దీదీ యూట‌ర్న్.. మోడీపై నిప్పులు చెరిగారు

Update: 2019-05-29 11:43 GMT
దేశ ప్ర‌ధానిగా న‌రేంద్ర‌మోడీ రెండో సారి ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న నేప‌థ్యంలో ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని భావించారు ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ. తొలుత మోడీ ప్ర‌మాణ‌స్వీకారానికి వెళ‌తారా?  లేదా? అన్న సందేహం ఉన్న‌ప్ప‌టికీ.. తాజాగా చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె మోడీ ప్ర‌మాణ‌స్వీకారానికి వెళ్లాల‌ని నిర్ణ‌యించి.. అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

దీదీ నిర్ణ‌యంతో మోడీతో ఆమె సంధికి సిద్ధ‌మ‌వుతుంద‌న్న మాట వినిపించింది. ఇదిలా ఉంటే.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా చోటు చేసుకున్న హింస‌తో.. బీజేపీకి చెందిన ప‌లువురు కార్య‌క‌ర్త‌లు హ‌త్య‌కు గుర‌య్యార‌ని.. వారి కుటుంబాల‌కు చెందిన 50 మందిని త‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి ప్ర‌త్యేక ఆహ్వానితులుగా పిలిచిన మోడీ నిర్ణ‌యంపై దీదీ నిప్పులు చెరిగారు.

అంద‌రు ముఖ్య‌మంత్రుల‌తో సంప్ర‌దించిన త‌ర్వాత మోడీ ప్ర‌మాణ‌స్వీకారానికి వెళ్లాల‌ని ప్ర‌క‌టించిన ఆమె.. తాజాగా తాను ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి వెళ్ల‌టం లేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న నిర్ణ‌యం మార‌టం వెనుక మోడీ వ్య‌వ‌హ‌రించిన తీరే కార‌ణంగా ఆమె మండిప‌డుతున్నారు. తాజాగా ఒక ట్వీట్ చేసిన ఆమె.. మోడీ ప్ర‌మాణ‌స్వీకారానికి దూరంగా ఉండాల‌ని డిసైడ్ అయిన‌ట్లు పేర్కొన్నారు.

ప‌శ్చిమ‌బెంగాల్ లో హింసాకాండ‌లో మృతి చెందిన 54 మంది వ్య‌క్తుల కుటుంబాల‌ను ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి మోడీ ఆహ్వానించ‌ట‌మే కార‌ణంగా చెబుతున్నారు. ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం అన్న‌ది ప్ర‌జాస్వామ్యానికి పండుగ‌లాంటిద‌ని.. అలాంటి కార్య‌క్ర‌మంలో ఏ పార్టీని కించ‌పరిచేలా ఉండ‌కూడ‌ద‌ని ఆమె పేర్కొన్నారు. త‌న నిర్ణ‌యాన్ని ట్వీట్ రూపంలో పేర్కొన్న మ‌మ‌త‌.. కొత్త ప్ర‌ధాని మోడీకి అభినంద‌న‌లు. రాజ్యాంగ‌ప‌ర‌మైన ఆహ్వానాన్ని అంగీక‌రించి ప్ర‌మాణ‌స్వీకారానికి హాజ‌రు కావాల‌ని అనుకున్నా. చివ‌రి క్ష‌ణంలో బెంగాల్ లో జ‌రిగిన హింసాకాండ‌లో 54 మంది ప్రాణాలు కోల్పోయారంటూ బీజేపీ చెప్పిన‌ట్లుగా మీడియాలో వార్త‌లు చూశాను. ఇది పూర్తిగా అబ‌ద్ధం. బెంగాల్ లో రాజ‌కీయ హ‌త్య‌లు జ‌ర‌గ‌లేదు. మ‌ర‌ణాల‌కు కార‌ణం.. వ్య‌క్తిగ‌త శ‌త్రుత్వం.. కుటుంబ క‌ల‌హాలు.. ఇత‌ర వివాదాలు. వాటికి రాజ‌కీయాల‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. బీజేపీ చేసిన క్లెయిమ్ వ‌ల్లే ప్ర‌మాణ‌స్వీకారానికి దూరంగా ఉండ‌ని ప‌రిస్థితి అని చెప్ప‌టానికి చింతిస్తున్నా.. మోడీజీ .. ఐయామ్ సారీ అంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి సంధికి సిద్ధ‌మ‌య్యార‌న్న భావ‌న‌లో ఉన్న దీదీ.. అలాంటిదేమీ లేద‌న్న‌ట్లుగా ఆమె తాజా వ్యాఖ్య‌లు స్ప‌ష్టం చేస్తున్న‌ట్లుగా చెప్పాలి.
Tags:    

Similar News