ప్ర‌భావాన్నిచూపించ‌లేద‌న్న విష‌యాన్ని తాజా స‌ర్వే స్ప‌ష్టం చేసింద‌ని చెప్పాలి.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. జాతీయ స్థాయిలో ఆరోస్థానంలో నిలిచిన న‌వీన్ ప‌ట్నాయ‌క్.. ఒడిశా రాష్ట్ర స్థాయిలో మాత్రం ఆయ‌న ఆద‌ర‌ణ మొద‌టిస్థానంలో నిల‌వ‌టం గ‌మ‌నార్హం. ఇక‌.. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి మూడు శాతం.. అసోం సీఎం సోనోవాల్ కు 3 శాతం రాగా.. గోవా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారీక‌ర్ కు రెండు శాతం ల‌భించాయి. బీజేపీ ముఖ్య‌మంత్రులు మ‌నోహ‌ర్ లాల్ క‌ట్టర్ (హ‌ర్యానా).. దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ (మ‌హారాష్ట్ర)లు రెండు శాతం రాగా.. పంజాబ్ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ సైతం రెండు శాతం ఓట్ల‌నే పొంద‌గ‌లిగారు. చూస్తుంటే.. రాష్ట్రాల్లో పోటుగాళ్లుగా ఉన్న అధినేత‌లు.. జాతీయ స్థాయిలో మాత్రం చ‌తికిల ప‌డ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News